దక్షిణాది పర్యాటక ప్రాంతాలు (South Indian Tourist Destinations)
వేసవి సెలవులు (Summer Holiday) వచ్చాయంటే చాలు. రోజువారీ దినచర్యకి కాస్త విరామమిచ్చి.. స్నేహితులతో, కుటుంబసభ్యులతో లేదా ఒంటరిగానైనా ఏదైనా శీతల ప్రదేశాన్ని సందర్శించాలని అనిపిస్తుంది కదా. అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? అనే ప్రశ్నలు ఎదురవ్వడం సహజం. అటువంటి ప్రశ్నలకి సమాధానమే ఈ కథనం. వేసవి కాలంలో చేసే ప్రత్యేక విహార యాత్రల (Summer Holiday Tour) కోసం ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. మీరూ ఒకసారి చదివి.. మీకు నచ్చిన ప్రదేశానికి హాయిగా వెళ్ళిరండి.
* ఎర్కాడ్
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఉన్న ఈ పర్యాటక కేంద్రం.. గత కొన్ని సంవత్సరాలుగా పర్యాటకులని బాగా ఆకర్షిస్తోంది. ఈ ప్రదేశం సేలం జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ ప్రాంతంలో అడవులు, సరస్సులు ఉండడంతో “ఎర్కాడ్” అని పేరు వచ్చిందట. ఎరి అంటే తమిళంలో “సరస్సు” అని అర్థం. “కడు” అంటే అడవి అని అర్థం.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
ఇక ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే జిల్లా కేంద్రమైన సేలం నుండి వెళ్ళాల్సిందే. ఎర్కాడ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ – సేలం (32 కిలోమీటర్లు). కోయింబత్తూర్ నుండి 190 కిలోమీటర్లు, చెన్నై నుండి 356 & బెంగళూరు నుండి 230 కిలోమీటర్ల దూరంలో ఈ ఎర్కాడ్ ఉంది. ఈ ప్రాంతాన్ని ‘పేదల ఊటీగా’ కూడా పిలుస్తుంటారు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* శేర్వరోయన్ గుడి, జపనీస్ పార్క్, పగోడా పాయింట్, ది గ్రెన్జ్, అన్నా పార్క్ & వైట్ ఎలిఫెంట్ టూత్ రాక్.
* ఎర్కాడ్ సరస్సులో బోటు షికారు
* టీ ఎస్టేట్స్
* నంది హిల్స్
బెంగుళూరు వంటి అత్యంత రద్దీ ప్రాంతానికి వెళ్లి.. అక్కడ కాస్త సేదతీరాలంటే.. ఆ నగరం నుండి కేవలం 61 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది హిల్స్‌కి వెళ్లాల్సిందే. చిక్కబల్లాపూర్ జిల్లా కేంద్రం నుండి 9 కి.మి దూరంలో ఉంది ఈ ప్రదేశం. ఇక ఈ ప్రదేశానికి నంది హిల్స్ అనే పేరు రావడానికి పలు కారణాలు ఉన్నాయట.
అందులో ప్రధానమైనది ఏంటంటే – ఈ కొండల ఆకారం నిద్రిస్తున్న నంది రూపంలో కనిపిస్తుందట. కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందంటారు. అదే సమయంలో టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతాన్ని పరిపాలించే సమయంలో.. ఇక్కడ నందిదుర్గ అనే కోటని నిర్మించారని సమాచారం. దాని వల్ల కూడా ఈ ప్రదేశానికి “నంది హిల్స్” అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
జిల్లా కేంద్రమైన చిక్కబళ్లాపూర్ నుండి నంది హిల్స్‌కు బస్సు సదుపాయం ఉంది. అదే సమయంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉండడంతో.. నేరుగా విమానాశ్రయం నుండే రవాణా సదుపాయం ఉంది. వీటితో పాటే బెంగుళూరు నగరం నుండి కూడా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సౌకర్యాలు మీకు విరివిగా దొరుకుతాయి.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* టిప్పూస్ డ్రాప్
* అమృత సరోవర్
* నంది గుడి
* యోగ నందీశ్వర దేవాలయం
* ఊటీ
నీలగిరి పర్వతాలలో ‘క్వీన్ అఫ్ ది హిల్స్’గా పిలవబడే ఉదగమండలం అలియాస్ ఊటీ గురించి తెలియనివారు ఉండరు. అలాగే ఊటీని సందర్శించిన వారు ఎప్పటికి ఆ జ్ఞాపకాలని మరిచిపోరు అని చెప్పాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో బ్రిటిష్ వారి పాత్ర ఎంతో ఉందని కూడా చెప్పాలి.
