నా ఇంట్లో ఉండేందుకు.. నాకే భయమేస్తోంది : విజయ్ దేవరకొండ

నా ఇంట్లో ఉండేందుకు.. నాకే భయమేస్తోంది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) .. ప్రస్తుతం ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. ఇతర రాష్ట్రాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను కైవసం చేసుకొని.. ఫోర్బ్స్ 30 జాబితాలో చోటు సంపాదించాడీ హీరో. అలాగే 'అర్జున్ రెడ్డి' సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సైతం సంపాదించుకున్నాడు విజయ్. ఈ సినిమా హిందీ, కన్నడ భాషల్లో తిరిగి రూపొందిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయ్ తన మదిలోని ఆలోచనలను అభిమానులతో పంచుకున్నాడు. కొత్త ఇల్లు కొనుక్కున్నా.. అందులో ఉండాలంటే తనకు భయమేస్తోందని చెప్పుకొచ్చాడు.

ఇప్పటివరకూ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటోన్న విజయ్ కుటుంబం.. తాజాగా ఫిల్మ్ నగర్‌లో హీరో శ్రీకాంత్ ఇంటికి దగ్గరలోకి మారింది. తన తల్లిదండ్రులు, సోదరుడితో పాటు నూతన గృహప్రవేశం (House Warming) చేసిన విజయ్.. ఈ కొత్త ఇంటిలో నివసించాలంటే మాత్రం భయమేస్తోందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం విశేషం. తన ఇష్టాయిష్టాలకు తగినట్లుగా అన్ని సౌకర్యాలతో విశాలంగా ఈ ఇంటిని నిర్మించారు విజయ్. ఈ ఇంటి కోసం ఆయన.. దాదాపు 20 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు టాక్. అయినా సరే.. అక్కడ నివసించాలంటే విజయ్‌కి భయంగా ఉందట.

"నేను కష్టపడి చాలా పెద్ద ఇల్లు కొన్నాను. కానీ అది నన్ను భయపెడుతోంది. ఇంత పెద్ద ఇంట్లో ఉండగలమా? అనిపిస్తోంది.. మా అమ్మే మా అందరికీ ధైర్యం చెప్పాలి. "ఇది మన ఇల్లే.. భయపడాల్సిన అవసరం లేదనే" ఫీలింగ్ తేవాలి. తను ఇంతకుముందులా.. ఈ ఇంటిని కూడా సౌకర్యవంతంగా మార్చాలని నా కోరిక" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు విజయ్. దీంతో పాటు ఓ ఫొటోని కూడా షేర్ చేశాడు ఈ రౌడీ హీరో.

ఈ  చిత్రంలో విజయ్, ఆయన తమ్ముడు ఆనంద్.. అలాగే తన తండ్రి సంప్రదాయబద్ధమైన పంచె కట్టుతో పాటు.. నుదుటన నామాలు పెట్టుకొని ఫోటోకి ఫోజులిచ్చారు. అలాగే విజయ్ తల్లి క్రీమ్, లేత ఆకుపచ్చ రంగుల కలయికతో ఉన్న చీర కట్టుకుని కనిపించారు. ఇవే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ "అమ్మ ఆనందం, నాన్న గర్వం కలిసి మా కొత్త ఇల్లు.. మా ఈ అందమైన జర్నీలో తోడు నిలిచిన వారందరికీ.. మా నలుగురు దేవరకొండ కుటుంబ సభ్యుల తరఫున బోలెడంత ప్రేమను పంపుతున్నాం" అంటూ పోస్ట్ చేశాడు విజయ్.

 

విజయ్ దేవరకొండ ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. విజయ్ తండ్రి ఓ టెలివిజన్ డైరెక్టర్. ఒకప్పుడు సినిమాల్లోకి రాకముందు.. తన బ్యాంక్ అకౌంట్‌లో మినిమం బ్యాలన్స్ కూడా ఉండేది కాదని.. విజయ్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి విజయ్ 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలు హిట్ అయ్యాక.. ఒక్కో సినిమాకి సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అంతే కాకుండా విజయ్.. చాలా బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా చాలా మొత్తాన్ని సంపాదిస్తున్నాడు.

'రౌడీ బ్రాండ్' పేరుతో ఇప్పటికే బట్టల వ్యాపారం కూడా చేస్తున్న విజయ్ దేవరకొండ..  సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. తనకు హీరోగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన 'పెళ్లి చూపులు' సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెబుతాను' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా మంచి లాభాలనే తెచ్చిపెట్టిందట. దీంతో తన ఇమేజ్‌కి తగినట్లుగా అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లుని విజయ్ నిర్మించుకున్నాడట. ఇందులో ఇంటీరియర్ కోసం చాలా ఎక్కువ ఖర్చు చేశారని వినిపిస్తోంది. విజయ్ తండ్రి తన ఆఫీస్‌ని కూడా.. ఇందిరా నగర్ నుంచి ఇక్కడికే మార్చినట్లు వార్తలొస్తున్నాయి.

అలాగే ప్రస్తుతం విజయ్‌కి ఓ మంచి అమ్మాయిని.. వెతికే పనిలో ఉన్నారట ఆయన తల్లిదండ్రులు. విజయ్ పెట్టిన పోస్ట్ చూసిన అభిమానులు కూడా "ఇల్లు కట్టేశావ్.. ఇక పెళ్లెప్పుడూ?" అంటూ అడుగుతుండడం విశేషం. ఇక కెరీర్ విషయానికొస్తే "డియర్ కామ్రేడ్" చిత్రంతో మంచి హిట్ కొట్టిన విజయ్.. ప్రస్తుతం "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరీన్ ట్రెసా, ఇసబెల్ లీట్ కథానాయికలుగా కనపించనున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.