"పడి పడి లేచే మనసు" మనల్ని కూడా ప్రేమలో పడేస్తుందా..?

"పడి పడి లేచే మనసు" మనల్ని కూడా ప్రేమలో పడేస్తుందా..?

"Padi Padi Leche Manasu" Review


ప్రేమకథలని ఆదరించడంలో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందువరుసలోనే ఉంటారు. అందుకే ఎన్ని కొత్త ట్రెండ్స్ వచ్చినా సరే  ప్రేమకథలకి ఉన్న విలువ ఏమాత్రం తీసిపోదు. అందుకోసమే ప్రేమ కథతో ఏదైనా చిత్రం విడుదలవుతుందంటే ఆడియన్స్ సదరు చిత్రాలకి మంచి ఓపెనింగ్స్‌తో స్వాగతం పలుకుతారు.


ఆ వరుసలోనే  పడి పడి లేచే మనసు (Padi Padi Leche Manasu) విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూసారు. ఇంతకీ విడుదలయ్యాక ఈ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకోగలిగింది  అనేది ఇప్పుడు చూద్దాం...


ఈ చిత్రకథ విషయానికి వస్తే, వైశాలి (సాయి పల్లవి)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు సూర్య (శర్వానంద్). అలా వారి మధ్య ప్రేమ మొదలైన ఒక సంవత్సరం తరువాత..  ఒక విషయంలో ఇద్దరు పరస్పరం వ్యతిరేకించుకుని  విడిపోతారు. అలా విడిపోవడానికి గల అంశమేంటి? మళ్ళీ ఇద్దరు తిరిగి కలిసారా  లేదా అన్నది కథ.


ఏ ప్రేమకథకైనా నేపధ్యం బాగుండాలి లేదా ఆ కథ జరిగే ప్రాంతం అదే స్థాయిలో అందంగా కనిపించాలి. అలా ఈ చిత్ర కథ కోల్ కత్తా నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ నగరం మనకి తెరపైన ఎంతో అందంగా కనిపిస్తుంది. 90 శాతమే వరకు ఈ చిత్రం కోల్ కత్తా బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది. ఇక ఈ చిత్రానికి ఆయువుపట్టైన ప్రేమ జంటగా సాయి పల్లవి-శర్వానంద్‌ల అభినయం హైలైట్ అని చెప్పితీరాల్సిందే. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) రాసుకున్న సూర్య & వైశాలి పాత్రలకి వీరు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.


వీరిమధ్య సాగే ప్రేమ సన్నివేశాలే ఈ చిత్రానికి బలం కావడంతో ఈ ఇద్దరు నటులు కూడా తమ శక్తి మేరకు నటించే ప్రయత్నం చేశారు. వీరి నటనకు తగ్గట్టుగానే మంచి సంభాషణలు కూడా వీరి నటనకు తోడ్పాటునిచ్చాయి. ముఖ్యంగా ఇద్దరు విడిపోయాక.. ఒకరి గురించి మరొకరు చెప్పుకునే మాటలు చాలా బాగున్నాయి. పైగా ఏ ప్రేమకథకైనా సంభాషణలే వారి మధ్య ప్రేమని  ప్రేక్షకులకి తెలిసేలా చేస్తాయి. సాయి పల్లవి ఎప్పటిలాగే తన నటనతో అందరిని ఫిదా చేసేస్తే, శర్వానంద్ తన పాత్రకి సరిపడా జోష్‌ని జోడించి  మనకి ఈ చిత్రంలో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. మిగిలిన తారాగణమైన సునీల్, ప్రియదర్శి, కల్పిక, మురళి శర్మ & వెన్నెల కిషోర్‌లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 


ఇక కథనం విషయానికి వస్తే, టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్ర కథనం కూడా పడి పడి లేస్తూ ముందుకి సాగుతుంటుంది. తొలిభాగం వరకు దర్శకుడు హను రాఘవపూడి కథనాన్ని బాగానే నడిపించి.. ఆ తర్వాత  ఇంటర్వెల్  సమయానికి  ఒక ఆసక్తికరమైన మలుపుతో  బ్రేక్ ఇస్తాడు. ఆ తరువాత మొదలైన రెండవ భాగంలో  ప్రేమకథకు సరిపోయే ఎమోషనల్  సన్నివేశాలు చేర్చలేకపోయాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు హృదయాన్ని కదిలించేలా ఉన్నా.. అవి ఆస్వాదించేలోపు  వేరే సన్నివేశం వచ్చేస్తుంటుంది. రెండవ భాగంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు అని చెప్పాలి. పెళ్లి తరువాత ప్రేమకి అంత విలువ ఉండదు  అనే మూలకథకి కాస్త  మెరుగులద్ది  వినూత్నంగా చెప్పే ప్రయత్నమే ఇందులో జరిగింది. అయితే  అలా చెప్పే పద్దతిలో కాస్త తడబాట్లు దొర్లడంతో రెండవ భాగం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారింది.


ఇదిలావుండగా ఏ ప్రేమకథకైనా  రెండు ప్రధానంగా తోడ్పడాలి. అవే సంగీతం  & ఛాయగ్రహణం. ఈ రెండు విభాగాలు ఈ చిత్రానికి అదనపు సొగసుని అద్దాయి అనే చెప్పాలి. సంగీతం పరంగా విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) మంచి మెలోడీలు ఇచ్చాడు. ఆయన స్వరపరిచిన టైటిల్ పాటనే బ్యాక్ గ్రౌండ్‌కి వాడుతూ ఆయా సన్నివేశాలకి జీవం పొసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తన కెమెరాపనితనంతో జేకే  (Jay Kay) కోల్‌కత్తా, కశ్మీర్ అందాలని మనకి అందంగా చూపెట్టడంలో సఫలీకృతుడయ్యాడు.


ఇక ఈ చిత్రం కోసం నిర్మాత  సుధాకర్ (Sudhakar Cherukuri) కొత్త నిర్మాతైనప్పటికీ ఎక్కడా కూడా రాజీపడకుండా దర్శకుడికి సహకరించినట్టుగా మనకి ఈ చిత్రం చూస్తే తెలిసిపోతుంది. నిర్మాణ విలువల పరంగా అయితే ఎక్కడ కూడా రాజీపడలేదు. 


చివరగా ఇది టైటిల్‌కి తగ్గట్టుగానే పడుతూ లేస్తూ సాగే ప్రేమకథ...


ఈ ఆర్టికల్స్ కూడా చదవండి


"పడి పడి లేచే మనసు"లో సాయిపల్లవి నటన.. పెద్ద హీరోయిన్లకు సవాలా..?