టెన్నిస్ ప్రిమియర్ లీగ్‌లోకి అడుగుపెట్టిన.. రకుల్ ప్రీత్ సింగ్..!

టెన్నిస్ ప్రిమియర్ లీగ్‌లోకి అడుగుపెట్టిన.. రకుల్ ప్రీత్ సింగ్..!

రకుల్ ప్రీత్ సింగ్ (rakul preet singh).. 'కెరటం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలందరిక పక్కన కథానాయికగా కనిపిస్తూ.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. కేవలం కథానాయికగా మాత్రమే కాదు.. వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టి ముందుకు దూసుకుపోతోంది రకుల్ ప్రీత్.

ఫిట్‌నెస్ అంటే ఎంతగానో ఇష్టపడే ఈ అందాల నాయిక.. ఎఫ్ 45 అంటూ ఓ ఫిట్‌నెస్ స్టూడియో ఫ్రాంచైజ్ కూడా తీసుకొని.. ఆ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ఫిట్‌నెస్ వ్యాపారాన్ని సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తోన్న జోష్‌తో మరో వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టి.. తన వ్యాపార దక్షతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది రకుల్ ప్రీత్.

ఇటీవలే ఫైన్ క్లబ్ 'హైదరాబాద్ స్ట్రైకర్స్' అనే టీమ్‌కి సహ యజమానిగా మారింది అందాల తార రకుల్. ఈ జట్టును కొనుగోలు చేసి టెన్నిస్ ప్రిమియర్ లీగ్‌లోకి (Tennis Premier League) అడుగుపెట్టిన రకుల్ స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ " ఈ లీగ్‌లో భాగం అవుతున్నందుకు.. నేను ఎంతగానో ఆనందంగా, ఎక్సయిటెడ్‌గా ఉన్నాను. ఇది ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ లీగ్ మన దేశంలో టెన్నిస్ క్రీడలో రాణిస్తున్న అబ్బాయిలు, అమ్మాయిలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది" అని చెప్పింది.

ఈ సందర్భంగా ఆటల ప్రాధాన్యం గురించి కూడా చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్. "నేను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాను. అందుకే నాకు జీవితంలోని అన్ని సందర్భాల్లో ఆటల ప్రాధాన్యం గురించి తెలుసు. దేశంలో టెన్నిస్ ఆటలోకి ఎక్కువ మంది అడుగుపెట్టేందుకు.. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. టెన్నిస్ చాలా మంచి క్రీడ. దీనికి మన దేశంలో మరింత గుర్తింపు లభించాల్సిన అవసరం ఉంది.

అందుకే యువతీ యువకులలోని టాలెంట్‌ని గుర్తించి.. వారికి ప్రోత్సాహం అందించే టెన్నిస్ ప్రిమియర్ లీగ్‌లో నేను కూడా భాగస్వామినయ్యాను. నా సొంత ఊరు దిల్లీ అయినా.. నాకు హైదరాబాద్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. ఇక్కడే నేను నా కెరీర్ ప్రారంభించాను. ఇది నాకు నా సొంత ఊరి కంటే ఎక్కువ. అందుకే హైదరాబాద్ టీమ్‌ని కొనాలని నిర్ణయించుకున్నా. మా జట్టుకు సానియా మీర్జాకి కోచింగ్ ఇచ్చిన నరేంద్రనాథ్ మెంటార్‌గా ఉండడం మా అదృష్టం" అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్.

గతంలో ఎప్పుడైనా టెన్నిస్ ఆడారా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ "నేను చిన్నతనంలో టెన్నిస్ ఎక్కువగా ఆడేదాన్ని. అయితే ఆ తర్వాత గోల్ఫ్ ఆడడం ప్రారంభించా. గోల్ఫ్‌లో నేషనల్ లెవల్ వరకూ వెళ్లాను. అయితే ఆ తర్వాత నేను మోడలింగ్‌లో బిజీ అయిపోవడం వల్ల.. నా కెరీర్‌ని కొనసాగించలేకపోయాను. ఇప్పుడు దేశంలో క్రీడల వ్యాప్తిని నేను సాయపడుతున్నా. ఏదో ఒక రకంగా క్రీడల్లో భాగస్వామిని అయ్యానన్న ఆనందం నాకు చాలు." అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

మాజీ టెన్నిస్ క్రీడాకారులు కునాల్ ఠాకూర్, నటుడు, వ్యాపారవేత్త మృణాల్ జైన్‌లు ఈ టీపీఎల్‌ని ప్రారంభించారు. గతేడాది మొదటి సీజన్ కూడా జరిగింది. ఈ ఏడాది టీపీఎల్ బాలికలు, బాలుర విభాగంలోనే కాకుండా.. పురుషులు, మహిళలు, అండర్ 18, వీల్ ఛైర్ మొదలైన విభాగాల్లో కూడా జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఈ వేడుకల్లో.. హైదరాబాద్‌కి చెందిన ఫైన్ క్యాబ్ వైర్స్ అండ్ కేబుల్స్ సంస్థ యజమాని బ్రిజ్ గోపాల్ భుటాడాతో కలిసి.. సహ యజమానిగా వ్యవహరిస్తోంది రకుల్.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.