నవ్వడం ఒక భోగం … నవ్వించడం ఒక యోగం … నవ్వలేకపోవడం ఒక రోగం … అని చెప్పారు జంధ్యాల గారు. ఈ సూత్రాన్ని పాటించి ఆయన ఎన్నో చిత్రాలని తీసి మనల్ని ఆనందింపచేశారు. ఇక సినిమా అంటేనే ఒక కాలక్షేపం లాంటిది. అటువంటి సినిమాలో హాస్యానికి చాలా ప్రాధాన్యం ఉంది. అటువంటి హాస్యాన్ని ఈ సంవత్సరం మన తెలుగు సినిమాల్లో పండించిన పలువురు హాస్య నటుల గురించి సంక్షిప్తంగా మీకోసం…
ఈ సంవత్సరం టాలీవుడ్లో అయిదుగురు కమెడియన్స్ తమ హాస్య చతురతతో అందరిని ఆకట్టుకున్నారు అని చెప్పాలి. వారే రాహుల్ రామకృష్ణ, విష్ణు, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, సత్య.
ముందుగా రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) గురించి ప్రస్తావించుకుంటే – సైన్మా షార్ట్ ఫిలింతో వెలుగులోకి వచ్చిన ఈ యువకుడు.. గత ఏడాది విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. 2018లో కూడా తన హవాని చాటగలిగాడు. ముఖ్యంగా సమ్మోహనం, గీత గోవిందం & హుషారు చిత్రాలలో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులని కడుపుబ్బా నవించాయి అని అనడంలో ఎటువంటి సందేహంలేదు.
తరువాత ఈ జాబితాలో ఉన్న నటుడు అభినవ్ గోమటం (Abhinav Gomatam). ఈనగరానికి ఏమైంది (Ee Nagaraniki Yemaindi) చిత్రంలో నలుగురు ప్రధాన పాత్రలలో ఒకరైన కౌశిక్ పాత్రలో అభినవ్ మెరిశాడు అనే చెప్పాలి. కౌశిక్ పాత్రలో అభినవ్ నటన అత్యంత సహజంగా ఉండడమే కాకుండా సినిమా మొత్తం తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకొని.. ఆడియన్స్‌ని చాలా బాగా నవ్వించాడు. ఈ సినిమాలో నటన ద్వారా అభినవ్‌కి మరిన్ని మంచి పాత్రలు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
చాలాకాలం నుండి చిత్ర పరిశ్రమలో ఉండి మంచి పాత్రలే చేసిన సత్య కి (Sathya) ఈ సంవత్సరం విడుదలైన అమర్ అక్బర్ ఆంటోనీ (Amar Akbar Anthony) చిత్రంలో ఒక మంచి పాత్ర దొరికింది. ఆ పాత్రలో సత్య అద్భుతంగా అభినయయించాడు. తెరపైన ఆ పాత్ర కనిపించినంత సేపు కూడా ఆడియన్స్ తమ సీట్లలో కూర్చోలేనంతగా నవ్వారు అంటే అతిశయోక్తి కాదు. సత్య కెరీర్లోనే గుర్తుండిపోయే పాత్ర ఇది.
ఇక సైన్మా షార్ట్ ఫిలింలో గలీజ్ అనే పాత్ర చేసి కడుపుబ్బా నవ్వించిన విష్ణు (Vishnu) ఈ సంవత్సరం తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ట్యాక్సీవాలా (Taxiwaala) చిత్రంలో హాలీవుడ్ (Hollywood) అనే పాత్రలో నటించిన విష్ణు తన సహజ నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇది తొలిచిత్రమే అయినప్పటికి చాలా అద్భుతంగా నటించి ఆడియన్స్ మన్ననలు పొందాడు. కచ్చితంగా ఈ పాత్ర అతని కెరీర్‌కి ఒక బ్రేక్ ఇస్తుంది అని చెప్పొచ్చు.
పైన చెప్పిన పేర్లని ఒకెత్తు అయితే.. ఇప్పుడు చెప్పబోయే పేరు మరొకెత్తు. ఎందుకంటే గత నాలుగైదేళ్ళుగా తన నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు చిత్రపరిశ్రమలోనే ఒక టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్న నటుడు వెన్నెల కిషోర్ (Vennela Kishore). దాదాపు 16 సినిమాల్లో ఈ సంవత్సరం నటించాడు అంటేనే ఆయన ఏ స్థాయిలో బిజీగా ఉన్నాడో మనకి అర్ధమవుతుంది. ఇక ఈ సంవత్సరం ఆయన చేసిన కొన్ని సినిమాలలోని పాత్రలు ప్రేక్షకులని హాస్యరసంలో ముంచెత్తాయి.
ఉదహరణకి చి.ల.సౌ (ChiLaSow) , గూఢాచారి (Goodachari), గీత గోవిందం (Geetha Govindam), పడి పడి లేచే మనసు (Padi Padi Leche Manasu), దేవదాస్ (Devadas) & ఛలో (Chalo) చిత్రాలలో వెన్నెల కిషోర్ హాస్యనటన అద్భుతం అని చెప్పాల్సిందే. ఈ ఏడాది బెస్ట్ కమెడియన్ అవార్డుల రేసులో అగ్రభాగాన దూసుకుపోతున్న నటుడుగా ఈయన పేరు చెప్పవచ్చు. 2019లో మరిన్ని పాత్రల్లో కనిపించి ప్రేక్షకులని మరింతగా నవ్వించాలని కోరుకుందాం
చదివారుగా.. వీరే ఈ ఏడాది మన తెలుగు చిత్రాలలో తమ హాస్యాభినయంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచిన నటులు. రాబోయే ఏడాది ఈ జాబితా మరింత పెరగాలని ఆశిద్దాం.
ఇవి కూడా చదవండి
2018లో ఈ తెలుగు సినిమాలు ఎందుకు ప్రత్యేకమో తెలుసా..?
2018 తెలుగు సిినిమాల్లో టాప్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
2018లో టాప్ 20 హిట్ సాంగ్స్ ఇవే..!