పీరియడ్స్ విషయంలో అబ్బాయిలకు.. ఎలాంటి అపోహలుంటాయో మీకు తెలుసా?

పీరియడ్స్ విషయంలో అబ్బాయిలకు.. ఎలాంటి అపోహలుంటాయో మీకు తెలుసా?

పీరియడ్స్(periods).. దీని గురించి మ‌గ‌వారిని ఏమైనా అడిగితే.. టాపిక్ మార్చడానికి ప్రయత్నిస్తారు. లేదా తలదించుకొని పక్కకు వెళ్లిపోతారు. ఎందుకంటే వారికి మహిళల నెలసరి గురించి సరైన అవగాహన ఉండదు. పాఠశాల స్థాయిలోనే మహిళల రుతుక్రమం గురించి పాఠ్యాంశంలో ఉన్నప్పటికీ దాన్ని బోధించడానికి ఉపాధ్యాయులు సైతం ముందుకు రారు. దీని కారణంగా అబ్బాయిల్లో ఎన్నో సందేహాలు.. మరెన్నో అపోహలుంటాయి. వాటినే నిజమనుకొంటూ ఉంటారు. అసలు స్త్రీల రుతుక్రమం గురించి అబ్బాయిలు ఏమనుకొంటారో తెలుసుకోవడంతో పాటు వారి అపోహలను తొలగించే ప్రయత్నం చేద్దాం.


Also Read పీసీఓఎస్ ల‌క్ష‌ణాలేంటి? (Symptoms Of PCOS)


నెలసరి వస్తే మహిళలు అపవిత్రం అయిపోతారు.


ఇది తరతరాల నుంచి నరనరాల్లో జీర్ణించుకుపోయిన భావన. దయచేసి ఇప్పుడైనా ఈ ఆలోచనల నుంచి బయటకు రండి. అది మహిళల్లో సహజంగా జరిగే ప్రక్రియ.


అమ్మాయి కోపంగా ఉంటే పీఎంఎస్ అనుకొంటారు.


బాస్.. పీఎంఎస్‌లో ఉన్నప్పుడు మాత్రమే అమ్మాయిలు కోపంగా ఉండరు. మీలాగే మాకూ కోపం  రావడం సహజం. పీరియడ్స్ రావడానికి ముందు నుంచి శరీరంలో ఏర్పడే హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.


పీఎంఎస్ విషయంలో మహిళలు అతి చేస్తారు


ప్రీ మెనుస్ట్రువల్ సిండ్రోమ్ విషయంలో అబ్బాయిలకున్న మరో అపోహ ఇది. కావాలనే అమ్మాయిలు అలా ప్రవర్తిస్తారని వారు అనుకొంటారు. ఆ సమయంలో మాకు మూడ్ స్వింగ్స్ మాత్రమే కాదు.. ఇతర సమస్యలు కూడా ఎదురవుతాయి. నీరసంగా అనిపించడం, ప్రతి చిన్న విషయానికి చిరాకు రావడం, కడుపు ఉబ్బరంగా ఉండటం, వక్షోజాలు నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు మేం ఎదుర్కొంటాం.


పీరియడ్స్ సమయంలో అంత నొప్పేమీ ఉండదు.


2-boys-misconception-about-periods


Image: Pexels


మీ ఆలోచన తప్పు. పీరియడ్ క్రాంప్స్ ఎలా ఉంటాయంటే.. ఎవరైనా మీ పొత్తికడుపులో గుద్దితే ఎంత నొప్పి వస్తుంది? ఆ సమయంలో మాకు అంతకంటే ఎక్కువ నొప్పి వస్తుంది.


పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే గర్భం రాదు.


మీ ఆలోచన కూడా ఇదే అయితే మీరు పొరబడుతున్నట్లే. అయితే ఈ సమయంలో గర్భం ధరించే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ అసలు ప్రెగ్నెంట్ అవ్వరనుకోవడం పొరపాటే. ఎందుకంటే గర్భాశయంలోకి చేరిన వీర్యం సుమారుగా మూడు నుంచి ఐదు రోజుల పాటు బ్రతికే ఉంటుంది. కాబట్టి గర్భం వచ్చే అవకాశాలు లేకపోలేదు.


