'వాల్మీకి' అలియాస్ 'గద్దలకొండ' గణేష్ చిత్రంలో.. మాస్ ప్రేక్షకులు మెచ్చే '5' అంశాలు ఇవే

'వాల్మీకి' అలియాస్ 'గద్దలకొండ' గణేష్ చిత్రంలో.. మాస్ ప్రేక్షకులు మెచ్చే '5' అంశాలు ఇవే

(Varun Tej starrer 'Valmiki' Alias 'Gaddalakonda Ganesh' Movie Review)

ఒక రీమేక్ చిత్రాన్ని తీసి.. మాటలు- మార్పులు- దర్శకత్వం అనే సరికొత్త టైటిల్ కార్డు వేసుకున్న.. వేసుకోగల ప్రతిభ గల దర్శకుడే హరీష్ శంకర్. పైగా ఆయన సినిమాల్లో కథ, కథనాల కన్నా డైలాగ్స్‌కు ఓ ప్రత్యేక శైలి ఉంటుంది.  పవర్‌ఫుల్ పంచ్‌లతో.. ఆ డైలాగ్స్ మాస్ ప్రేక్షకులు ముచ్చటపడేలా ఉంటాయన్నది సత్యం.  'గబ్బర్ సింగ్' చిత్రంతో పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలు పెంచి మరీ..  హిట్ కొట్టిన ఈ దర్శకుడు... తమిళంలో సూపర్ హిట్ అయిన.. 'జిగర్ తండా'ని వరుణ్ తేజ్ హీరోగా తెలుగులో రీమేక్‌ చేశారు.

తొలుత ఈ సినిమాకి వాల్మీకి టైటిల్ ఖరారు చేసినా.. తర్వాత 'గద్దలకొండ గణేష్' పేరుతో ఈ రోజు చిత్రం రిలీజైంది (నిన్న రాత్రి కొందరి మనోభావాల దృష్ట్యా సినిమా టైటిల్ మార్చడం జరిగింది). మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ చిత్రంలోని ఆసక్తికర అంశాలు ఏంటనేవి మనం కూడా తెలుసుకుందాం

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!

వాల్మీకి అలియాస్ గడ్డలకొండ గణేష్ కథ..

ఎలాగైనా సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే ఓ యువ దర్శకుడు అభిలాష్‌కి (అథర్వ)  ఒక చిత్రమైన ఆలోచన వస్తుంది. ఒక నిజ జీవిత విలన్ గురించి తెలుసుకుని.. ఆ పాత్ర పైనే సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుండగా.. తనకు గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) గురించి తెలుస్తుంది. అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అభిలాష్ గద్దలకొండ ప్రాంతానికి వెళ్తాడు. ఈ క్రమంలో తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇదే విషయం గద్దలకొండ గణేష్‌కి తెలుస్తుంది. అతను అభిలాష్ తన కథను సినిమాగా తీయడానికి ఒప్పుకుంటాడు. అయితే దానికి ఒక షరతు పెడతాడు. మరి ఆ షరతుకి అభిలాష్ ఒప్పుకుంటాడా? లేదా అనేది వెండితెర పైనే చూడాలి.

ఈ సినిమా విషయానికి వస్తే,  ఒక రీమేక్ చిత్రమైనప్పటికి కూడా... మాతృకలో తనకి బాగా నచ్చిన పాత్రని కేంద్రంగా తీసుకుని.. తెలుగు ఆడియన్స్‌కి నచ్చే రీతిలో వరుణ్ తేజ్ (గద్దలకొండ గణేష్) పాత్రని తీర్చిదిద్దడం జరిగింది. ఆ పాత్రకి సంబంధించి విడుదలచేసిన పోస్టర్స్, లుక్స్, టీజర్స్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లాయి. ఒకరకంగా  చెప్పాలంటే.. ఈ సినిమాకి విడుదలకి ముందే ఒక క్రేజ్ రావడానికి కారణమైంది ఈ పాత్ర.

ఇక ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న చిత్రంలో.. మీరు మెచ్చే అయిదు అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* వరుణ్ తేజ్ అలియాస్ గద్దలకొండ గణేష్

అసలు ఈ సినిమాకి ఇంత ఆకర్షణ రావడానికి కారణం.. అలాగే గద్దలకొండ గణేష్ పాత్రని ఫ్యాన్స్ లేదా ప్రేక్షకులు  ఇష్టపడడానికి కారణం వరుణ్ తేజ్ నటనే అని చెప్పుకోవచ్చు.  ఆ పాత్ర కోసం ఆయన ప్రిపరేషన్, లుక్స్.. మరీ ముఖ్యంగా హావభావాలు అన్ని సరిగ్గా కుదిరాయి.

ఒక విలన్ అనేవాడు ఎలా ఉండాలో.. కరడుగట్టిన విలన్లకు సంబంధించి జనసామాన్యంలో ఎలాంటి ఆలోచన ఉంటుందో.. దాన్ని వందశాతం ప్రతిబింబించేలా వరుణ్ నటన ఉంది. ఒకరకంగా ఆయన ఈ సినిమాని మొత్తం తానై నడిపించాడనే చెప్పాలి.

