రేణు దేశాయ్.. ఆర్స్ ఎక్స్ 100 హీరోయిన్ ఒకే చిత్రంలో నటిస్తున్నారా..?

రేణు దేశాయ్.. ఆర్స్ ఎక్స్ 100 హీరోయిన్ ఒకే చిత్రంలో నటిస్తున్నారా..?

ఆర్ ఎక్స్ 100 చిత్రంలోని తన నటనతో టాలీవుడ్‌లోనే మోస్ట్ గ్లామరస్ కథానాయికగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజపుత్ (Payal Rajput) .. ప్రస్తుతం ఓ తెలుగు చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పేరు "టైగర్ నాగేశ్వరరావు" అని.. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) నటిస్తున్నారని టాక్. ఇదే చిత్రంలో హీరో సోదరి పాత్రలో రేణు దేశాయ్ (Renu Desai) నటిస్తున్నారని సమాచారం. కానీ ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. అయితే ఈ సమాచారం మాత్రం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. 

Payal Rajput (Instagram)

ఇటీవలే పాయల్ రాజపుత్.. పోలీస్ గెటప్‌లో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. తాను ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నానని.. తాను పోషిస్తున్న పాత్ర చాలా పవర్ ఫుల్ అని పాయల్ స్వయంగా ప్రకటించడంతో.. ఆ చిత్రం ఏమై ఉంటుందా? అని ఇప్పటికే నెటిజన్లు ఈ న్యూస్ పై ఆసక్తిని కనబరుస్తున్నారు. పంజాబీ చిత్రాలతో తన సినీ కెరీర్ మొదలుపెట్టిన పాయల్ రాజపుత్.. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో కూడా నటించింది. తర్వాత "సీత" చిత్రంలో "బుల్ రెడ్డి" సాంగ్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. 

Payal Rajput in "Bull Reddy" Song ("Sita" Movie Still)

ప్రస్తుతం పాయల్ రాజపుత్ వెంకీ మామా, ఆర్‌డీఎక్స్, సాహో, డిస్కో రాజా.. మొదలైన తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే "ఏంజెల్" అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం దక్షిణాదిలో బాగా డిమాండ్ ఉన్న కథానాయికలలో ఈమె కూడా ఒకరు అనడం అతిశయోక్తి కాదు. అయితే గ్లామర్ రోల్స్ పోషిస్తున్న ఈ నాయిక.. సడెన్‌గా యాక్షన్ రోల్ వైపు మొగ్గుచూపడంతో చాలామంది ఆశ్చర్యపోయారన్నది నిజం. ఇలాంటి డిఫరెంట్ రోల్స్ పోషించమని ఇప్పటికే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఈ కథనం కూడా చదవండి: నాగచైతన్య, వెంకటేష్ చేస్తున్న.. మూవీ మ్యాజిక్ "వెంకీ మామ" విశేషాలివే..!

Renu Desai (Instagram)

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాయల్ రాజపుత్ నటిస్తున్న చిత్రంలోనే రేణు దేశాయ్ కూడా నటిస్తున్నారని వార్తలు రావడం గమనార్హం. మొన్నటి వరకూ రేణు బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో వ్యాఖ్యతగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. తర్వాత అది నిజం కాదని తేలింది. ఆ తర్వాత ఆమె అదే బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్‌గా పాల్గొననున్నారనీ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో కూడా నిజం ఎంతుందో తెలియదు. అయితే రేణు దేశాయ్ సినిమాలలో నటిస్తానని మాత్రం గతంలో చెప్పారు. అదే నిజమైతే..ఈ సినిమాతోనే మళ్లీ ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టవచ్చు. 

ఈ కథనం కూడా చదవండి: సీత అని కాకుండా.. శూర్ఫణక అని పేరు పెట్టాలా: టైటిల్ కాంట్రవర్సీలో కాజల్ సినిమా

Bellamkonda Srinivas (Instagram)

ఈ వార్తలన్నీ ఒక ఎత్తయితే.. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న "టైగర్ నాగేశ్వరరావు" చిత్రంలోనే పాయల్ రాజపుత్, రేణు దేశాయ్ నటిస్తున్నారని వార్తలు రావడం ఆశ్చర్యకరం. పాయల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తే.. రేణు హీరో సోదరి పాత్ర పోషిస్తారని వార్తలు రావడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే "రాక్షసుడు" అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఆ చిత్రం విడుదలవుతుంది. మరి ఈ చిత్రం  విడుదల అయ్యాకే.. "టైగర్ నాగేశ్వరరావు" చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందేమో.. ఈ విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. 

స్టువర్ట్‌పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి 70వ దశకంలో దోపిడీలు, దొంగతనాలు చేసి పోలీసులకు దొరకుండా  తప్పించుకొని తిరిగేవాడట. ఆయనను ఇండియన్ రాబిన్ హుడ్ అని కూడా పిలిచేవారట. ఇప్పుడు ఆయన బయోపిక్‌ను సినిమాగా తీస్తున్నారని.. ఈ సినిమాను వంశీక్రిష్ణ తెరకెక్కిస్తున్నారని.. ఇందులో టైటిల్ రోల్‌లో శ్రీనివాస్ నటిస్తున్నారని మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. గతంలో వంశీక్రిష్ణ "కిట్టు ఉన్నాడు జాగ్రత్త" అనే సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 

ఈ కథనం కూడా చదవండి: 'సీత' అభిమానులను ఆకట్టుకోగలిగిందా? (సినిమా ప్లస్ & మైనస్ పాయింట్స్)