‘మిషన్ మంగల్’ సక్సెస్‌తో జోరు మీదుంది తాప్సీ (Taapsee Pannu). ప్రస్తుతం ఆమె మరో అద్భుతమైన చిత్రంతో మన ముందుకు రానుంది. తాప్సీ, భూమి పెడ్నేకర్.. ఇద్దరూ కలిసి షూటర్ దాదీలుగా కనిపించబోతున్న సినిమా ‘సాండ్ కీ ఆంఖ్’ (saand ki aankh). అందులో షూటర్ దాదీలు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌లుగా కనిపిస్తున్నారు తాప్సీ, భూమి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.
ట్రైలర్ విడుదల తర్వాత తాప్సీ మాట్లాడుతూ.. తాను పిస్తోల్ పట్టుకోవడానికి మూడు నెలలు పట్టిందని చెప్పుకొచ్చింది. “నాకు షూటింగ్ అస్సలు రాదు. ముందు అస్సలు తుపాకీ పట్టుకొని టార్గెట్ చేయడానికి వచ్చేది కాదు.. సినిమా షూటింగ్‌కి ముందు.. మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నా. అందులో భాగంగా తుపాకీ పట్టుకోవడంతో పాటు.. టార్గెట్ చూసి చక్కగా షూట్ చేయడం నేర్చుకున్నా. ఆ తర్వాతే షూటింగ్ ప్రారంభించాం” అంటూ తన శిక్షణను గురించి చెప్పుకొచ్చింది తాప్సీ.
అంతేకాదు.. ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ.. “ఈ సినిమా కథ వినడం మొదలు పెట్టిన కాసేపటికే నా కన్నీళ్లు ప్రారంభమయ్యాయి. సినిమా కథ పూర్తయ్యేసరికి ఏడుపు ఆపుకోలేకపోయా. ఈ కథ వింటుంటే నాకు మా అమ్మే గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ సినిమా కథ తనలాంటి ఎందరో స్త్రీల కథ.
తమకోసం కాకుండా తమ తల్లిదండ్రులు, భర్త, పిల్లల కోసం జీవిస్తూ.. తమ జీవితాన్ని తమ కోసం బతకడమే మర్చిపోయిన స్త్రీల కథ ఇది. ఎన్నో సంవత్సరాల పాటు తన కోసం కాకుండా.. కుటుంబం కోసం జీవించిన తర్వాత.. షూటింగ్ కోసం సమాజపు కట్టుబాట్లను ఎదిరించారు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్.
“ఈ సినిమా కథ నాకెంతో స్పెషల్. ఎందుకంటే మా అమ్మ వయసు అరవై సంవత్సరాలు. నేను ఆమె కంటే పెద్ద వయసున్న వ్యక్తి పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో నటించిన తర్వాత ‘నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించు. నీకు నా తోడు ఎప్పుడూ ఉంటుంది’ అని మా అమ్మకు చెప్పాలనిపించింది. అందుకే ఈ సినిమా ద్వారా.. తనకూ జీవితంలో ఏదైనా సాధించమనే స్పూర్తిని అందిస్తున్నా.
నా వరకూ వస్తే.. ఈ సినిమా మా అమ్మకు అంకితం. ఈ సినిమాకు ప్రతి ఒక్కరు తమ తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలను తీసుకురావాలి. ఇలా ప్రతి ఒక్కరినీ తీసుకొచ్చి.. కుటుంబంతో పాటు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఈ దీపావళి సినిమా థియేటర్లలో జరుపుకోవాలని కోరుతున్నా” అని చెప్పింది తాప్సీ.
“అంతేకాదు.. ఇద్దరు కథానాయికలుండే సినిమాలో.. ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉండాలని నేను భావించేదాన్ని. అలాంటి సినిమాలో నేను నటించగలగడం గొప్పగా అనిపిస్తోంది. చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్.. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. సాధారణంగా ఇద్దరు కథానాయికలు మాత్రమే ఉన్న సినిమాలు రావడం చాలా అరుదు. గతంలో “గులాబ్ గ్యాంగ్” వంటి సినిమాలు మాత్రమే ఇలా విడుదలయ్యాయి.
దీని గురించి తాప్సీ మాట్లాడుతూ.. షసినిమా తీయడం అంటే ఒక్క వ్యక్తితో జరిగే పని కాదు. సినిమా రూపొందాలంటే చాలామంది కష్టపడాలి. బాధ్యత తీసుకోవాలి. ఒక హీరో, ఒక హీరోయిన్ ఉన్న సినిమా అయినా.. తెర వెనుక కొన్ని వందల మంది కష్టపడితేనే ఆ సినిమా రూపొందుతుంది. తెరపై కనిపించే వాళ్లు వారి నుంచి ఆ క్రెడిట్ పూర్తిగా తీసుకోవడం సరికాదు.
ఇద్దరు హీరోయిన్లు ఉండే సినిమాలు సాధారణంగా ఎక్కువగా కనిపించవు. కానీ కాస్త విభిన్నంగా ఉండే పాత్రలను చేయడానికి నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. భూమి, నేను ఇద్దరం కలిసి చేసిన ఈ సినిమాలో.. మా పాత్రలు వేటికవే ప్రత్యేకం. మా స్క్రిప్టును కూడా దర్శకుడు ప్రత్యేకంగా తయారుచేశారు” అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.