తెలంగాణ యాసలో డైలాగ్స్ పలకడం.. ముఖ్యంగా కళ్ళతో అభినయించడం ఈ చిత్రానికే హైలెట్. అయితే మాతృకలో మాత్రం.. ఇదే పాత్ర కోసం సెకండాఫ్‌లో కాస్త కామెడీగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. తెలుగులో పాత్రను మొదటి నుండే చాలా పవర్‌ఫుల్‌గా చూపించడంతో.. కామెడీ జోలికి వెళ్లలేదు దర్శకుడు. దాంతో సినిమా మొత్తం కూడా.. ఈ పాత్ర పవర్‌ఫుల్‌గానే ఉంటుంది.

* సంభాషణలు

హరీష్ శంకర్ (Harish Shankar) బలం & బలగం రెండు సంభాషణలే. ముఖ్యంగా ఆయన రాసే సంభాషణలను థియేటర్‌కి వచ్చిన ఆడియన్స్ ఎంజాయ్ చేయకుండా వెళ్ళలేరు. ఆయన తీసిన సినిమాలు ఫ్లాప్ అయుండచ్చు. కాని రాసిన డైలాగ్స్ మాత్రం ఎక్కడ కూడా ఫ్లాప్ అవ్వలేదు.

ఇక ఈ చిత్రంలో కూడా డైలాగ్స్ భేష్ అనే చెప్పాలి. ప్రధాన పాత్రలతో పాటుగా.. సహాయ పాత్రలకు కూడా ఆయన మంచి సంభాషణలే రాసారు. అలాగే ద్వితీయార్ధంలో తనికెళ్ళ భరణి పాత్రతో చెప్పించిన డైలాగ్స్... అలాగే  సినిమా ప్రారంభంలో బ్రహ్మానందం చెప్పే మాటలు..  సినిమా అంటే  దర్శకుడికి ఎంత ఇష్టమో  కచ్చితంగా తెలియజేస్తాయి. 

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ - మెగా బిజినెస్ ఉమన్ ఉపాసనల.. ప్రేమ బంధం వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి ఎవరో తెలుసా?

* వినోదం

ఈ సినిమాలో వినోదం పాళ్ళు ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే సినిమా మొత్తం ఒక పాత్ర చుట్టూ కేంద్రీకృతమై నడుస్తున్నప్పుడు.. ఎక్కడా కూడా కథనం తప్పుదోవ పట్టకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు.  సినిమా ట్రాక్ తప్పకుండా.. గ్యాప్‌ను కవర్ చేస్తూ.. సన్నివేశాలకు తగినట్లుగా పాత్రలు చెప్పే డైలాగ్స్ ద్వారా కావాల్సినంత వినోదాన్ని పంచగలిగాడు.

* వరుణ్ తేజ్ - పూజ హెగ్డే ఎపిసోడ్

వరుణ్ తేజ్, పూజ హెగ్డేల లవ్ ఎపిసోడ్ మనకి మాతృకలో కనిపించదు. హరీష్ శంకర్ చేసిన మార్పుల్లో ఇది ప్రధానమైంది. ద్వితీయార్ధంలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొద్దిసేపే అయినప్పటికి.. 1990లలో ఉండే పరిస్థితులకి తగ్గట్టుగా సన్నివేశాలు, మాటలు రాసి అప్పటి ఫీల్ మనకి కలిగించే ప్రయత్నం చేశారు. అలాగే శోభన్ బాబు, శ్రీదేవి నటించిన అలనాటి చిత్రం "దేవత"లోని సూపర్ హిట్ సాంగ్ 'వెలువొచ్చి గోదారమ్మ' పాటని.. మరోసారి హీరో, హీరోయిన్లపై తమదైన శైలిలో తెరకెక్కించారు. ఆ పాటను బాగా చేశారు అని చెప్పకపోయినా.. చెడగొట్టలేదు అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

* నేపధ్య సంగీతం

మిక్కీ జె మేయర్ అంటే క్లాస్ పాటలు.. ప్రశాంతమైన నేపధ్య సంగీతం మాత్రమే ఇస్తాడని కొందరి టాక్. కానీ ఆయన జనాల అపోహను పోగొడుతూ.. ఈ  సినిమా పాటలు విడుదలైన సమయంలోనే నిరూపించుకోగలిగాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి., మరి ముఖ్యంగా గద్దలకొండ గణేష్ పాత్రకి ఇచ్చిన నేపధ్య సంగీతం చాలా చక్కగా కుదిరింది. సినిమాలో ఉన్న నాలుగు పాటల్లో ఒకటి రీమిక్స్ కాగా.. మరో మూడు పాటలు ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాయి.

చివరిగా.. ఈ వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ చిత్రానికి మాతృకైన 'జిగర్ తండా' ప్రధాన కథానాన్ని ఏ మాత్రం మార్చకుండా.. దానిని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసేందుకు ప్రయత్నించాడు దర్శకుడు హరీష్ శంకర్. ముఖ్యంగా గద్దలకొండ గణేష్ పాత్రని పెంచుతూ సినిమాని తీయడం వల్ల.. కథనంలో కొన్ని చోట్ల  మైనర్ ఇబ్బందులు తలెత్తాయి. అవి మినహాయిస్తే, మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా పసందైన విందు అనే చెప్పాలి.

వరుణ్ తేజ్ 'వాల్మీకి' .. నిజంగానే అదిరిపోయింది ..!