"ఓల్డ్ మ్యాన్" వేషాల్లో సల్మాన్, అమీర్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!

"ఓల్డ్ మ్యాన్" వేషాల్లో సల్మాన్, అమీర్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!

సినీ పరిశ్రమలో అడుగుపెట్టే ఏ హీరో అయినా.. హిట్స్ సాధించడం ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకోవాలని ఆశించడం సహజమే. ఈ క్రమంలోనే ఒకటి లేదా రెండు హిట్ సినిమాల్లో (Movies) నటించిన తర్వాత తమ పాత్రలకు పరిధులు విధించుకుంటూ ఉంటారు.


అయితే కొందరు మాత్రం ఎంత అగ్రస్థాయికి చేరుకున్నా.. పాత్రలతో ప్రయోగాలు చేయాలంటే ముందువరుసలో నిలబడుతూ ఉంటారు. బాలీవుడ్లో ఈ తరహా కథానాయకులు అనగానే.. అందరికీ ముందుగా గుర్తుకొచ్చే హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) అనడంలో మరే సందేహం లేదు. ఇప్పటికే ఆయన తన పాత్రల ద్వారా చేసిన ప్రయోగాలు, ప్రేక్షకులను ఆకట్టుకున్న తీరు అందరికీ విదితమే.


తాజాగా అమీర్‌తో పాటు సల్మాన్ ఖాన్ కూడా (Salman Khan) తన స్టార్ డమ్‌ని పక్కన పెట్టి ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్ సూపర్ స్టార్స్‌గా పేరుపొందిన వీరిద్దరూ ఇటీవలే వయోధికులుగా కనిపించి ఒక్కసారిగా అభిమానులందరికీ షాక్ ఇచ్చారు. అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా వీరిద్దరి గెటప్స్‌కు సంబంధించిన చర్చే ప్రధానంగా నడుస్తోంది. ఇంతకీ ఈ టాప్ హీరోల గెటప్స్ వెనుక ఉన్న ఆ కథ ఏంటో ఓసారి మనమూ తెలుసుకుందాం.. 


ముందుగా కండల వీరుడు సల్మాన్ గురించి మాట్లాడుకుంటే- దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ (Ali Abbas Zaffar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ (Bharat) అనే చిత్రం కోసం సల్మాన్ ఖాన్ ఈ "ఓల్డ్ మ్యాన్" (Old Man) గెటప్ వేశారట.. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ సల్లూ భాయ్ పాత్రకు సంబంధించిన ఓల్డ్ లుక్‌ని విడుదల చేసింది. 


 


"ఓడ్ టు మై ఫాదర్" (Ode To My Father) అనే దక్షిణ కొరియా చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందుతోన్న ఈ చిత్రంలో ఒక వ్యక్తి మొత్తం జీవిత ప్రయాణాన్ని వెండితెరపై చూపించనున్నారు దర్శక, నిర్మాతలు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


సల్మాన్ వయోధికుడిగా వెండితెరపై కనిపించేందుకు చాలానే కష్టపడాల్సి వచ్చిందట. ముఖ్యంగా ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్స్ సైతం ఎన్నో ప్రయాసలకోర్చి సల్మాన్ లుక్‌ని తీర్చిదిద్దారట.


అయితే ఈ లుక్ సల్మాన్ అభిమానులందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురిచేయడంతో పాటుగా.. సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను పదింతలు పెంచడంలో బాగా తోడ్పడిందంటున్నారు విశ్లేషకులు.


సల్మాన్ సినిమా అనగానే ఒకప్పుడు యాక్షన్ కోసం వెళ్లేవాళ్లు కూడా.. ఈసారి కొత్త గెటప్‌లో తమ అభిమాన నాయకుడు ఎలా ఉన్నాడో చూడాలని ఉందంటున్నారు. అందుకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లు.. సల్లూ భాయ్ ఫ్యాన్స్ తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


 


అయితే సల్మాన్ కంటే కాస్త ముందే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా.. బాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించుకున్న అమీర్ ఖాన్ సైతం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ లుక్‌లో అభిమానులను పలకరించారు. ఆ గెటప్ ఒక ప్రముఖ ఆన్ లైన్ యాప్ ప్రచార చిత్రం కోసమే అయినప్పటికీ అది తన తదుపరి చిత్రంలో కూడా భాగమని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.


అమీర్ చేయబోయే తదుపరి చిత్రంలో (హాలీవుడ్‌లో టామ్ హ్యాంక్స్ (Tom Hanks) హీరోగా ఫారెస్ట్ గంప్ (Forrest Gump) చిత్రానికి రీమేక్) కూడా ఇటువంటి గెటప్‌లోనే కనపడబోతున్నాడని.. తన గెటప్‌ని ప్రేక్షకులకి అలవాటు చేసే పనిలో భాగంగానే ఇలా ఆ యాడ్‌లో కనిపించాడని కూడా వార్తలు వినపడుతున్నాయి. అయితే వీటిలో నిజానిజాలు మాత్రం ఇంకా పూర్తిగా, అధికారికంగా తెలియాల్సి ఉంది.


వీరిద్దరు మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో ఇంతకుముందు కూడా కొందరు హీరోలు "ఓల్డ్-మ్యాన్" గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించిన కథానాయకుల జాబితాలో ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వారిలో- వీర్ జారా (Veer Zara) చిత్రంలో పాకిస్థాన్ జైలు‌లో బందీగా ఉండిపోయిన భారత వైమానిక పైలట్ పాత్రలో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) మనల్ని ఆకట్టుకోగా.. ధూమ్ 2 (Dhoom 2) చిత్రంలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా "ఓల్డ్ లేడీ" పాత్రలో తళుక్కుమని మెరిశాడు.


కేవలం బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోనూ ఈ ఒరవడి ఎప్పట్నుంచో కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలోను, బాలక్రిష్ణ ఒక్కమగాడు సినిమాలోను, వెంకటేష్ సూర్యవంశం చిత్రంలోను, నాగార్జున అన్నమయ్య చిత్రంలోనూ వయోధికుల పాాత్రల్లో నటించి మెప్పించినవారే.


వీరే కాదు.. విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan), భారతీయుడు చిత్రం కోసం ఆయన వేసిన గెటప్ ఎప్పటికి మరచిపోలేము. భామనే సత్యభామనే చిత్రంలో ముసలావిడ పాత్ర & ఆ తరువాత దశావతారం కోసం చేసిన ముసలావిడ పాత్రలో కూడా ఆయన మెరిశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తరహా పాత్రలు చేసిన వారి జాబితా చాలా పెద్దదే అవుతుందండోయ్..


అయితే తాజాగా ఈ పాత్రల్లో ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయిన అమీర్, సల్మాన్‌లకు ఇవి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో మనకు తెలియాలంటే మనమంతా ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి..


ఇవి కూడా చదవండి


కొడుకు కోసం.. మళ్లీ క్రికెటర్‌గా మారే తండ్రి కథ "జెర్సీ"..!


సక్సెస్ కోసం పరితపించే కుర్రాడి కథ.. 'చిత్రలహరి' మూవీ రివ్యూ..!


జయలలిత జీవితంలో.. చివరి 75 రోజులు ఆధారంగా మరో బయోపిక్..!