హిరణ్యకశ్యపుడిగా అప్పట్లో "ఎస్వీఆర్".. ఇప్పుడు మన భళ్లాలదేవుడు "దగ్గుబాటి రానా"

హిరణ్యకశ్యపుడిగా అప్పట్లో "ఎస్వీఆర్".. ఇప్పుడు మన భళ్లాలదేవుడు "దగ్గుబాటి రానా"

తెలుగు సినిమా చరిత్రలో సాంఘికం, హాస్యం, జానపదం, క్రైమ్, హారర్.. లాంటి జోనర్స్‌లో ఎన్ని చిత్రాలొచ్చినా.. పౌరాణికాల స్థానం ఎప్పటికీ సుస్థిరమే. వాటిని ఆదరించే ప్రేక్షకులు సైతం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు. ఇక, పౌరాణిక చిత్రాలు అనగానే మనలో చాలామందికి చాలా చిత్రాలు గుర్తుకు రావడం సహజం. వాటిలో భక్త ప్రహ్లాద (Bhaktha Prahlada) చిత్రం కూడా ఒకటి.


ఈ చిత్రంలో హిరణ్యకశ్యపుడి పాత్రలో విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు (SV Ranga Rao) నటించగా; ప్రహ్లాదుడి పాత్రలో చిన్నారి రోజా రమణి (Roja Ramani) నటించిన విషయం విదితమే. ఈ సినిమాకు చిత్రపు నారాయణ రావు (Chitrapu Narayana Rao) దర్శకత్వం వహించగా; ప్రముఖ నిర్మాణ సంస్థ AVM దీనిని నిర్మించింది.


ఈ చిత్రం ఎప్పుడు టీవీల్లో ప్రసారమైనా.. పతాక సన్నివేశాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు పెద్ద ఎత్తునే ఉంటారు. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు హిరణ్యకశ్యపుడు- ప్రహ్లాదుడి నేపథ్యంలో ఎలాంటి చిత్రమూ రాలేదు. 52ఏళ్ల తర్వాత ఇదే పౌరాణిక కథతో ఓ చిత్రం వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.


తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్న దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar). బాల రామాయణం (Bala Ramayanam), చూడాలని ఉంది (Choodalani Undi), ఒక్కడు (Okkadu) వంటి చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం రుద్రమదేవితో (Rudramadevi) ప్రేక్షకులను అలరించి తనలోని విలక్షణతను మరోమారు బయటపెట్టాడు.


ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రానుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వారందరి ఎదురుచూపులకు తెర దించుతూ.. గుణశేఖర్ ఓ సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అదే "హిరణ్యకశ్యప"(Hiranyakashyapa).


ఈ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో రానా దగ్గుబాటి హిరణ్యకశ్యపుని పాత్రలో నటించనున్నారు. గత మూడేళ్లుగా ఈ సినిమా ప్రీ- ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్ర నటీనటులు & సాంకేతిక వర్గానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తామంటూ ట్వీట్ చేశారు.పౌరాణిక చిత్రాలు రూపొందించడంలో గుణశేఖర్ సత్తా గురించి మనందరికీ తెలిసిందే. ఇక పౌరాణిక పాత్రల్లో నటించడమే కాదు.. పెద్ద పెద్ద డైలాగ్స్‌ని సైతం అలవోకగా చెప్పగలనని కృష్ణంవందే జగద్గురుమ్ (Krishnamvande Jagadgurum) చిత్రం ద్వారా రానా నిరూపించుకున్నాడు. దీంతో హిరణ్యకశ్యపుడి పాత్రలో కూడా రానా ఇట్టే ఒదిగిపోతాడని అంటున్నాయి సినీవర్గాలు.


ఇక ఈ సినిమాకు దాదాపుగా రూ. 150 కోట్ల మేర బడ్జెట్ కేటాయించారని; గుణశేఖర్, సురేష్ బాబు  కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రానికి చక్కని సాంకేతికతను జోడించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్ల సహాయం కూడా తీసుకోనున్నారట. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.


అదే విధంగా ఈ హిరణ్యకశ్యప చిత్రంలో మరో ప్రధాన పాత్రైన ప్రహ్లాదుడు కోసం ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది. ఎందుకంటే ఆ పాత్రకు దక్కే ప్రాధాన్యతను బట్టి..  హిరణ్యకశ్యపుడి పాత్ర కూడా అంతకన్నా బాగా వచ్చే అవకాశముంది. 


ఇవి అన్నీ పక్కన పెడితే.. దాదాపు మూడేళ్ళ పాటు ఈ సినిమా కథపై తీవ్ర కసరత్తు చేసిన గుణశేఖర్ చాలా నమ్మకంగా ఉన్నారట. రుద్రమదేవి చిత్రానికి తాను ఊహించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాకపోయేసరికి కాస్త నిరాశ చెందిన ఆయన.. ఇప్పుడు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకుల అంచనాలను చేరుకొనే విధంగా రూపొందించాలని అనుకుంటున్నారట. ఈ సినిమాను తెలుగు, తమిళం & హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. చూద్దాం.. ఈసారి గుణశేఖర్‌కు ఎలాంటి ఫలితం లభిస్తుందో?? అలాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో..


ఇవి కూడా చదవండి


భారత్ చిత్రం కోసం ఏకంగా థియేటర్లనే బుక్ చేసిన అభిమానులు..


సూపర్ స్టార్ మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు" తో.. లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ..!


విశ్వక్ సేన్ "ఫలక్ నుమా దాస్" మూవీ రివ్యూ - ఇది పక్కా హైద్రాబాదీ సినిమా