నేను జీవితంలో పడిపోతున్నప్పుడు.. సైఫ్ నన్ను కాపాడాడు : కరీనా

నేను జీవితంలో పడిపోతున్నప్పుడు.. సైఫ్ నన్ను కాపాడాడు : కరీనా

(Saif Ali Khan's hilarious reply to his wife Kareena's Question on the Show 'What Women Want')

కరీనా కపూర్ ఖాన్ .. బాలీవుడ్ బ్యూటిఫుల్ బేగం. అటు హీరోయిన్‌గా టాప్ స్థానంలో ఉన్న ఈ భామ.. గత ఏడాది నుంచి 'వాట్ వుమెన్ వాంట్' అనే రేడియో టాక్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో రెండో సీజన్ ప్రారంభం కానుంది. తన భర్తతో పాటు ఎందరో సెలబ్రిటీలను ఇందులో భాగంగా ఆమె ఇంటర్వ్యూ చేయనుంది. వివాహ జీవితం సక్సెస్ ఫుల్‌గా సాగాలంటే భాగస్వామి 'ఒక్కరితోనే వేల సార్లు ప్రేమలో పడిపోవడం.. ఒక్కటే దారి' అని తను చాలా సార్లు చెప్పుకొచ్చింది. తను అలాగే చేస్తానని కూడా వెల్లడించిందీ పటౌడీ కోడలు.

'ప్రేమ అనేది ఒకేసారి పుట్టాలనేం లేదు' అని చెప్పే సైఫ్, కరీనాల జంట ఓసారి ప్రేమలో ఓడిపోయి.. రెండోసారి ప్రేమించిన వ్యక్తితో ప్రస్తుతం ఆనందంగా జీవిస్తున్నారు. కరీనా సైఫ్‌తో డేటింగ్‌కి ముందు ప్రముఖ నటుడు షాహిద్ కపూర్‌ని ప్రేమించి.. ఆ తర్వాత తన బంధానికి బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. సైఫ్ కూడా నటి అమృతా సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నాడు. 'తషన్' సినిమా షూటింగ్ సమయంలో పుట్టిన వీరి ప్రేమ.. కొన్నేళ్ల పాటు కొనసాగింది. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత.. 2012 అక్టోబర్ 16న వీరిద్దరూ వివాహమాడారు. వీరి ప్రేమకు గుర్తుగా తైమూర్ అనే బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

ఇష్క్ 104.8 ఎఫ్ ఎంలో 'వాట్ వుమెన్ వాంట్' అనే షోకి కరీనా హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు దీని రెండో సీజన్ కూడా ప్రారంభమవబోతోంది. డిసెంబర్ 12 తేదిన ప్రారంభం కానున్న ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో తన భర్తను ఇంటర్వ్యూ చేసింది బెబో. వీరిద్దరూ ఆ ఎపిసోడ్‌ని ఎంతో ఫన్నీగా మార్చారట. దీని ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సైఫ్‌తో పాటు శిల్ప, రవీనా, కాజోల్, సానియా లాంటి వాళ్లంతా కనిపించారు. ఈ షోలో భాగంగా 'వివాహ జీవితంలో మనం అస్సలు చేయకూడని పని ఏంటి?' అని కరీనా అడగ్గా.. 'ఎప్పుడూ పనిమనిషిని తిట్టకూడదు' అంటూ సైఫ్ నవ్వించే సమాధానం చెప్పుకొచ్చాడు.

శిల్పా శెట్టిని కీటో డైట్ పై  అభిప్రాయం అడగ్గా.. 'జో భీ కీటో కరే.. హే ఉన్ కో పకడ్ కర్ పీటో' (కీటో చేసేవాళ్లను పట్టుకొని కొట్టండి) అంటూ ఆమె చెప్పడం అందరినీ నవ్వించింది. ఇవే కాదు.. 'మహిళలు పిల్లల్ని వదిలేసి బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తే వాళ్లు కచ్చితంగా చెడ్డ తల్లులే. ఈ రకంగా చూస్తే మనందరం చెడ్డ తల్లులమే' అంటూ వర్కింగ్ వుమన్ గురించి.. సమాజంలో వారి ఆలోచనా తీరు గురించి చెప్పుకొచ్చారు షర్మిలా ఠాగూర్. ఇలా ఇటు నవ్వించే మాటలతో పాటు.. ఆలోచనలను పెంపొందించే విషయాలను కూడా ఈ షోలో అతిథులతో చర్చించింది కరీనా.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ 'తాను సైఫ్ పెళ్లి ప్రతిపాదనను రెండు సార్లు తిరస్కరించానని' కరీనా చెప్పిన సంగతి తెలిసిందే. 'సైఫ్ నాకు ప్రపోజ్ చేసిన ప్రతి సారి నాకు తెలీదు' అని ఆమె వెల్లడించింది. 'మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావన తనకుందని సైఫ్ నాకు గ్రీస్‌లో ఉన్నప్పుడు.. లడాఖ్‌లో ఉన్నప్పుడు రెండు సార్లు చెప్పాడు. దానికి సమాధానంగా 'అవునా.. నాకు అనిపించట్లేదు' అన్నాను. ఎందుకంటే తన గురించి నాకు పూర్తిగా తెలీదు కదా. అదే మాట చెప్పాను. దానికి అర్థం నిజంగా 'నో' అని కాదు. కానీ తన  గురించి ఇంకా తెలుసుకోవాలనుంది. తన గురించి ఇంకా తెలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలని మాత్రమే అర్థం.

ఆ తర్వాత కొన్నాళ్లకు ఓకే చెప్పాను. నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవితంలోనే బెస్ట్ నిర్ణయంగా  ఇప్పటికీ భావిస్తున్నా. నేను కిందపడిపోతున్నా అనుకున్న సమయంలో.. సైఫ్ నా జీవితంలోకి అడుగుపెట్టాడు. తనని ముందే కలిసినా.. 'తషన్' షూటింగ్ సమయంలో మా జీవితాల్లో కొత్త మార్పు వచ్చింది. తను నా కంటే పదేళ్లు పెద్దవాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నవాడని అందరూ అన్నారు. కానీ నాకు మాత్రం.. నేను బాధలో ఉన్నప్పుడు సైఫ్ నా జీవితంలోకి అడుగుపెట్టాడు. వాటన్నింటినీ నేను మర్చిపోయేలా చేశాడు. మేం ఇద్దరం చాలా డిఫరెంట్. అలాగే తన నుంచి నేను చాలా నేర్చుకున్నా' అంటూ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది కరీనా

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.