‘ప్లీజ్ వెక్కిరించకండి’.. బాడీ షేమింగ్ గురించి కన్నీరు పెట్టుకొన్న విద్యాబాలన్

‘ప్లీజ్ వెక్కిరించకండి’.. బాడీ షేమింగ్ గురించి కన్నీరు పెట్టుకొన్న విద్యాబాలన్

కాస్త బొద్దుగా ఉన్నా.. సన్నగా ఉన్నా.. రంగు తక్కువున్నా.. జుట్టు పలచగా ఉన్నా.. అసలు ఎలా ఉన్నా సరే బాడీ షేమింగ్ చేసేవాళ్లు మనకు కనిపిస్తూ ఉంటారు. వారు చేసే కామెంట్లు చాలా బాధ కలిగించేవిగా ఉంటాయి. ఈ బాడీషేమింగ్‌కు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఏమీ లేదు. మహిళలను వారి శరీరాకృతి కారణంగా వేధిస్తుంటారు.


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా బాడీ షేమింగ్‌కు గురైన వారిలో ఒకరు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని మనతో పంచుకొన్నారు విద్య. ఇప్పుడు మాత్రం బాడీ షేమింగ్ చేయొద్దంటూ వీడియో ద్వారా వేడుకొంటున్నారు. అలాగే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.


కొన్ని రోజుల క్రితం విద్యాబాలన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. నల్ల చీర కట్టుకొని, దుప్పట్టాతో తన శరీరాన్ని కప్పుకొని ‘కభీ తూ మోటీ కెహతా హై.. కభీ తూ చోటీ కెహతా హై’ అనే పాటతో మొదలు పెట్టిన ఈ వీడియోలో శరీర ఆకృతి, రంగు కారణంగా చిన్నచూపు, అవమానాలను ఎదుర్కొనేవారికి అండగా నిలబడటంతోపాటు బాడీ షేమింగ్ చేయొద్దని కోరుతూ విద్య ఈ వీడియోను రూపొందించారు.


పాట పాడుతున్న సమయంలో ఆమె కళ్ల నిండా నీరే నిండింది. ఆ తర్వాత ఎదుటివారి ముఖం, కళ్లు, చర్మం రంగు, ఎత్తుపై మనం చేసే కామెంట్లు వారిని ఎంత బాధపడతాయో ఆమె వివరించారు. 


చర్మ రంగును, శరీర ఆకృతిని వంకగా చూపుతూ ఎవరి మీదా జోకులు వేయకండి. ఎందుకంటే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉంటారు. అందుకే అందరూ ఎవరికి వారే స్పెషల్ అని అంటూ ఉంటారని, ఆ విషయం అందరూ గుర్తించాలని కోరారు.

ప్రస్తుతం విద్యాబాలన్ బిగ్ ఎఫ్ఎంతో కలిసి  ‘దున్ బదల్ కే దేఖో’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీని ద్వారా బాడీషేమింగ్‌కు గురైన వారికి అండగా నిలబడటంతో పాటు.. వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.


అందులో భాగంగానే ఈ వీడియోను రూపొందించారు. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ ‘మనలో చాలామంది బాడీషేమింగ్ కు గురైన వారే. ఈ క్రూరమైన ధోరణి ఇటీవల బాగా విస్తరిస్తోంది’ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు.


విద్యాబాలన్ షేర్ చేసిన ఈ వీడియో ఇఫ్పుడు వైరల్‌గా మారింది. ఆమె అభిమానులే కాకుండా చాలామంది ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకొంటున్నారు. బాడీ షేమింగ్ విషయంలో ప్రజల మనసుల్లోని అభిప్రాయాలు మార్చడానికి విద్య చేస్తున్న కృషి అభినందనీయం అని కూడా అంటున్నారు.


బాడీషేమింగ్ అమ్మాయిలు మాత్రమే ఎదుర్కొనే సమస్య కాదు. అబ్బాయిలు సైతం దీని బాధితులే. మెల్లమెల్లగా విస్తరిస్తున్న ఈ సమస్యను అంతం చేయాలనే సంకల్పంతో విద్య చేస్తున్న ప్రయత్నం సఫలమవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


ప్రస్తుతం విద్యాబాలన్ ‘మిషన్ మంగళ’ సినిమాలో నటిస్తున్నారు. దీనిలో అక్షయ్ కుమార్, తాప్సీ, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు గాంచిన శకుంతలా దేవి బయోపిక్‌లోనూ నటించనున్నారు.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.