తేజస్వి మదివాడ (tejaswi madiwada).. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఐస్ క్రీం, కేరింత, నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సాధించిన ఈ బ్యూటీ బిగ్ బాస్ 2 లో పాల్గొని ఫేమస్ గా మారిందని చెప్పుకోవచ్చు. సీజన్ 2 లో పాల్గొన్న ఆమె లౌడ్ స్పీకర్ గా పేరు తెచ్చుకుంది. అయితే పైకి నవ్వుతూ.. ఆడుతూ పాడుతూ ఉండే తేజస్వి గతంలో చాలా కష్టాలు పడిందని.. వాటిని దాటుకొని ప్రస్తుతం ఈ స్థితికి చేరుకుందని చాలా తక్కువ మందికే తెలుసు.
ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమవుతున్న జీ హీరోస్ కార్యక్రమంలో పాల్గొంటోంది తేజస్వి. ఈ అడ్వెంచర్ షోలో అద్భుతమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ షో తాజా ఎపిసోడ్ లో తేజస్వి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆదివారం ప్రసారమైన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో భాగంగా మా అమ్మ చిన్నప్పుడే క్యాన్సర్ తో చనిపోయింది. నాన్న తాగుడికి బానిసయ్యారు. నాకు చిన్నప్పుడు తినడానికి తిండి కూడా ఉండేది కాదు.. అందుకే తక్కువ ఖర్చుతో కడుపు నింపుకోవడం కోసం రోజూ పానీ పురీ తినేదాన్ని. అలా తిని, తిని కొన్నాళ్లకు నాకు టీబీ వచ్చింది. సమంత (samantha akkineni) నా సర్జరీకి డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేను అంటూ తేజస్వి కన్నీళ్లతో చెప్పడం చూసి అందరి మనసులు చలించిపోతున్నాయి.
గతంలోనూ బిగ్ బాస్ షోలో భాగంగా తన గతం గురించి వెల్లడించింది తేజస్వి. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటున్నారా? అని బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చినప్పుడు అందులో భాగంగా తన గతం గురించి వెల్లడించి తన తండ్రికి క్షమాపణలు చెప్పుకుంది తేజస్వి. నా చిన్నతనంలోనే అమ్మ క్యాన్సర్ తో చనిపోయింది. దాంతో మా నాన్న తాగుడుకి బానిసయ్యాడు. నేను, మా అన్నయ్య చిన్నతనం లో చాలా కష్టాలు పడ్డాం. రోజు తాగి ఇంటికొచ్చి మా నాన్న మమ్మల్ని కొట్టేవాడు. ఇది భరించలేక మా అన్నయ్య తన దారి తను చూసుకున్నాడు. నేను కూడా పద్దెనిమిదేళ్లు నిండాక నా దారి నేను చూసుకుందాం అనుకున్నా. పద్దెనిమిదో పుట్టిన రోజు అవ్వగానే ఇంటి నుంచి పారిపోయాను. అనాథాశ్రమాల్లో ఉంటూ చదువుకున్నా. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. అందుకే నాకు జీవితంలో ఉన్న కష్టాలు తెలుసు. అన్ని రకాల పనులు చేయడం తెలుసు. నేను కష్టపడి సంపాదించి నాన్నను బాగా చూసుకోవాలనుకున్నా. కానీ ఆ వయసులో ఆయన్ని వదిలి రావడం నేను చేసిన తప్పు అని నాకు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది తేజస్వి.
ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా తన కుటుంబం తనతో పాటు ఉండట్లేదని చెప్పుకొచ్చింది తేజస్వి.. మా నాన్న, అన్నయ్యకి నాకు ఎలాంటి గొడవలూ లేవు. కానీ వాళ్లు నా కుటుంబం అని నేను భావించట్లేదు అంతే.. నేను ఇప్పటికీ మా నాన్నతో మాట్లాడతాను. ఆయనకు నా గురించి అన్ని విషయాలు తెలుసు. ఆయన తన తప్పులు ఒప్పుకున్నారు. నేను కూడా ఓ మంచి కూతురిగా నేను చేయాల్సింది చేశాను. అందుకే ఇప్పుడు అది ఓ పెద్ద అంశం కాదు అని నా నమ్మకం అంటూ చెప్పుకొచ్చింది తేజస్వి. ఈ వైరల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అందర్నీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటే తేజస్వి జీవితంలో ఇంత దీనగాథ ఉందా? అంటూ బాధపడుతున్నారు. అంతేకాదు.. జీ హీరోస్‌లో తేజస్వి మదివాడ గెలవాలని కోరుకుంటున్నారు. దాంతో పాటు తేజస్వి ఆపరేషన్‌కు సాయం చేసి మంచి మనసు చాటుకున్న సమంత పైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.