నెలసరి సమయంలో అయ్యే బ్లీడింగ్ మంచి రక్తం కాదు..


కాదు. ఆ సమయంలో అయ్యే రక్తస్రావం రంగు వేరుగా ఉండటంతో పాటు చిక్కగా ఉండటం వల్ల మీకు ఈ ఆలోచన కలిగి ఉండొచ్చు. ఆ రంగుకి కారణం.. రక్తంతో పాటు ఇతరపదార్థాలు కూడా కలవడమే.


టాంఫూన్ వాడితే.. అమ్మాయిలు కన్యత్వాన్ని కోల్పోతారు.


మాకో విషయం చెప్పండి. లైంగిక చర్యలో పాల్గొనడం, టాంఫూన్ ఉపయోగించడం రెండూ ఒకటేనా? కాదు కదా.. అలాంటప్పుడు టాంఫూన్ వాడితే.. అమ్మాయిలు తమ వర్జినీటీ కోల్పోతారని మీరెలా అనుకొంటున్నారు?


శానిటరీ ప్యాడ్, డైపర్ రెండూ ఒకటే..


3-boys-misconception-about-periods


Image: Pixabay


బహుశా టీవీలో వచ్చే కమర్షియల్ యాడ్స్ కారణంగా మీరు ఇలా అనుకొంటూ ఉండొచ్చు. ఈ రెండూ చూడటానికి వేర్వేరుగా ఉండటమే కాదు.. వాటి పనితీరు కూడా వేరుగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే కొందరికి శానిటరీ న్యాప్కిన్ గురించి అసలు అవగాహనే ఉండదు.


పీరియడ్స్ సమయంలో మహిళలు ఎప్పటిలా పనిచేసుకోలేరు.


ఇది కూడా నిజం కాదు. ఆ సమయంలో మాకు కొన్ని ఇబ్బందులుంటాయి. అయినా మేం రోజువారీ చేయాల్సిన పనులు ఎప్పటిలానే పూర్తి చేస్తాం. కళాశాలకు వెళతాం. ఆఫీసుకి వెళతాం.. ఎప్పటిలానే మా పనులు మేం హాయిగా పూర్తి  చేసుకోగలుగుతాం.


1-boys-misconception-about-periods


నెలసరి వచ్చిందంటే.. నాన్ స్టాప్‌గా  ఐదురోజుల పాటు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది


మీరనుకొన్నట్లుగా ఐదు రోజుల పాటు నాన్ స్టాప్‌గా బ్లీడింగ్ అయితే.. ఈ భూమ్మీద మేం బతికుండటం అసాధ్యం. పీరియడ్స్ సమయంలో 20 మి.లీ. నుంచి 40 మి.లీ. వరకు మాత్రమే రక్తస్రావం అవుతుంది. కొందరిలో ఇది 60 మి.లీ. గా కూడా ఉంటుంది.


పీరియడ్స్ సమయంలో మహిళలకు మూత్రం బదులు రక్తం వస్తుంది.


నెలసరి సమయంలో అయ్యే రక్తస్రావం గురించి చాలామంది అబ్బాయిల్లో ఉన్న మరో అపోహ ఇది. పైన మనం చెప్పుకొన్నట్లుగానే పీరియడ్స్ సమయంలో మహిళలకు మీరనుకొన్నంత స్థాయిలో బ్లీడింగ్ అవ్వదు. 20 మి.లీ. నుంచి 40 మి.లీ. మాత్రమే రక్తస్రావం అవుతుంది.


ఇవి కూడా చ‌ద‌వండి


మ‌గాళ్ల‌కు నెల‌స‌రి వ‌స్తే. . ఎలా ఉంటుందో మీకు తెలుసా??


తన జీవితంలో జరిగే ఈ సంఘటనలను ఏ ఆడపిల్ల ఎప్పటికీ మరచిపోదు..


ఇంట్లో ఒంటరిగా ఉంటే.. అమ్మాయిలు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో తెలుసా?