దానికి కారణమేంటంటే – వారు 18వ శతాబ్దంలో తొలిసారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు, ఇక్కడి చల్లటి వాతావరణానికి మంత్రముగ్ధులై ఇక్కడ తాము నివసించేందుకు అన్ని ఏర్పాట్లని చేసుకున్నారు. కనుక ఇక్కడ వారి సంస్కృతి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఊటీ – కూనూర్ ప్రాంతాల మధ్యలో ఉండే వెల్లింగ్టన్ బ్రిటీష్ సైన్యానికి స్థావరంగా ఉండేది. ఆ తరువాత కాలంలో అది మద్రాస్ రెజిమెంట్ కేంద్రంగా భారత సైన్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
ఊటీకి రోడ్డు మార్గం ద్వారా అయితే – కోయంబత్తూర్, మైసూర్, బెంగళూరు నుండి వెళ్లచ్చు. దగ్గరగా ఉండే ప్రాంతం మాత్రం కోయంబత్తూర్ (85 కిలోమీటర్లు). ఇక రైలు మార్గంలో చేరుకోవాలంటే మాత్రం.. మెట్టుపాల్యం వరకు దాదాపు అన్ని ప్రధాన నగరాల నుండి రైలు సదుపాయం ఉంది. ఇక ఆ స్టేషన్ నుండి మాత్రం ఉదగమండలం స్టేషన్‌కి వెళ్ళాలంటే ప్రత్యేకమైన మీటర్ గేజ్ పైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది కొండల మధ్య ప్రయాణం చేస్తూ ఊటీ చేరుకుంటుంది. ఈ ప్రయాణం కోసం చాలామంది ముందుగానే రిజర్వేషన్స్ చేసుకుంటారు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* ఊటీ సరస్సు
* బొటానికల్ గార్డెన్
* రోజ్ పార్క్
* దొడ్డబెట పీక్
* కొడైకెనాల్
ఈ ప్రదేశాన్ని ‘ప్రిన్సెస్ అఫ్ హిల్ స్టేషన్స్’గా అభివర్ణిస్తుంటారు. దిండిగుల్ జిల్లాలో భాగంగా ఉన్న ఈ కొడైకెనాల్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక కొడై అంటే తమిళంలో అనేక అర్థాలు ఉన్నాయి. “అడవి బహుమతి”, “అడవి చివరిలో”, “లతల అడవి” & “వేసవికి అడవి” అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని కూడా బ్రిటిష్ వారే తమకి నివాసయోగమైన ప్రాంతమని గుర్తించి దీనిని అభివృధి చేయడం జరిగింది. ఇక ఈ కొడైకెనాల్లో మానవ నిర్మిత సరస్సు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
ఈ ప్రదేశానికి అతి దగ్గరగా ఉన్న ఎయిర్ పోర్ట్ – మధురై (115 కిలోమీటర్లు). ఇక దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్ – పళని స్టేషన్ (64 కిలోమీటర్లు). ఇవే కాకుండా పళని, మదురై, డిండిగుల్ కొడైరోడ్ల నుండి బస్సు సదుపాయం ఉంది.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* కొడై సరస్సు
* కోకర్స్ వాక్
* సెయింట్ మేరీ చర్చ్
* గ్రీన్ వ్యాలీ వ్యూ
* గుణ గుహ
* పంపార్ జలపాతం
* మున్నార్
కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న ‘మున్నార్’ని.. ‘కశ్మీర్ అఫ్ సౌత్ ఇండియా’గా పేర్కొంటారు. ఇక ఈ మున్నార్ అనే పేరు రావడానికి కారణం మూడు నదులు – మధురపుజ్జ, నల్లతాన్ని& కుండలే. ఈ మూడు నదులు కలిసే చోటు కావడంతో దీనికి మున్నార్ అనే పేరు వచ్చింది. వేసవి కాలం అధిక ఉష్ణోగ్రతల నుండి సేదతీరేందుకు చక్కటి ప్రదేశం ఈ మున్నార్.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
