మెగా‌పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు గాయాలు.. RRR షూటింగ్ వాయిదా..!

మెగా‌పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు గాయాలు.. RRR షూటింగ్ వాయిదా..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ (NTR) హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందుతోన్న చిత్రం #RRR. ఈ సినిమా గ‌తేడాది న‌వంబ‌ర్‌లో తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా; మార్చి 29న గుజ‌రాత్‌లోని వ‌దోద‌ర ప్రాంతంలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు.


కొద్దిరోజుల‌ ముందు జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా.. తన వ‌దోద‌ర‌ ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్స్‌ను అభిమానుల‌తో పంచుకున్న విష‌యం మ‌న‌కు విదిత‌మే! ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు (Alluri Seetha Rama Raju) పాత్రలోనూ.. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ (Komrum Bheem) పాత్రలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.


అయితే నిన్న అనుకోకుండా జ‌రిగిన ఒక సంఘ‌ట‌న ఇప్పుడు RRR చిత్రీక‌ర‌ణను వాయిదా వేసేలా చేసింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న రోజువారీ వ్యాయామంలో భాగంగా క‌స‌ర‌త్తులు చేస్తుండ‌గా.. కాలి మ‌డ‌మ భాగంలో గాయ‌మైంద‌ట‌. వెంట‌నే చిత్ర యూనిట్, రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్ వ్య‌క్తిగ‌త శిక్ష‌కుడు వైద్యుడిని సంప్ర‌దించ‌గా.. స్కాన్ చేయించి మ‌డ‌మ భాగంలో చిన్న‌పాటి గాయ‌మైంద‌ని తేల్చారు.


 కానీ ఈ గాయం నుండి చెర్రీ పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే.. మూడు వారాల పాటు త‌గినంత విశ్రాంతి ఇవ్వాల‌ని వైద్యులు సూచించార‌ట‌! దీంతో ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న వ‌దోద‌ర షెడ్యూల్‌ని, దీని త‌ర్వాత జ‌ర‌గ‌నున్న పుణె షెడ్యూల్‌ని కూడా వాయిదా వేసింద‌ట ఈ చిత్ర బృందం.


ఈ విష‌యం తెలియ‌గానే చెర్రీ అభిమానులు.. త‌మ అభిమాన న‌టుడికి ఏం జ‌రిగిందోన‌ని ఆందోళ‌న‌కు గుర‌య్యారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. కానీ అంత భ‌య‌ప‌డాల్సిందేమీ లేదని, ఇది చిన్న గాయం మాత్ర‌మే అని.. దీని నుంచి మిస్ట‌ర్ సీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాన‌ని.. చెర్రీ స‌తీమ‌ణి ఉపాస‌న సామాజిక మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేశారు.


దీంతో అభిమానులు కాస్త కుదుటప‌డ్డారు. అయితే అనుకోకుండా వ‌చ్చిన ఈ అంతరాయం కార‌ణంగా వ‌చ్చే ఏడాది ప్ర‌క‌టించిన తేదీకి ఈ సినిమాను విడుద‌ల చేస్తారా? లేదా? అనే ప్ర‌శ్న చాలామందిలో తలెత్తుతోంది. కానీ విడుద‌ల తేదీని ఎట్టి ప‌రిస్థితుల్లో వాయిదా వేసేది లేద‌ని, అనుకున్న స‌మ‌యానికే సినిమాను విడుద‌ల చేస్తామ‌ని గ‌ట్టిగా చెబుతోంది చిత్ర‌బృందం.


 తాజాగా వ‌దోద‌రలో జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా.. షూటింగ్ స్పాట్‌లో రామ్ చ‌ర‌ణ్ & ఎన్టీఆర్‌లు బైక్ పై షికారు చేస్తున్న ఒక వీడియో ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆ వీడియోను కాస్త నిశితంగా గ‌మ‌నిస్తే వీరిద్ద‌రూ ఆయా పాత్ర వేష‌ధార‌ణ‌ల్లో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీనిని చూసిన అభిమానులు ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ మ‌ధ్య ఉన్న స్నేహాన్ని ఒక‌రిపై ఒక‌రు ఇలా చూపించుకుంటూ ఉండ‌డం తమకు ఆనందాన్ని క‌లిగిస్తోందని అభిప్రాయ‌ప‌డుతున్నారు.


 


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్ గ‌ణ్ (Ajay Devgn), బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt), హాలీవుడ్ తార డైసీ ఎడ్గర్ జోన్స్ (Daisy Edgar Jones), తమిళ నటుడు & దర్శకుడు సముద్రఖని (Samuthirakani).. త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న విష‌యం విదిత‌మే. ఛాయాగ్రహకుడిగా కేకే సెంథిల్ కుమార్ తన ప్రభావవంతమైన విజువల్స్‌తో RRR కి ప్రాణం పోసేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఎక్కడా కూడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి


ఆ సినిమా కోసం కంగన రనౌత్‌కి ఇచ్చే.. పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!


మరో సారి "మన్మధుడు"గా వచ్చేస్తున్న నాగ్.. రకుల్ ప్రీత్ సరసన రొమాంటిక్ ఎంట్రీ


ఈ ముద్దుకు... కథకు సంబంధముంది: 'డియర్ కామ్రేడ్' కథానాయిక రష్మిక


 </p