చర్మ సంరక్షణ విషయానికొస్తే మనలో చాలామంది జాగ్రత్తగానే ఉంటారు. చర్మం (Skin) ఆరోగ్యం కోసం రోజూ నాణ్యమైన సబ్బుతో స్నానం చేయడంతో పాటు.. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి తప్పనిసరిగా పాటించే పద్ధతులుగా మారిపోతాయి. అయితే రోజూ ఇలా ఎంత చేసినా అప్పుడప్పుడూ మరికొంత కేర్ తీసుకుంటే కానీ చర్మం అట్రాక్టివ్ గా కనిపించదు. అందుకే అప్పుడప్పుడైనా సరే.. చర్మాన్ని స్క్రబ్ చేస్తూ ఉండాలి. దీని కోసం మార్కెట్లో లభించే బాడీ స్క్రబ్స్ (Body scrubs) కంటే ఇంట్లో తయారుచేసుకొనే స్క్రబ్స్ మంచి ఫలితాన్ని అందిస్తాయి. అందుకే ఇంట్లోనే బాడీ స్క్రబ్స్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం రండి..
Table of Contents
Shutterstock
బాడీస్క్రబ్స్ వల్ల ప్రయోజనాలు (Benefits Of Homemade Body Scrubs)
1. బాడీస్క్రబ్స్ ని మార్కెట్లో కొనడం కంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో, సహజమైన ఉత్పత్తులతో చేసిన స్క్రబ్ ని ఉపయోగించే వీలుంటుంది.
2. ఇంట్లో తయారుచేసే బాడీ స్క్రబ్స్ మ్రుత కణాలను తొలగించడంతో పాటు చర్మాన్ని మచ్చ లేకుండా మెరిసేలా తయారుచేస్తుంది.
3. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేసి, చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది కాబట్టి చర్మం మృదువుగా, మెత్తగా, యవ్వన కాంతితో కనిపిస్తుంది.
4. చర్మ రంధ్రాలు కూడా శుభ్రపడతాయి కాబట్టి మొటిమలు, మచ్చల సమస్య కూడా తగ్గుతుంది.
5. ఈ బాడీ స్క్రబ్స్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అన్ని రకాల చర్మతత్వాలకు ఇవి సరిపోతాయి.
6. చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలను కూడా తొలగించి చర్మం సాగిపోకుండా కాపాడుతుంది.
బాడీ స్క్రబ్ ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా.. వీటిని వివిధ రకాల పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అలా బాడీ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
ఇంట్లోనే బాడీ స్క్రబ్ ఇలా ( Homemade Body Scrubs In Telugu)
ఇంట్లో సాధారణంగా మన వంట గదిలో ఎక్కువగా కనిపించే పదార్థాలతోనే బాడీ స్క్రబ్ లను తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే..
Shutterstock
1. కాఫీ, చక్కెర (Coffee and Sugar)
కాఫీ మంచి స్క్రబ్ గా పనిచేస్తుంది. చర్మానికి ఏమాత్రం హాని కలిగించకుండా స్క్రబ్ చేస్తుంది. ఇందులోని కెఫీన్ మన చర్మానికి యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తుంది. దీని కోసం చేయాల్సిందల్లా పావు కప్పు కాఫీ పొడి, పావు కప్పు చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, మూడు విటమిన్ – ఈ క్యాప్స్యూల్స్ వేసి బాగా కలుపుకోవాలి.
మరీ వదులుగా కాకుండా కాస్త గట్టి మిశ్రమంగా కలుపుకొని దాన్ని వేళ్లతో ఒళ్లంతా రుద్దుకోవాలి. గుండ్రంగా మసాజ్ చేసుకుంటూ ఐదు నుంచి పది నిమిషాలు శరీరాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయాలి. ప్రతి భాగానికి కనీసం ఒకటి నుంచి రెండు నిమిషాల సమయం కేటాయించాలి. ఆ తర్వాత మైల్డ్ బాడీ వాష్ ఉపయోగించి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. దీన్ని వారానికి రెండు మూడు సార్లు చేస్తే చాలు.. చర్మం అందంగా తయారవుతుంది.
2. రాతి ఉప్పు (Stone Salt)
రాతి ఉప్పు లేదా సముద్రపు ఉప్పులో ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి. ఇవి మన చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త ప్రసరణను పెంచుతాయి. దీని కోసం కప్పు రాతి ఉప్పు, అర కప్పు ఆలివ్ నూనె, పది నుంచి పదిహేను చుక్కలు ఎస్సెన్షియల్ ఆయిల్ వేసి రఫ్ గా ఉండే మిశ్రమంగా కలుపుకోవాలి. దీన్ని చర్మంపై అప్లై చేసుకొని గుండ్రగా మసాజ్ చేస్తూ పావు గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. మీది పొడి చర్మం అయితే వారానికోసారి, జిడ్డు చర్మం అయితే వారానికి మూడు సార్లు ఇలా స్క్రబ్ చేసుకోవాలి.