ఇది కొచ్చి అంతర్జాతీయం విమానాశ్రయం నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోయంబత్తూర్, మదురై ఎయిర్ పోర్టుల నుండి దాదాపు 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రైల్వే లైన్ ప్రకారం చూస్తే, ఈ ప్రదేశానికి దగ్గరగా ఎర్నాకులం స్టేషన్ 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. రోడ్డు మార్గం ద్వారా కొచ్చి నుండి 130 కిలోమీటర్లు, ఎర్నాకులం నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* ఎరావికుళం నేషనల్ పార్క్
* అనముడి శిఖరం
* మట్టుపెట్టి
* పల్లివాసల్
* చిన్నకనల్
* అనయిరంగల్
* టాప్ స్టేషను
* కూర్గ్
కూర్గ్ – దీని అధికారిక పేరు మాత్రం కొడగు. ఇక దీనిని స్కాట్లాండ్ అఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. కారాన్తక రాష్ట్రంలో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్లాలంటే.. బెంగళూరు పట్టణం నుండి రోడ్డు మార్గంలో సుమారు 7 నుండి 8 గంటలు పడుతుంది. ఇక ఇక్కడ కూర్గ్‌ని చూడాలంటే మీ ప్రయాణం మడికేరి నుండే మొదలవుతుంది. అలా మొదలైన మీ ప్రయాణం ఎన్నో చూడచక్కని ప్రదేశాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో సాగుతుంది.
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే?
మైసూరు వరకు రైలులో వచ్చి ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. దాదాపు మైసూరు నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఈ కూర్గ్ ఉంది. ఇక విమానంలో చేరుకోవాలంటే – బెంగళూరు లేదా మైసూరు విమానాశ్రయం నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* మడికేరి ఫోర్ట్
* చెలవరా ఫాల్స్
* రాజాస్ సీట్
* నాగర్ హోల్ నేషనల్ పార్క్
* మండల్ పట్టి
* కూనూర్
మనం ఊటీ వెళితే కూనూర్ దాటి వెళ్లాల్సిందే. అలా ఊటీ & కూనూర్ పర్యాటకులకు డబల్ ప్యాకేజీ లాంటిది. ఇక ఊటీ & కూనూర్ మధ్య దూరం కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. కూనూర్ విషయానికి వస్తే, కూనూర్ మున్సిపాలిటీని రెండు భాగాలుగా విడదీయడం జరిగింది, అందులో ఒకటి అప్పర్ కూనూర్ & మరొకటి లోయర్ కూనూర్. ఈ ప్రాంతంలో కూడా మనం చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే?
రోడ్డు మార్గం ద్వారా అయితే – కోయంబత్తూర్, మైసూర్, బెంగళూరు నుండి వెళ్లచ్చు. దగ్గరగా ఉండే ప్రాంతం మాత్రం కోయంబత్తూర్ (65 కిలోమీటర్లు). ఇక రైలు మార్గంలో చేరుకోవాలంటే మాత్రం మెట్టుపాల్యం వరకు దాదాపు అన్ని ప్రధాన నగరాల నుండి రైలు సదుపాయం ఉంది, ఇక ఆ స్టేషన్ నుండి మాత్రం కూనూర్ స్టేషన్‌కి వెళ్ళాలంటే ప్రత్యేకమైన మీటర్ గేజ్ పైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది కొండల మధ్య ప్రయాణం చేస్తూ ఊటీ చేరుకుంటుంది. ఈ ప్రయాణం కోసం చాలామంది ముందుగానే రిజర్వేషన్స్ చేసుకుంటారు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* సిమ్స్ పార్క్
* డాల్ఫీన్ నోస్
* లాంబ్ రాక్
* తెక్కడి
మీరు ప్రకృతి సోయగాన్ని అతిదగ్గరగా ఆస్వాదించాలంటే వెళ్ళాల్సిన ప్రదేశం – తెక్కడి. ఇది కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ప్రదేశం తమిళనాడు-కేరళ సరిహద్దులో ఉంది. దీనితో ఇరు రాష్ట్రాల నుండి.. అదే విధంగా అన్ని చోట్ల నుండి పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.
