తెలుగు సినిమాల్లో.. మన హీరోయిన్స్ హవా మొదలైందా …
ప్రతి తెలుగు నిర్మాత , దర్శకుడికి ఎదురయ్యే సర్వసాధారణ ప్రశ్న ఏంటంటే …”మీరు తెలుగు సినిమాలు తీస్తూ .. మన కథానాయికలను ఎందుకు పెట్టుకోరు? అని. దీనికి వాళ్ళ సమాధానం ఏమిటంటే .. “ఇక్కడ పుట్టిన అమ్మాయిలు చిత్ర రంగం పై మక్కువ చూపించడం లేదండీ .. వారు ముందుకి వస్తే అవకాశాలు ఎందుకు ఇవ్వము మీరే చెప్పండి” అని ఎదురు ప్రశ్న వేస్తారు.
అయితే 90వ దశకం, 2000 ప్రారంభ దశలో తెలుగు సినీ పరిశ్రమలో.. స్థానిక అమ్మాయిలు కథానాయికలుగా అవకాశాలు దక్కించుకున్నా .. ఆ తరువాత క్రమక్రమంగా వీరి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఇక ఇప్పటి పరిస్థితి ఒకసారి గమనిస్తే, టాలీవుడ్ పరిశ్రమలో మన అమ్మాయిల సంఖ్య ఇప్పుడు కనీసం అయిదు కూడా దాటదంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇటువంటి తరుణంలో కూడా ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ వెండితెర పై తమ సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు.
ఈ ఇద్దరు ఎవరంటే – ఈషా రెబ్బ (Eesha Rebba) & ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar). ముందుగా మనం ఈషా రెబ్బ గురించి మాట్లాడుకుంటే … ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలుగు తెరకి ఈ హైదరాబాదీ అమ్మాయిని పరిచయం చేయగా.. ఆ తర్వాత ఆమె మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన తొలిచిత్రంతోనే మంచి అభినయం ప్రదర్శించే నటిగా ప్రేక్షకుల దగ్గర డిస్టింక్షన్ మార్కులను కొట్టేసింది .
ఆ తరువాతి కాలంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ తాజాగా ఎన్ఠీఆర్ “అరవింద సమేత వీర రాఘవ”లో కూడా ఒక మంచి పాత్రలో మెరిసింది. అంతకు ముందు.. ఆ తర్వాత, బందిపోటు, అమీ తుమీ, అ, బ్రాండ్ బాబు లాంటి సినిమాలలో నటించిన ఇషా నటించిన మరో చిత్రం “సుబ్రమణ్యపురం” ఈ రోజు విడుదల అవుతోంది . అలాగే ఆమె రాజమౌళి-రాం చరణ్-ఎన్టీఆర్ చిత్రమైన #RRR లో కూడా నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక మరో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ విషయానికి వస్తే , ఈ టాక్సీ రాణి సోషల్ మీడియాతో పరిచయం ఉన్నవారికి కాస్త ముందుగానే తెలుసు అని చెప్పాలి. ఎందుకంటే వైరల్ అయిన రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ లో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా చేయడమే అందుకు కారణం. అనంతపురంలో పుట్టి పెరిగిన ప్రియాంక తండ్రి మహారాష్ట్రకు చెందిన వారైనా… ఇక్కడే పుట్టిన ఆమెకు తెలుగు చాలా బాగా వచ్చు.
ఎన్నో ఒడిదొడుకుల మధ్య విడుదలైన “టాక్సీ వాలా” చిత్రంలో నటించిన ప్రియాంకకి.. తొలిచిత్రమే బ్లాక్ బస్టర్ కావడంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ప్రియాంక నటనకు చాలా మంది ఫిదా కావడంతో కచ్చితంగా ఈ అమ్మడికి అవకాశాలు మెండుగానే ఉంటాయన్న టాక్ తెలుగు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. “జీన్స్” చిత్రంలో ఐశ్వర్య రాయ్ యాక్టింగ్ చూసి, సినీ రంగం పై మక్కువ పెంచుకున్నాను అని చెబుతున్న ప్రియాంక.. ప్రస్తుతం తెలుగు సినీ అభిమానుల మనసు దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
పైగా ఇంటర్వ్యూలలో కూడా ప్రియాంక చాలా ప్రాక్టికల్ పద్దతిలో మాట్లాడుతుండడం.. అదే సమయంలో కథానాయికగా కొనసాగాలంటే ఎలా ఉండాలి అన్న క్లారిటీ ఆమెలో నిర్మాతలకు కనిపించడంతో ఆమె భవిష్యత్తులో మంచి హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.