అందుకే మా బ్రేకప్ గురించి.. అందరికీ చెప్పలేదు : ఇలియానా

అందుకే మా బ్రేకప్ గురించి.. అందరికీ చెప్పలేదు : ఇలియానా

టాలీవుడ్‌తో సినీ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా సత్తా చాటి.. సక్సెస్ ఫుల్ కథానాయికగా పేరు తెచ్చుకున్న వారిలో ఇలియానా (Ileana D'Cruz) కూడా ఒకరు. తన సినిమా కెరీర్‌కి మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా.. తాజాగా బాలీవుడ్‌లో వరుస సినిమాలతో జోరు మీదుంది ఇలియానా. ప్రస్తుతం ఆమె నటించిన 'పాగల్ పంతీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. 'బిగ్ బుల్' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది ఇలియానా.

అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి తన సినిమాల కంటే.. తన రిలేషన్ షిప్ గురించే ఇలియానా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ని ప్రేమించిన ఆమె.. కొన్ని నెలల క్రితమే తన బంధానికి బ్రేకప్ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలు తీసేయడం చూసి అంతా వారిద్దరూ విడిపోయారని భావించారు. కానీ దీనికి సంబంధించి ఇలియానా మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ (breakup) గురించి.. ఆ తర్వాత తన జీవితం గురించి చెప్పుకొచ్చింది ఇలియానా.

"నాకు సంబంధించి మనం ఒక బంధంలో ఉన్నామంటే.. అది కేవలం మన గురించి మాత్రమే కాదు.. అది ఇద్దరి గురించి. ఇద్దరి మధ్యలో ఏం జరిగిందన్నది ఏ ఒక్కరో చెప్పడం సరికాదు. అదే గనుక జరిగితే.. మరో వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని మీరు బయటపెడుతున్నట్లే లెక్క. అది అస్సలు సరైన విషయం కాదు. ఎదుటి వారికి కూడా ప్రైవసీ ఉంటుందని మనం గుర్తించుకోవాలి. నన్ను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. నేను నటిని కాబట్టి వాటిని భరిస్తున్నా. మరీ ఎక్కువైందని అనిపిస్తే.. నా తరహాలో సమాధానం ఇస్తున్నా. కానీ నన్ను ప్రేమించిన కారణానికి.. మరో వ్యక్తి కూడా దానికి గురి కావడం నాకు నచ్చలేదు.

బ్రేకప్ తర్వాత నాకు ఇబ్బందిగా అనిపించిన మాట వాస్తవమే. కానీ నేను బాధపడదల్చుకోలేదు. ఇలాంటి సందర్భం మన జీవితంలో ఎదురైనప్పుడే మనకు కుటుంబం, స్నేహితుల విలువ బాగా అర్థమవుతుంది. నాక్కూడా అలాగే అర్థమైంది. నా కుటుంబ సభ్యులతో పాటు నా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు తోడుగా నిలిచి సహకారం అందించారు. వారి వల్లే నేను ప్రస్తుతం ఇలా ఉన్నాను" అని చెప్పింది ఇలియానా

తన బ్రేకప్ గురించి బయటకు చెప్పకపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది ఇలియానా. "మా బ్రేకప్ గురించి మీడియాలో వచ్చిన వార్తలు నన్ను ఇబ్బందిపెట్టాయి. దానికి కారణాలు ఇవే అని ఊహించుకొని రాయడం నన్ను బాధించింది. నేను నా బ్రేకప్ గురించి బయటకు చెప్పకపోవడానికి కారణం కూడా అదే. నేను దాని గురించి బయటకు చెబితే.. నేను చెప్పిన విషయాలన్నింటిలోనూ.. ఒకటి లేదా రెండు పాయింట్లు పట్టుకొని దాన్నే సెన్సేషనలైజ్ చేస్తారు. అది నన్ను బాధించడంతో పాటు.. నాతో పాటు అప్పటివరకూ బంధంలో భాగమైన వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే మాట్లాడలేదు " అని వివరించింది ఇలియానా.

అంతేకాదు.. "బ్రేకప్ తర్వాత నేను డిప్రెషన్‌‌లోకి వెళ్లిపోయేదాన్నే.. అయితే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని బలంగా నిలబడాలని నిర్ణయించుకున్నా" అని చెప్పుకొచ్చింది. ఇతరులు నాకు ఆనందాన్ని అందిస్తారని వేచి చూడడానికి బదులుగా.. నాకు నేనే సంతోషాన్ని అందించుకుంటున్నా. బ్రేకప్ తర్వాత నేనో థెరపిస్ట్‌ని కలిశాను. నా డిప్రెషన్‌ని తగ్గించుకునేందుకు నేనెలా ఉన్నానో.. అలా స్వీకరించడం ముఖ్యం అని అతడు నాకు వివరించాడు. అది పాటించడం మొదలు పెట్టినప్పటి నుంచి నా జీవితం ఆనందంగా మారింది" అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.

గతంలోనూ తన బంధం గురించి ఇలియానా పెద్దగా ఎప్పుడూ మాట్లాడలేదు. దీని గురించి ఓసారి ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడిస్తూ "మొదట్లో మా బంధం గురించి బయటకు చెప్పకూడదని మేం భావించాం. దాని గురించి మాట్లాడడం వల్ల నాకేమీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఆండ్రూకి ఇబ్బందులెదురవుతున్నాయి. చాలామంది తనని ట్రోల్ చేయడం, అసభ్యంగా మాట్లాడడం చేస్తున్నారు. నేనో సెలబ్రిటీ కాబట్టి.. ఇలాంటి కామెంట్లు తను భరించడం నాకు నచ్చలేదు. తన ప్రైవసీ, గౌరవానికి ఎలాంటి భంగం కలగకూడదని నా ఉద్దేశ్యం. అందుకే నా ప్రేమ విషయం బయటకు చెప్పలేదు" అంటూ వివరించింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.