Thekkady
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే?
కొచ్చి విమానాశ్రయం నుండి దాదాపు 145 కిలోమీటర్ల దూరంలో తెక్కడి ఉండగా.. మధురై సిటీ నుండి సుమారుగా 140 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. ఇక రైలు మార్గం ద్వారా దీనిని చేరుకోవాలంటే.. కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి సుమారు 114 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి-
* పెరియార్ వైల్డ్ లైఫ్ స్యాంచురి
* గ్రీన్ పార్క్
* కడతవందన్ కలరి కేంద్రం
* తెక్కడి కథాకళి నృత్య కేంద్రం
ఇవి దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా వేసవి విడిదిగా వెళ్ళదగిన ప్రదేశాలు & వాటి వివరాలు.
రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!
ఉత్తరాది పర్యాటక కేంద్రాలు (North Indian Tourist Destinations)
* సిమ్లా
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరమే కాకుండా.. మన దేశంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటి సిమ్లా. ఈ ప్రదేశానికి సిమ్లా అని పేరు పెట్టడానికి కారణం – కాళికా దేవి ప్రతిరూపమైన శ్యామలా దేవిని కొలిచే భక్తులు ఎక్కువగా ఈ ప్రదేశానికి రావడమే.
Shimla
ఇక సిమ్లాకి ఎలా చేరుకోవాలంటే?
సిమ్లా పట్టణానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో జుబ్బారాట్టి విమానాశ్రయం ఉంది, అక్కడికి ఢిల్లీ నుండి దాదాపు రోజు విమాన సర్వీసులు ఉంటాయి. అలాగే సిమ్లాకి దగ్గరలో ఉన్న మరో విమానాశ్రయం చండీగఢ్. దాదాపు 116 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.
రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవడానికి.. ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా చక్కటి రోడ్డు మార్గం ఉంది. ఇక ఈ సిమ్లా కి దగ్గరగా ఉన్న పట్టణం – కల్క. ఇది 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైలు మార్గం విషయానికి వస్తే, కల్కలో ఉన్న రైల్వే స్టేషన్.. ఇక్కడికి దాదాపు 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ ఉంది న్యారో గేజ్ ట్రాక్ కావడంతో.. ఆ ప్రయాణ మార్గం గిన్నిస్ బుక్ అఫ్ రికార్డుల్లోకి కూడా ఎక్కిందట.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* లక్కర్ బజార్
* టాయ్ ట్రెయిన్ రైడ్
* తారాదేవి టెంపుల్
* మాల్ రోడ్
* వైస్ రీగల్ లాడ్జ్
* కశ్మీర్
ఉత్తరాదిలో మన దేశానికి వేసవి కాలపు రాజధానిగా కశ్మీర్ ఎన్నో ఏళ్ళుగా ఉంటూ వస్తోంది. ఇక ఈ కశ్మీర్‌ని మనం మూడింటి సమాహారంగా చూడవచ్చు. అవేంటంటే – గుల్మార్గ్, శ్రీనగర్ & పహాల్గమ్. ఈ మూడింటిని కూడా భూతాలలోక స్వర్గాలుగా పలువురు చరిత్రకారులు పుస్తకాల్లో అభివర్ణించడం జరిగింది.
Kashmir
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే?
రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవడానికి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఇక శ్రీనగర్ విమానాశ్రయం నుండి కూడా ఈ ప్రదేశాలకి చేరుకోవడం చాలా సులువు. ఇదే సమయంలో జమ్మూ పట్టణం వరకు రైలు మార్గం ద్వారా చేరుకొని.. అక్కడి నుండి కూడా ఇక్కడికి రావొచ్చు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలు –
* హౌస్ బోట్స్ , సరస్సు పైన బోటు షికారు
* దాల్ సరస్సులో విహారం
* సోనామర్గ్
* గొండోలా రైడ్
* కేబుల్ కార్
* నైనిటాల్
కన్ను ఆకారంలో ఉండే నైని సరస్సుని మనం ఇక్కడ చూడచ్చు. అయితే ఈ పేరు రావడానికి వెనుక చాలా చరిత్ర ఉందని చెబుతుంటారు. స్థల పురాణం ప్రకారం శివుడి భార్య సతి ఎడమ కన్ను పడిన ఈ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడిందని అంటుంటారు. అదే కాకుండా ముగ్గురు ఋషులు తమ దాహాన్ని తీర్చుకునేందుకు సృష్టించిన సరస్సుగా దీనిని చెబుతారు. ఇక ఈ సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉంది.
Nainital
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే?
ఢిల్లీ నుండి దాదాపు 300 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే వాయుమార్గంలో అయితే, నైనిటాల్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న.. పంత్ నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా అయితే కత్గోదం రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ నైనిటాల్‌కి వెళ్లచ్చు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి & చేయవలసినవి –
* నైని సరస్సులో బోటు షికారు
* ట్రెక్కింగ్
* పంగోట్ & కిలబరి బర్డ్ స్యాంచురి
* మౌంట్ అబు
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్‌గా మౌంట్ అబుకి పేరుంది. అరవళి కొండల్లో, సిరోహి జిల్లాలో ఈ ప్రదేశం నెలకొంది. ఈ ప్రదేశానికి దగ్గరగా గుజరాత్ రాష్ట్ర సరిహద్దు కూడా ఉంది.. అంటే ఇది రాజస్థాన్ – గుజరాత్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం.
Mount Abu
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ?
మౌంట్ అబుకి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ – అబు రోడ్ రైల్వే స్టేషన్. ఇది సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక దీనికి దగ్గరలో ఉన్న విమాన సౌకర్యానికి వస్తే, ఉదయపూర్ విమానాశ్రయం నుండి ఇక్కడికి దాదాపు 207 కిలోమీటర్లు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి
* నక్కి సరస్సులో బోటు షికారు
* దెల్వరా గుడి
* సన్ సెట్ పాయింట్
* మహాబలేశ్వర్
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మహాబలేశ్వర్ ఒక చక్కటి ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఒక మున్సిపాలిటీనే మహాబలేశ్వర్. ఒకప్పుడు బ్రిటిష్ వారు.. ఈ మహాబలేశ్వర్ని బాంబే ప్రావిన్స్‌కి సంబంధించి వేసవి విడిదిగా వాడుకునేవారట. అలా ఎప్పటి నుండో ఈ ప్రదేశానికి మంచి పేరు ఉంది.
Mahabaleshwar
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
పూణె నగరం నుండి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో మహాబలేశ్వర్ ఉంది. అలాగే జిల్లా కేంద్రమైన సతారా నుండి 45 కిలోమీటర్లు మాత్రమే. పూణె, సతారా & ముంబై నుండి ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం ఉంది.
ఇక రైలు మార్గం విషయానికి వస్తే, సతారా స్టేషన్ లేదా పూణే స్టేషన్లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు.
విమాన మార్గానికి వస్తే, పూణె లేదా ముంబై విమానాశ్రయాల నుండి ఫ్లైట్ సౌకర్యం ఉంది.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి –
* ఆర్థర్ పాయింట్
* వెన్న సరస్సు
* 3 మంకీ పాయింట్
* ప్రతాప్ ఘడ్ ఫోర్ట్
* లింగమాల వాటర్ ఫాల్స్
* లడఖ్
దాదాపు మన దేశ సరిహద్దులో ఉన్న ప్రాంతం ఇది. అయితే బైక్ రైడర్స్‌ని ఎవరినైనా.. మీరు ఎక్కువగా ఏ ప్రాంతంలో డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు? అని అడిగితే వారు చెప్పే సమాధానం ‘లడఖ్’. ఎందుకంటే అక్కడి వాతావరణం, అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్ర ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక లడఖ్‌ని “ల్యాండ్ అఫ్ హై పాసెస్” అని కూడా అంటారు.
