నలుగురు కథానాయికల ప్రేమలో.. 'వరల్డ్ ఫేమస్ లవర్' విజయ్ దేవరకొండ ..!

నలుగురు కథానాయికల ప్రేమలో.. 'వరల్డ్ ఫేమస్ లవర్' విజయ్ దేవరకొండ ..!

విజయ్ దేవరకొండ (vijay devarakonda).. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్.. లాంటి చిత్రాలతో దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యంగ్ హీరో. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ (world famous lover) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మొత్తం నలుగురు కథానాయికలతో ఈ సినిమాలో రొమాన్స్ చేయనున్నాడట విజయ్. దీనికి సంబంధించి నలుగురు కథానాయికల పేర్లతో కూడిన నాలుగు ఫస్ట్ లుక్‌లను.. నాలుగు రోజుల నుంచీ విడుదల చేస్తోంది చిత్ర యూనిట్.

మొదటి రోజు సువర్ణ, శీనయ్యల పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో సువర్ణగా ఐశ్వర్యా రాజేష్ నటించడం విశేషం. ఈ పోస్టర్‌ని పబ్లిష్ చేస్తూ 'మా ఆయనే వరల్డ్ ఫేమస్ లవర్. మా శీనయ్యని ప్రేమికుల రోజున కలుద్దురు' అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది అందాల రాశి ఐశ్వర్యా రాజేష్. 'సువర్ణ' అంటూ ఇదే పోస్టర్‌ని పోస్ట్ చేస్తూ.. తనని అభిమానులకు పరిచయం చేశాడు హీరో విజయ్ దేవరకొండ. 

రెండో రోజు  'ఇజా మై చెరీ' అంటూ తన ఫ్రెంచ్ లవర్‌ని ఫ్రెంచ్‌లోనే పరిచయం చేస్తూ ట్వీట్ చేశాడు విజయ్. ఈ సినిమాలో రెండో కథానాయికైన ఇజబెల్లా లాటీ కూడా ఫ్రాన్స్‌లో దిగిన వీరిద్దరి ఫొటో ఫస్ట్ లుక్‌ని పోస్ట్ చేస్తూ 'గౌతమ్ నా లవర్.. నా వరల్డ్ ఫేమస్ లవర్' అంటూ ఫ్రెంచ్‌లో పోస్ట్ చేసింది.

మూడో రోజు క్యాథరీన్ ట్రెసా ఫస్ట్ లుక్‌ని పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. 'యూనియన్ లీడర్ శీను, స్మితా మేడమ్.. ఇల్లందు' అంటూ వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోని పోస్ట్ చేశాడు విజయ్. క్యాథరీన్ దీన్నే మళ్లీ పోస్ట్ చేస్తూ 'బొగ్గు గనిలో నా బంగారం.. వరల్డ్ ఫేమస్ లవర్. మీట్ శ్రీను.. స్వీట్ యూనియన్ లీడర్. ఈ వేలంటైన్స్ డే రోజున మమ్మల్ని కలవండి' అంటూ పోస్ట్ చేసింది క్యాథరీన్.

నాలుగో రోజు రాశీ ఖన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసిందీ చిత్ర యూనిట్. రాశీ ఈ పోస్టర్‌ని పోస్ట్ చేస్తూ 'ఈ అబ్బాయిని నేను నా ప్రపంచంగా మార్చుకున్నా. నా వరల్డ్ ఫేమస్ లవర్ గౌతమ్‌ని ఈ వేలంటైన్స్ డే సందర్భంగా కలవండి' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌ని పోస్ట్ చేస్తూ 'నేను, యామిని, మా ప్రపంచం. ఈ వేలంటైన్స్ డేకి వరల్డ్ ఫేమస్ లవర్‌ని కలవండి' అంటూ పోస్ట్ చేశాడు విజయ్ దేవర కొండ.

పోస్టర్ల ప్రకారం చూస్తే ఇందులో  శీను, గౌతమ్ అనే రెండు పాత్రల్లో విజయ్ దేవరకొండ కనిపించనున్నట్లు అర్థం అవుతోంది. అయితే ఇద్దరూ ఒకరేనా లేక ద్విపాత్రాభినయమా? అన్నది మాత్రం తెలియట్లేదు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా‌ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఏ వల్లభ, కె. ఎస్ రామారావులు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని జనవరి 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా  ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'ఫిబ్రవరి 14' తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇల్లందులో బొగ్గు గనిలో పనిచేసే శీనుకి.. ఫ్రాన్స్‌కి చెందిన గౌతమ్‌కి సంబంధం ఏంటి? నలుగురు అమ్మాయిలతో హీరో తన ప్రేమాయణం ఎలా కొనసాగిస్తాడు? నలుగురిలో చివరికి ఎవరిని వివాహం చేసుకుంటాడు? ఎవరితో జీవితాంతం ఉంటాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.