సాగర్, నేను చిన్నప్పట్నుంచీ కలిసే చదువుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఇద్దరం ఒకే తరగతి, ఒకే స్కూల్, ఒకే స్కూల్ బస్ కూడా! కానీ పదో తరగతిలో నేను చదువుతున్న కోచింగ్ సెంటర్లో తను చేరేంత వరకు మాత్రం మా మధ్య అంతగా స్నేహం కూడా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే అక్కడ చేరాడో అప్పుడే మా మధ్య పరిచయం స్నేహంగా మారి మరింత బలపడింది. తన గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు, కోణాలు నేను తెలుసుకున్నాను. వాటి ద్వారా తను ఎంత మంచి వ్యక్తో , తనది ఎంత అద్భుతమైన వ్యక్తిత్వమో నాకు తెలిసింది.
అలా ఇద్దరం ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటున్న క్రమంలోనే పదో తరగతి పూర్తి కావడం, ఇంటర్‌లో చేరిపోవడం కూడా చకచకా జరిగిపోయింది. నా కాలేజ్ స్టడీస్ పూర్తి అయ్యేంత వరకు నేను ఎవరితోనూ ప్రేమలో పడకూడదన్నది నాకు నేను పెట్టుకున్న నియమం. ఇది సాగర్‌కు కూడా తెలుసు. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో సబ్జెక్ట్స్, మార్క్స్, టెస్ట్స్ గురించి రోజూ మేమిద్దరం మాట్లాడుకునేవాళ్లం. అలా ఇద్దరం ఒకరితో మరొకరం రోజూ ఎంతో కొంత సమయం గడిపేవాళ్లం. రోజులు గడిచేకొద్దీ తను నన్ను ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. తనే కాదు.. నేను కూడా తనను ప్రేమిస్తున్నా. కాకపోతే ఈ విషయం తన దగ్గర చెప్పడానికి భయపడేదాన్ని.
కానీ మనం మొదటిసారి ప్రేమలో పడినప్పుడు మనసులో ఉండే ఫీలింగ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? కళ్ల ముందు ఒక అందమైన కొత్త రంగుల ప్రపంచం వాలినట్లు ఉంటుంది. నాకూ అలానే అనిపించేది. కానీ ఏం చేయను?? నా మనసులోని ప్రేమను తనకు చెప్పలేను. అలాగని మౌనంగా ఉండలేను. ఈ సందిగ్థంలోనే ఇంటర్ ఫస్టియర్ పూర్తైపోయి, సెకండియర్ కూడా సగం అయిపోయింది. ఆ సమయానికి నా మనసులో తన పట్ల ఉన్న ప్రేమను ఇంక దాచలేకపోయా. మా ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి మనసులో ప్రేమ ఉందని తెలుసు. కానీ ఇప్పటివరకు ఇద్దరం బయట పడింది లేదు.
కానీ నాకు ఇప్పటికీ గుర్తే. ఇంటర్ సెకెండియర్ చదువుతున్న సమయంలోనే జనవరి నెలలో ఓ రోజు ఉదయాన్నే మేమిద్దరం కాలేజ్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు సాగర్ నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా అన్నాడు. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలుసు. అందుకే భయం వేసి నేనేమీ తెలుసుకోవాలని అనుకోవట్లేదని అన్నాను. అలాగే చెప్పాలని కూడా అనుకోవట్లేదు అన్నాను. అయినా సరే.. తన మనసులో ఉన్న ప్రేమను నాకు వ్యక్తం చేశాడు.
ఇంకేముంది.. అప్పటి వరకు నా మనసులో తన పట్ల ఉన్న ఫీలింగ్స్‌కు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మాటల్లో చెప్పలేనంత ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అయినా సరే.. నన్ను నేను తమాయించుకొని ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలని అక్కడి నుంచి జారుకున్నా. దాదాపు ఎనిమిది నెలల తర్వాత నేనూ నా అంగీకారాన్ని తనకు తెలిపా.