Ladakh
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే?
లడఖ్‌కి సమీపంలో ఉన్న లేహ్ ఎయిర్ పోర్ట్‌కి ప్రతిరోజు ఢిల్లీ నుండి విమాన సర్వీసు నడుస్తుంటుంది. అలాగే వారానికి రెండుసార్లు శ్రీనగర్ నుండి కూడా ఇక్కడికి విమానసర్వీసులు ఉంటాయి. రైలు మార్గం నుండి వెళ్లాలంటే.. ఈ ప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో జమ్ముతావి రైల్వే స్టేషన్ ఉంది. ఇక రోడ్డు మార్గంలో అయితే.. ఢిల్లీ నుండి లడఖ్‌కి దాదాపు 1300 కిలోమీటర్ల దూరం ఉండగా.. చాలామంది ఔత్సాహికులు మోటార్ సైకిల్స్ పై ఇక్కడికి ప్రయాణం చేస్తుంటారు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి & చేయవలసినవి –
* బైక్ పైన డ్రైవ్ చేయడం
* నుబ్రా వ్యాలీలో ఒంటె పై ప్రయాణం
* పంగాంగ్ సో లేక్
* డార్జిలింగ్
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేని యునెస్కో వారు.. ప్రపంచ వారసత్వ సంపద క్రింద గుర్తించారంటేనే ఇక్కడి గొప్పతనం ఏమిటో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడి ట్రెయిన్లో పర్యాటకులని ప్రకృతి అందాల నడుమ.. పర్వత శ్రేణుల గుండా తీసుకెళ్ళే ప్రయాణం ఎవ్వరు మర్చిపోలేరు. ఇక్కడి అందాలకి మంత్రముగ్ధులై ఎంతోమంది దర్శకులు తమ చిత్రాలని ఇక్కడ చిత్రీకరించడం జరిగింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉండే ఈ పర్యాటక కేంద్రానికి.. ప్రతి యేడాది వేసవి కాలంలో వచ్చే పర్యాటకుల సంఖ్య సుమారు అయిదు లక్షల పైమాటే అంటే అతిశయోక్తి కాదు. అంతటి ఆదరణ ఉన్న ప్రాంతం ఇది.
Darjeeling
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే?
డార్జిలింగ్కి 85 కిలోమీటర్ల దూరంలో బాగ్ డోగ్రా అనే ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే డార్జిలింగ్కి రైలు మార్గం కూడా కలదు. ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా నుండి.. దాదాపు 165 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకోగలం.
ఇక్కడ ప్రధానంగా చేయాల్సినవి & చూడవలసినవి –
* పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్
* కేబుల్ కార్
* బటాసియా లూప్
* డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
* మనాలి
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉన్న మనాలి అంటే తెలియనివారుండరు. దాదాపు ప్రతియేటా వేసవిలో పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యనే దీనికి నిదర్శనం అని చెప్పాలి. ఇక ఈ మనాలి ఉండే కులు వ్యాలీ ప్రాంతాన్ని.. వ్యాలీ అఫ్ గాడ్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి నుండి లెహ్‌కి రోడ్డు మార్గం కూడా ఉంది.
Manali
ఇక్కడికి ఎలా చేరుకోవాలి ?
మనాలికి 50 కిలోమీటర్ల దూరంలో భుంటర్ అనే ఎయిర్ పోర్ట్ ఉంది. ఇది కులుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయానికి ఢిల్లీ నుండి రోజు సర్వీసులు నడపడం విశేషం. ఇక రోడ్డు మార్గం విషయానికి వస్తే, ఢిల్లీ నుండి దాదాపు 550 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. అయితే నైట్ సర్వీస్ బస్సులు ఢిల్లీ నుండి ఇక్కడికి వస్తుంటాయి.