Shutterstock
3. ఎప్సమ్ సాల్ట్ (Epsom Salt)
ఎప్సమ్ సాల్ట్ రఫ్ గా ఉండే చర్మాన్ని మృదువుగా మార్చడానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుంది. కండరాలకు విశ్రాంతినిస్తుంది. దీన్ని పొడి చర్మం ఉన్నవారు వారానికోసారి, సాధారణ చర్మం ఉన్నవారు వారానికి రెండుసార్లు, జిడ్డు చర్మం ఉన్నవారు వారానికి మూడుసార్లు స్క్రబ్ గా ఉపయోగించాలి. దీని కోసం కప్పు ఎప్సమ్ సాల్ట్, రెండు చుక్కల ఎస్సెన్షియల్ ఆయిల్, మూడు చుక్కల జొజొబా ఆయిల్ వేసి కలుపుకోవాలి. వీటిని బరకగా ఉండే పేస్ట్ లా చేసుకొని దాన్ని చర్మానికి అప్లై చేసుకోవాలి. మృదువుగా, గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ప్రతి భాగానికి కనీసం రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
4. ఓట్ మీల్ (Oatmeal)
ఈ స్క్రబ్ చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. దీని కోసం రెండు నుంచి మూడు టీస్పూన్ల కొబ్బరి నూనెలో అరకప్పు బ్రౌన్ షుగర్ లేదా చక్కెర కలుపుకోవాలి. అందులో అర కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ నూనెలో కాస్త నానేవరకూ ఉంచి ఆ తర్వాత ఈ స్క్రబ్ ని ఒంటికి అప్లై చేసుకోవాలి. ప్రతి భాగానికి బాగా రుద్దుకోవాలి. మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లు ఇందులో కొబ్బరి నూనె బదులు సన్ ఫ్లవర్ నూనె రాసుకోవచ్చు.
5. పెరుగు (Curd)
పెరుగు చాలా మెత్తగా ఉంటుంది. దీంతో స్క్రబ్ ఏంటనే డౌట్ మనందరికీ రావచ్చు. కానీ దీన్ని స్క్రబ్ లో భాగంగా ఉపయోగించడం వల్ల చర్మానికి తేమ బాగా అందుతుంది. ఈ స్క్రబ్ డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఉపయోగించడం వల్ల చర్మానికి ఇది స్క్రబ్ లాగే కాకుండా క్లెన్సర్ గానూ ఉపయోగపడుతుంది. మృత కణాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే దీన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించవచ్చు. దీన్ని తయారుచేసేందుకు టేబుల్ స్పూన్ పెరుగు, పావు కప్పు ఆలివ్ ఆయిల్, టీస్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరమంతా పూసి ప్రతి భాగానికి కనీసం రెండు నిమిషాలు కేటాయించి స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచి షవర్ జెల్ సాయంతో స్నానం చేయాలి.
Shutterstock
6. నిమ్మకాయ, చక్కెర (Lemon and Sugar)
నిమ్మకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. ఇది మంచి ఎక్స్ ఫోలియేటర్ గా కూడా పనిచేస్తుంది. చర్మం పీహెచ్ ని కూడా బ్యాలన్స్ చేసి మృదువుగా మారేలా చేస్తుంది. దీని కోసం రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, టేబుల్ స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని ఈ రెండింటితో కలిపి దాన్ని వేళ్ల సాయంతో శరీరం మొత్తం రుద్దుకుంటూ మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
7. పసుపుతో (Organic Turmeric)
పసుపు మంచి యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. అందుకే స్క్రబ్ కోసం ఆర్గానిక్ పసుపును ఉపయోగించాలి. ఇది మంచి యాంటీ సెప్టిక్ ఏజెంట్ కూడా. పసుపును బాడీ స్క్రబ్ గా ఉపయోగించడం కోసం కప్పు చక్కెర, రెండు టీస్పూన్ల పసుపు, రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని మూడింటినీ బాగా కలపాలి. దీన్ని శరీరం మొత్తం పూసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. అలా శరీరం మొత్తం ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
8. మట్టి, పాలు (Clay and Milk)
మీకు ముఖంపై, వీపుపై మొటిమలు ఎక్కువగా వస్తుంటే ఈ స్క్రబ్ మీకు చాలా స్వాంతననిస్తుంది. దీనిలో ఉపయోగించే పాలు మన శరీరానికి మంచి మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగపడుతుంది. దీని కోసం కప్పు బెటోనైట్ క్లే, అరకప్పు బాదం పప్పుల పొడి, కప్పు పాలు, తగినంత బాదం నూనె తీసుకోవాలి. మిగిలిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో తీసుకొని కొద్దికొద్దిగా పాలు కలుపుకుంటూ దానిని చిక్కటి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని చర్మానికి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది.