అలా అప్పుడే మొదలైన మా ప్రేమ ప్రయాణానికి (love story) అనుకోకుండా ఒక అవాంతరం వచ్చింది. నేను నా ఉన్నత చదువు నిమిత్తం జైపూర్‌కి వెళ్లాల్సి వచ్చింది. సాగర్ మాత్రం దిల్లీలోనే తన చదువును కొనసాగించాలని అతని తల్లిదండ్రులు నిర్ణయించారు. దాంతో మేమిద్దరం ఒకరి నుంచి మరొకరు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. అయితేనేం.. మా ప్రేమ యాహూ మెసెంజర్‌లోను, గూగుల్ వీడియో చాట్స్, టెక్స్ట్ మెసేజ్‌ల రూపంలో కొనసాగేది. అలా ఒకరిని విడిచి మరొకరు ఉండగలమా అనుకున్న మేము ఏకంగా ఏడాది పాటు కలుసుకోకుండా ఉన్నాం. ఆ తర్వాత ఓసారి సాగర్, నేను కలుసుకున్నాం. ఆ క్షణం మాకు ఎంత ప్రత్యేకమైందో, మేము ఎంత ఆనందంగా గడిపామో మాటల్లో చెప్పలేను.
అతను నాకు ఎందుకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపించిందో తనతో గడిపిన కొన్ని క్షణాల్లోనే నాకు అర్థమైంది. అందుకే తననే నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. కానీ మా చదువుల నిమిత్తం మేమిద్దరం ఒకరి నుంచి మరొకరం ఇంకొన్నాళ్లు దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఈలోగా ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం, మా ప్రేమను వ్యక్తం చేస్తూ మెయిల్స్ పంపించుకోవడం వంటివి చేసేవాళ్లం. అలాగని మేమెప్పుడూ గొడవపడలేదని అనుకోకండి. ఇద్దరం చాలాసార్లు గొడవపడేవాళ్లం. కానీ ఆ తర్వాత సారీ చెప్పుకుని సర్దుకుపోయేవాళ్లం. ఆ క్షణాలు కూడా మా ప్రేమని మరింత గట్టిపడేలా చేసాయని చెప్పాలి. ఇలా మా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌ని ఏకంగా ఆరు ఏళ్ల పాటు కొనసాగించాం అంటే నమ్మగలరా??
మా చదువులు ముగిసి, మాకంటూ ఒక కెరీర్ ఏర్పరుచుకున్న తర్వాత మా కుటుంబ సభ్యులకు మా ప్రేమ విషయం చెప్పి, పెళ్లి చేయాలని కోరాం. కానీ ప్రేమ అనగానే వెంటనే పెళ్లికి ఏ పెద్దలు అంగీకారం తెలుపుతారు చెప్పండి? మా వాళ్లూ అంతే.. ముందు ససేమిరా అన్నారు. కానీ సాగర్ వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడాడు. మా ప్రేమ గురించి చెప్పి, మా భవిష్యత్తుపై వారికి నమ్మకం కలిగేలా చేశాడు. దాంతో మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
అలా దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిన మా ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పట్టాలు ఎక్కించాం. అయితే పెళ్లి రోజు సాగర్ నాకు ఒక అందమైన బహుమతి ఇచ్చాడు. అదేంటో తెలుసా?? మా ఇరు కుటుంబ సభ్యులందరి ముందూ నన్ను ప్రేమిస్తున్నానంటూ ఓ గులాబీ నా చేతికి ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు. ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఇంకేం కావాలి??
సాగర్.. నిన్ను నేను ఇప్పడు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు లేని నా జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేను. నీతోనే నా జీవితం.. సంతోషం.. అంతా..! లవ్ యూ ఫరెవర్ అండ్ ఎవర్..!
ఇవి కూడా చదవండి
మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..?
డేట్ కు వెళ్తున్నారా? ఇలా రెడీ అవ్వండి
బాధను పంచుకుందాం.. క్యాన్సర్‌ని దూరం చేసేలా ప్రోత్సహిద్దాం..