రైలు మార్గం అంటే – మనాలి నుండి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో చండీగఢ్ ఒక్కటే ఉంది.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి & చేయవలసినవి –
* సోలంగ్ వ్యాలీలో ప్యారా గ్లైడింగ్, ఖ్వాడ్ బైకింగ్
* రోహ్టంగ్ పాస్
* కులు
హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019..
ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు (World Tourist Destinations)
* పారోస్, గ్రీస్
పారోస్ అనే ఈ ద్వీపం గ్రీస్ దేశానికి పశ్చిమంగా ఉన్న ఏజియన్ ఐలాండ్స్‌లో ఒకటి. ఈ ఏజియన్ ఐలాండ్స్ గ్రీస్ దేశానికి పశ్చిమంగా.. టర్కీ దేశానికి తూర్పు దిశగా ఉన్నాయి. అయితే ఈ ఏజియన్ ఐలాండ్స్‌లో కూడా.. దాదాపు ఏడు గ్రూపులుగా ద్వీపాలని విభజించారు. అందులో సైక్లేడ్స్ గ్రూప్‌లో ఉన్నదే ఈ పారోస్ ద్వీపం. ఈ ద్వీపంలో పరికియా అనే పట్టణం రాజధానిగా ప్రధాన పోర్టు ఉంది. అయితే ఇవి ద్వీపాలు అయినప్పటికి… గ్రీస్ దేశం ఆధీనంలోనే ఉంటాయట.
Paros
ఇక ఈ ద్వీపాలకు.. అందులోనూ ఈ పారొస్ ద్వీపానికి పర్యాటకులు ప్రధానంగా ఏప్రిల్, మే & జూన్ నెలల్లో వస్తుంటారు.
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి & చేయవలసినవి –
* ఆర్కియలాజికల్ మ్యూజియం
* వ్యాలీ అఫ్ బట్టర్ ఫ్లయ్స్
* గోల్డెన్ బీచ్
* హార్స్ రైడింగ్
* క్యాంప్ ఫైర్
* బాలి, ఇండోనేషియా
ఇండోనేషియా దేశం అధీనంలో ఉన్న ద్వీపాలలో ఒకటి బాలి. అయితే ఈ దేశం మొత్తంలో పర్యాటకంగా అందరిని ఆకర్షించే ద్వీపంగా బాలి ప్రసిద్ధికెక్కింది. దాదాపు 1970 నుండి ఈ ద్వీపానికి పర్యాటకుల రాక పెరిగింది. ఇక ప్రస్తుతమైతే ఇక్కడికి దేశవిదేశాల నుండి ఎంతో మంది పర్యాటకులు నిత్యం వస్తూనే ఉంటారు. కొత్తగా పెళ్ళైన వారు హనీమూన్ నిమిత్తం ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.
Kuta Beach Bali
ఇక్కడ ప్రధానంగా చూడవలసిన & చేయవలసినవి –
* తనాః లాట్ టెంపుల్ నుండి సూర్యాస్తమయం చూడటం
* బాలి సఫారీ
* మెరైన్ పార్క్
* కుట బీచ్
* గిట్గిట్ వాటర్ ఫాల్
* మారిషస్
హిందు మహా సముద్రంలో ఉన్న ఒక ద్వీపం మారిషస్. వేసవి కాలంలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం విశేషం. అందుకనే ఇక్కడికి మే నెల తరువాత చాలా మంది విహార యాత్రకి వస్తుంటారు. దాదాపు 12 లక్షల మంది జనాభా కలిగిన ఈ దేశానికి టూరిజం ద్వారా ఆదాయం బాగానే ఉంటుంది. ఈ దేశానికి చేరుకోవడానికి ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉంది. త్వరలోనే మరో ఎయిర్ పోర్ట్‌ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
Mauritius
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి & చేయవలసినవి –
* ఆప్రవసీ ఘాట్ & లీ మోర్న్ కల్చరల్ ల్యాండ్ స్కెప్
* అండర్ సీ వాకింగ్
* క్రొకోడైల్స్ & టోర్టోయిస్ పార్క్
* హైకింగ్
* కో సముయ్, థాయిలాండ్
థాయిలాండ్ దేశం అధీనంలో ఉన్న ద్వీపాలలో కో సముయ్ ఒకటి. ఇక థాయిలాండ్ అధీనంలో ఉన్న ద్వీపాలలో రెండవ అతిపెద్ద ద్వీపం ఈ కో సముయ్. ఫుకెట్ ఐలాండ్స్ తరువాత విస్తీర్ణంలో ఉన్న ద్వీపం ఇదే కావడం విశేషం. ఇక ఈ ద్వీపాన్ని ఫుకెట్ ఐలాండ్స్‌లో పెరిగిన పర్యాటకుల రద్దీ కారణంగా చాలామంది ఎంచుకుంటున్నారు. ఈ ద్వీపంలో ఎయిర్ పోర్ట్ వసతి ఉండడం కూడా దీనికి ప్రాచుర్యం దక్కడానికి ఒక కారణం.