Shutterstock
9. గ్రీన్ టీతో (Green Tea)
గ్రీన్ టీ మంచి ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేస్తుంది. అంతే కాదు.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలకు పోషణను అందించి చర్మం మెరిసేలా చేస్తాయి. దీని కోసం ఒక గ్రీన్ టీ బ్యాగ్, టేబుల్ స్పూన్ చక్కెర, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, అర టేబుల్ స్పూన్ తేనె తీసుకొని అన్నింటినీ కలపాలి. వీటిని స్నానానికి ముందు శరీరానికి పూసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. అలా పది నిమిషాలు మసాజ్ చేసుకొని స్నానం చేస్తే సరిపోతుంది. దీన్ని కావాలంటే ఎయిర్ టైట్ కంటెయినర్ లో పెట్టుకొని భద్రపర్చుకోవచ్చు.
10. చక్కెర, కొబ్బరినూనె (Sugar and Coconut Oil)
ఇది చాలామంచి ఎక్స్ ఫోలియేటర్. ముఖ్యంగా మేకప్ తొలగించిన తర్వాత దీన్ని ఉపయోగించడం వల్ల ఏవైనా మేకప్ ఉత్పత్తుల అవశేషాలు మిగిలి ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఇది బడ్జెట్ లో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే స్క్రబ్. అంతేకాదు.. ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని కనీసం వారానికి రెండు నుంచి మూడు సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని అప్లై చేయడానికి ముందు ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి. మేకప్ వేసుకున్న భాగాలన్నింటినీ ఫేస్ లేదా బాడీ వాష్ సాయంతో శుభ్రం చేసుకొని తర్వాత దీన్ని అప్లై చేసుకొని మృదువుగా గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
నలుగుపిండిని కూడా వాడొచ్చు (Ubtan For Skin – Body Scrub)
నలుగుపిండిని కూడా మన శరీరానికి మంచి స్క్రబ్ గా ఉపయోగించవచ్చు. దీన్ని రోజూ స్నానం చేసేటప్పుడు శరీరానికి రుద్దుకోవడం వల్ల చర్మంపై మృత కణాలు తొలగిపోవడంతో పాటు చర్మం సున్నితంగా కూడా మారుతుంది. ఇవే కాదు.. నలుగుపిండి వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..
1. ట్యాన్ బారిన పడిన చర్మాన్ని తిరిగి మామూలుగా చేసి ట్యాన్ ని తొలగించడంలో నలుగుపిండిది చాలా ముఖ్యపాత్ర.
2. నలుగుపిండిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై బ్యాక్టీరియాను తొలగించి చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది.
3. అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది. ముడతలు రావడాన్ని ఆలస్యం చేస్తుంది.
నలుగుపిండి వల్ల ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు వివిధ రకాలుగా నలుగుపిండిని తయారుచేయడం ఎలా? అన్న విషయం తెలుసుకుందాం.
Shutterstock
శెనగ పిండితో (Sesame Flour Ubtan)
శెనగపిండి చర్మాన్ని కాంతిమంతం చేయడంలో బాగా తోడ్పడుతుంది. దీని కోసం టేబుల్ స్పూన్ గోధుమ పిండి, టేబుల్ స్పూన్ శెనగ పిండి, టేబుల్ స్పూన్ చందనం, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ తీసుకొని మిశ్రమంగా కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా ఉంటే మరికొంత రోజ్ వాటర్ లేదా పాలు పోసి కొంచెం పలుచన చేసుకోవచ్చు. ఇది మరీ వదులుగా, మరీ గట్టిగా లేకుండా ఉండాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రుద్దుకొని స్నానం చేసి.. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు మాత్రం రోజ్ వాటర్ కి బదులుగా పాలు ఉపయోగించాలి.
