(Recipe of Famous Srikakulam Sweet – Utanki)
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మిఠాయిలకు, పిండి వంటల తయారీకి కొదువలేదు. ప్రతీ ప్రాంతంలో ఏదో ఒక తినుబండారం ప్రజల ఆదరణను పొందుతూనే ఉంది. అలాంటి కొన్ని అద్భుతమైన వంటలు కూడా.. అతితక్కువ ప్రచారంలో ఉన్న కారణంగా అందరికీ తెలిసే అవకాశం లేక మరుగునపడిపోతున్నాయి. అలాంటి ఓ స్వీట్ గురించి.. ఇప్పుడు మనం తెలుసుకుందాం
శీతాకాలం స్పెషల్ వంటకం.. సీతాఫల్ ఖీర్ తయారీ మీకు తెలుసా?
“ఉటంకి” పేరు ఎప్పుడైనా విన్నారా..? ఈ స్వీట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ స్వీట్ రుచి చూడాలంటే శ్రీకాకుళం వరకు వెళ్ళాలా.. అని ఆలోచిస్తున్నారా? ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్ పెడుతూ.. మీకోసం ఆ ఉటంకి తయారీ విధానాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నాం.
అయితే ఈ ఉటంకి స్వీట్ కేవలం శ్రీకాకుళం జిల్లాలోని కొందరికే ఎందుకు పరిమితమైంది? అనే అంశం మీద భిన్న వాదనలు ఉన్నాయి. దానికి కారణం మిశ్రమాన్ని తయారుచేసి పెట్టుకున్న తరువాత.. దానిని నూనెలో ఫ్రై చేసుకునే పద్ధతి కాస్త వైవిధ్యంగా ఉండడమే.
ఉటంకి తయారీ పద్ధతి
కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 5 కప్పులు
చక్కెర – 2 కప్పులు (మీరు తీపి ఎక్కువగా ఉండాలని అనుకుంటే, ఇంకొక కప్పు వేసుకోవచ్చు)
పాలు – 2 కప్పులు
నూనె – ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత…
తయారీ విధానం
ముందుగా మనం ఈ స్వీట్ తయారుచేయడానికి ఉపయోగించే బియ్యాన్ని.. ముందురోజు రాత్రి నీటిలో బాగా నాన బెట్టాలి. ఉదయాన్నే అలా నాన బెట్టిన బియ్యాన్ని.. జల్లెడతో వేరే పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత ఆ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది పిండిగా మారే వరకూ గ్రైండ్ చేస్తూనే ఉండాలి.
తర్వాత ఈ బియ్యపు పిండిలో రెండు కప్పుల పాలు.. కొంత చక్కర వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని.. 2 నుండి 3 గంటల పాటు ఆరనివ్వాలి. తరువాత అదే మిశ్రమాన్ని తీసుకుని.. దాదాపు 20 నిమిషాల పాటు మళ్లీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకునే సమయంలో.. మనకి మిశ్రమం అటు పల్చగా లేదా ఇటు చిక్కగా ఉండకుండా మధ్యస్తంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ దీపావళి పండుగ సందర్భంగా ఈ స్పెషల్ అరేబియన్ స్వీట్ కునాఫ ని ట్రై చేయండి.
అలా మనం చేయడం వల్ల.. స్వీట్‌ని నూనెలో వేయించుకొనేటప్పుడు పని సులభమవుతుంది. అయితే ఈ స్వీట్ ప్రత్యేకత ఫ్రై చేసుకునేటప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మిశ్రమంలోకి మన అయిదు వేళ్ళని కొద్దిగా ముంచి.. దానిని నూనె పైన అటు ఇటు తిప్పుతూ తీగల్లాగా వేసుకోవాలి.
అలా తీగలను నూనెలో వేయించడంలోనే.. ఈ ఉటంకి స్వీట్ ప్రత్యేకత తెలుస్తుంది. చూడడానికి మురుకులు చేసుకునట్టుగానే కనిపిస్తుంది కాని.. వీటిని పూర్తిగా మన ముని వేళ్లతోనే వేయడం వల్ల సన్నటి తీగల్లాగా ఉంటాయి. ఇక నూనె బంగారు వర్ణం వచ్చేవరకు ఈ స్వీట్‌ని ఫ్రై చేసుకుని బయటకి తీసి.. వేడిగా ఉన్నప్పుడే గుండ్రంగా చుట్టేయాలి. ఈ విధంగా మనం ఉటంకి స్వీట్‌ని తయారు చేసుకోవచ్చు.
మన స్వీట్ తయారీ చూడడానికి సులభంగానే ఉన్నప్పటికి.. ఫ్రై చేసుకునే సమయంలో కనిపించే వైవిధ్యత కారణంగా ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది. అయితే రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే.. మీరు కూడా తప్పకుండా సరైన పద్దతిలో దీనిని తయారుచేసుకోగలరు.
తెలుసుకున్నారుగా.. అతి తక్కువమందికి తెలిసిన ఉటంకి స్వీట్ గురించి & దాని తయారీ విధానం గురించి. మరింకెందుకు ఆలస్యం.. మీరు కూడా ట్రై చేయండి.
హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ అనోఖి ఖీర్ టేస్ట్ చేయండి..!
Images : Facebook.com/DesiFiesta