'సూర్యకాంతం'గా మెప్పించనున్న.. మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల

'సూర్యకాంతం'గా మెప్పించనున్న..  మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల

తెలుగు చిత్రపరిశ్రమలో హీరోల కొడుకులు హీరోలుగా మారడం చాలా సహజ పరిణామం. అయితే వారి ఇంటి నుండి కథానాయికలుగా రావడమనేది చాలా అరుదు అనే చెప్పాలి. ఒక వేళ వారు హీరోయిన్‌గా వద్దాము అని అనుకున్నా.. వారి ఫ్యాన్స్ అందుకు అస్సలు ఒప్పుకోరు. దీనికి సంబంధించిన ఉదాహరణ - సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల నటిగా చిత్రసీమలోకి అడుగుపెడదామనుకుంటే.. ఆయన అభిమానులలో కొందరు అందుకు ఒప్పుకోలేదు సరికదా.. ఒకవేళ ఆమె చిత్రసీమలో అడుగుపెడితే తాము ఆత్మహత్య చేసుకుంటాము అని హెచ్చరికలు సైతం జారీ చేయడం అప్పట్లో సంచలనమైంది.


అయితే కాలం మారింది. ఇప్పుడు హీరోల కుటుంబాల నుండి కూడా అమ్మాయిలు నటీమణులుగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఆ ట్రెండ్‌లో భాగంగానే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమైంది నిహారిక కొణిదెల. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు సోషల్ మీడియా వేదికగా పలు షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సీరీస్‌ల్లో నటించి తనకంటూ ఒక చిన్నపాటి  ఫాలోయింగ్‌ని తెచ్చుకోగలిగింది.

 


ఆ తరువాత  తెలుగులో "ఒక మనసు" అనే ప్రేమకథ  ద్వారా పరిచయమైన ఈ అమ్మడు ఇప్పటికి రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా చేసేసింది. ఇక ఈరోజు తన పుట్టినరోజు సందర్బంగా సూర్యకాంతం (Suryakantham) అనే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ప్రేక్షకులకి విడుదలచేసింది నిహారిక. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని నిహారిక అన్న ప్రముఖ నటుడు వరుణ్ తేజ్ (Varun Tej) విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రానికి ఆయన సమర్పకుడిగా కూడా ఉన్నట్టు ఇటీవలే తెలిపారు. 


సూర్యకాంతం పేరుకి.. మన తెలుగు సినిమా చరిత్రకీ చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. లెజెండరీ  నటి సూర్యకాంతం ఎన్నో  అద్భుతమైన పాత్రల్లో నటించి ఆ పేరుని తెలుగు వారి ఇళ్లలో తన సొంత పేరుగా మార్చేసింది. అలాంటి ఒక పేరుని ఇప్పుడు  టైటిల్‌గా పెట్టి ఒక చిత్రాన్ని తీయబోతుండడం.. ఆ టైటిల్ పాత్రని నిహారిక పోషించనుండడం ఇంకా ఆసక్తిని  పెంచుతోంది. 


ఇక ఈ చిత్రంలో నిహారికకు జోడిగా రాహుల్ విజయ్ నటిస్తుండగా.. నిహారికతో ఆవకాయ ముద్దపప్పు వెబ్ సిరీస్ తీసిన ప్రణీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Photo: Instagram


నిహారికకి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని.. అలాగే తాను ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని POPxo తరపున మనసారా కోరుకుంటున్నాము.