తులసి పొడితో (Basil Powder Ubtan)
తులసి మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీనితో పాటు నువ్వుల నూనె, పాలు వంటి పదార్థాలన్నీ మన చర్మానికి మేలు చేసేవే.. దీని కోసం చేయాల్సిందల్లా.. 6 నుంచి 7 బాదం పప్పులు, తాజా పాలు, టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి, మూడు టేబుల్ స్పూన్ల శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, అర టీస్పూన్ పసుపు తీసుకొని బరకగా కలుపుకోవాలి. దీనికి ముందు నలుగు పిండి చేయాలనుకునే రోజు ముందు బాదం గింజలను పాలల్లో నానబెట్టాలి. ఉదయం బాదం గింజల పై తొక్కలను తొలగించి దీనికి నువ్వుల నూనె, తులసి పొడి, ఇతర పదార్థాలు వేసి బరకగా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒంటికి పూసుకొని మసాజ్ చేసుకుంటూ కాసేపు అలాగే ఉండి స్నానం చేసేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకూ ఉంటుంది.
Shutterstock
బాదం, పిస్తాలతో (Almonds and Pistachios Ubtan)
ఆరోగ్యకరమైన శరీరానికి బాదం పప్పులు తినడం ఎంత అవసరమో.. అందమైన చర్మానికి బాదం పప్పులతో పాటు ఇతర నట్స్ ని శరీరానికి అప్లై చేయడం అంతే ముఖ్యం. ఇది మెరిసే చర్మానికి అద్బుతమైన నలుగుపిండి. దీని కోసం అర టేబుల్ స్పూన్ చొప్పున బాదం, పిస్తా, జీడి పప్పుల పొడిని బరకగా చేసి కలుపుకోవాలి. ఇందులో ఎర్ర పప్పు పొడి, నారింజ తొక్కల పొడి, అవిసె గింజల పొడి కూడా అర టేబుల్ స్పూన్ చొప్పున కలుపుకోవాలి. కావాలంటే కాస్త కుంకుమ పువ్వు వేసుకొని ఇందులో పాలు పోసుకొని కలుపుకోవాలి. స్నానానికి ముందు ఈ ప్యాక్ ని శరీరం మొత్తం పట్టించి మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
తరచూ అడిగే సందేహాలకు సమాధానాలు (FAQs)
1. బాడీస్క్రబ్స్ మన శరీరానికి మంచివేనా?
శరీరాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అందమైన చర్మం అంత సులువుగా రాదు. దాని కోసం క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి రోజూ చేయడంతో పాటు అప్పుడప్పుడూ స్క్రబ్స్ ఉపయోగించడం వల్ల చర్మ ఛాయ కూడా అందంగా మారుతుంది. చర్మం తేమతో అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
2. శరీరానికి ఏమాత్రం నష్టం జరగకుండా బాడీ స్క్రబ్స్ ఎలా ఉపయోగించాలి?
బాడీస్క్రబ్స్ ఉపయోగించడం వల్ల శరీరం పై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అయితే వీటిని ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చర్మంపై గీతలు, సన్నని ముడతలు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చక్కెర, ఉప్పు వంటి బరక వస్తువులతో స్క్రబ్ చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు కాకుండా ఒక పద్ధతి ప్రకారం సున్నితంగా మసాజ్ చేయాలి. దీని ద్వారా చర్మానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
Shutterstock
3. బాడీస్క్రబ్స్ ని రోజూ ఉపయోగించవచ్చా?
బాడీస్క్రబ్స్ ని రోజూ ఉపయోగించవచ్చా? లేదా? అన్నది మనం స్క్రబ్ లో ఉపయోగించే వస్తువులపై ఆధారపడి ఉంటుంది. వాక్స్, పిండి, నూనె, పెరుగు వంటి వస్తువులతో తయారుచేసే బాడీస్క్రబ్ లను రోజూ ఉపయోగించవచ్చు. వీటిలో స్క్రబ్ చేసే ఏజెంట్లు చాలా మృదువుగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎలాంటి నష్టాన్ని కలిగించవు. కాబట్టి వీటిని రోజూ ఉపయోగించవచ్చు. అయితే చక్కెర, ఉప్పు, సోడా వంటివాటితో చేసే స్క్రబ్ లను మాత్రం రోజూ ఉపయోగించకూడదు.
4. ఈ బాడీస్క్రబ్స్ వల్ల వల్ల మనకు ఏవైనా దుష్ప్రభావాలుంటాయా?
ఇంట్లో తయారుచేసిన బాడీస్క్రబ్స్ ని సరిగ్గా ఉపయోగిస్తే పెద్దగా దుష్ప్రభావాలేమీ ఉండవు. అయితే వీటిని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల చాలా నష్టాలుంటాయి. సున్నితంగా స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. కానీ మరీ ఎక్కువగా లేదా గట్టిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ఉన్న ఆరోగ్యకరమైన చర్మ కణాలు కూడా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల చర్మానికి రక్షణ కవచం దెబ్బతిని మొటిమలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
ఇవి కూడా చదవండి.
ట్యాన్‌తో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో దాన్ని ఇట్టే దూరం చేసుకోవచ్చు..!