కళ్యాణ బంధంతో ఒక్కటైన క్రీడా దిగ్గజాలు వీరే
క్రీడల్లో ఎవరైనా రాణించాలంటే ముఖ్యంగా కావాల్సినవి ఏకాగ్రత, పట్టుదల. నేడు క్రీడాకారులు వీటిని సాధించే క్రమంలో.. తమ ఆటపై తప్ప ఇక ఏ అంశంపై కాస్త శ్రద్ధ చూపించినా కూడా.. వారి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే వాదన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు.. తమ సహచర క్రీడాకారులతోనే ఎక్కువగా సమయం గడపడం, మాట్లాడుతుండడం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారి మధ్య సహజంగానే ఏర్పడే చనువు ప్రేమగానూ మారవచ్చు. ఆ ప్రేమ వివాహానికీ దారి తీయవచ్చు. అలా వివాహాలు చేసుకున్న సెలబ్రిటీలు అనేకమంది ఉన్నారు. ఇటీవలి కాలంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులైన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు కూడా ప్రేమ వివాహం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారులైన సైనా నెహ్వాల్ (Saina Nehwal)-పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)లు చాలాకాలంగా ఒకరిని ఒకరు ఇష్టపడుతూ వస్తున్నారని.. వారి పరిచయం ప్రేమగా మారి వివాహం వరకూ దారితీయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఈ సందర్భంగా వారి సన్నిహితులు, స్నేహితులు పలువురు తెలియజేయడం జరిగింది.
వీరి వివాహం హైదరాబాద్ నగరంలో కుటుంబసభ్యులు , అత్యంత సన్నిహితుల మధ్య చాలా నిరాడంబరంగా జరిగింది. ఇక ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా సైనా -కశ్యప్‌లు తమ అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు అవే ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
సైనా -కశ్యప్‌ల తరహాలోనే గతంలో కూడా పలువురు స్పోర్ట్స్ సెలబ్రిటీలు తమ తోటి క్రీడాకారులని వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు సంక్షిప్తంగా మీకోసం...
చిత్రమేమిటంటే సైనా -కశ్యప్‌ల గురువు పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) జీవిత భాగస్వామైన లక్ష్మి కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారిణే కావడం విశేషం. లక్ష్మి గతంలో మన దేశం తరపున ఒలింపిక్స్ క్రీడలకు ప్రాతినిధ్యం వహించడం కూడా జరిగింది.
మనదేశానికి కామన్వెల్త్ క్రీడలలో రెజ్లింగ్ విభాగంలో తొలి బంగారు పతకం సాధించిన గీత ఫోగట్ (Geetha Phogat) కూడా తన సహచర క్రీడాకారుడైన పవన్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమ కూడా రెజ్లింగ్ ట్రైనింగ్ సమయంలోనే చిగురించిందట.
View this post on Instagram
రియో ఒలింపిక్స్‌లో మన దేశానికి కాంస్య పతాకాన్ని అందించిన సాక్షి మాలిక్ (Sakshi Malik) కూడా తన సహచర రెజ్లర్ అయిన సత్యవర్తని 2016లో వివాహమాడింది.
ప్రేమ వివాహం చేసుకున్న మరో జంట మనకు ఆర్చరీలో కూడా ఒకటి ఉంది. మన దేశంలోనే అతి పిన్నవయసులో ఆర్చరీలో ప్రతిభ చాటిన జార్ఖండ్ అమ్మాయి దీపికా కుమారి (Deepika Kumari) కూడా తనకి కాబోయే జీవిత భాగస్వామిగా సహచర క్రీడాకారుడైన దాస్‌ని ఎంపిక చేసుకుంది. వీరికి ఈ మధ్యనే నిశ్చితార్థం జరగగా.. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.
View this post on Instagram
ఇక తమ క్రీడకు చెందిన వ్యక్తులను కాకుండా.. వేరే క్రీడాంశాలకు ప్రాతినిధ్యం వహించిన వారిని వివాహమాడిన జంటలు చాలా ఉన్నా.. ఇలా తమతో పాటు ఒకే క్రీడావిభాగంలో రాణించిన వారిని పరిణయమాడింది మాత్రం వీరే అని చెప్పుకోవచ్చు.
ఇటీవలే మూడు మూళ్ళ బంధంతో ఒకటైన సైనా నెహ్వాల్ -పారుపల్లి కశ్యప్‌ల జంటకి POPxo తెలుగు తరపున శుభాకాంక్షలు.