Ko Samui Full Moon Party
ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి & చేయవలసినవి –
* బఫెల్లో ఫైటింగ్ ఫెస్టివల్
* కో సముయ్ మిడ్ నైట్ రన్
* బోఫట్ బీచ్
* టైగర్ జూ
* స్కూబా డైవింగ్
* ఫుల్ మూన్ పార్టీ
* హ్యాంబర్గ్, జర్మనీ
గేట్ వే టు ది వరల్డ్‌గా కూడా హ్యాంబర్గ్కి మరో పేరుంది. కారణం ఈ నగరానికి ఉన్న సీ పోర్ట్. అలాగే జర్మనీలో ఈ నగరానికి మంచి పర్యాటక కేంద్రం అని కూడా పేరుంది. ఈ నగరంలో ఎక్కువగా మ్యూజిక్ కాన్సర్ట్స్ & థియేటర్ ప్లేలు జరుగుతుంటాయి. వీటిని చూడడానికి ఎంతోమంది ఈ నగరానికి వస్తుంటారు.
Hamburg Port Germany
ఇక ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి & చేయవలసినవి –
* హెయిడి పార్క్
* మైసన్ సునీవ్లో షాపింగ్
* లోకల్ డిషెస్‌ని రుచి చూడడం
* రిక్ మర్ రిక్ మర్స్
* అట్లీస్ మ్యాడ్చెన్ బ్రూ హౌస్
* కొలంబో, శ్రీలంక
మన దేశానికి దక్షిణాన దాదాపు మన సంస్కృతిని సింహభాగం పోలి ఉన్న దేశం శ్రీలంక. ఇక ఈ దేశం కూడా వేసవి కాలంలో పర్యాటకులని ఎక్కువగా ఆకర్షించే దేశంగా గుర్తింపు పొందింది. అలాగే ఈ దేశంలో పర్యటిస్తే అయ్యే ఖర్చుకి.. మన దేశంలో పర్యటిస్తే అయ్యే ఖర్చుకి పెద్దగా తేడా ఉండదు. శ్రీలంక రాజధాని కొలంబో నగరంలో మనం తప్పక సందర్శించాల్సినది ఒకటి ఉంది, అదే – నేషనల్ మ్యూజియం అఫ్ కొలంబో.
Gangaramayya Temple
ఇక ప్రధానంగా మనం చూడాల్సినవి & చేయాల్సినవి –
* ఇండిపెండెన్స్ మెమోరియల్ హాల్
* గంగరామయ్య గుడి
* లోకల్ వంటకాలు
* బీరా సరస్సు
ఈ పైన పేర్కొన్న సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మేం వేసవి పర్యాటక కేంద్రాలుగా (Summer Tourist Destinations) భావిస్తున్నఈ ప్రదేశాలు మాత్రమే కాకుండా.. ఇంకే వేరేవాటిని కూడా మీరు పైన జాబితాలో చేర్చవచ్చు. అందుకోసం.. మీ అభిప్రాయాలని క్రింద కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి.
నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌కి.. సై అంటున్న టాలీవుడ్ లక్కీ హీరో ఎవరు?