గణతంత్ర దినోత్సవం (Republic Day) వచ్చేసింది. దేశమంతా ఆనందంగా జెండాకు వందనం చేసే రోజు ఇది. మరి, ఆ రోజు మీ ప్లాన్లేంటి? మీ సంగతేమో గానీ నాకైతే సెలవు రోజంతా చక్కగా ఇంట్లో కూర్చొని నచ్చిన సినిమాలు చూస్తూ గడిపేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకే జెండా ఎగరేయడం అయిపోగానే ఇంటికి వెళ్లిపోయి.. చక్కగా పాప్‌కార్న్ తింటూ దేశభక్తి సినిమాలు చూడాలని నిర్ణయించుకున్నా. మీరూ నాలా సినిమా ప్రేమికులేనా? మరి, ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు తప్పక చూడాల్సిన కొన్ని బాలీవుడ్ చిత్రాల (Bollywood movies) గురించి తెలుసుకుందాం రండి. ఇందులో కొన్ని సినిమాలు మనం ఇంతకుముందే చూసి ఉండొచ్చు. అయితే ఎన్నిసార్లు చూసినా ఎప్పుడూ ఏదో ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయీ చిత్రాలు. అందుకే మళ్లీ ఓసారి వీటిని చూసి మన దేశభక్తిని మరింత పెంచుకుందాం.
1. రంగ్‌దే బసంతి
ఈ యూత్‌సెంట్రిక్ సినిమా దేశభక్తిని పెంచుతూనే.. మన దేశంలో ఉన్న కొన్ని సమస్యల గురించి కూడా ఎత్తిచూపుతుంది. ప్రతిఒక్కరూ ఆయా విషయాలపై శ్రద్ధ వహించాలని చాటుతుందీ చిత్రం. యువతను దేశం కోసం ఏదో ఒకటి చేయాలని ప్రోత్సహించే ఈ సినిమా కఠినమైన పరిస్థితుల్లో పోరాటమే వూపిరిగా ముందుకు సాగాలని వివరిస్తుంది. మీ స్నేహితులను కూడా ఇంటికి పిలిచి అందరితో కలిసి ఈ చక్కటి సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి.
2. రాజీ
హరిందర్ సిక్కా రచించిన కాలింగ్ సెహమత్ అనే పుస్తకం ఆధారంగా తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. భారత్‌కి చెందిన అమ్మాయి పాకిస్థాన్ మిలిటరీ ఆఫీసర్‌ని వివాహమాడి అక్కడికి ఓ గూఢచారిగా వెళ్తుంది. ఇందులో గూఢచారిగా అలియా నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు. తన కెరీర్‌లో ఇదొక అత్యద్భుతమైన చిత్రం. సినిమా చూసినంత సేపు వెంట్రుకలు నిక్కబొడిచేలా అనిపించే ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూసి తీరాల్సిందే..
3. ద లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్
భగత్‌సింగ్ జీవిత కథ ఆధారంగా చాలా సినిమాలే వచ్చాయి. అన్ని సినిమాలూ ఆకట్టుకుంటాయి. కానీ అప్పుడు ఏం జరిగిందో.. ఎలా జరిగిందో కచ్చితంగా అలాగే చూపిస్తూ.. ఉత్కంఠతో చూసేలా చేస్తుందీ చిత్రం. రెండు జాతీయ పురస్కారాలను గెలుపొందిన ఈ సినిమానే కాదు.. ఇందులోని పాటలు కూడా దేశభక్తిని పెంచేలా ఉంటాయి. అందుకే గణతంత్ర దినోత్సవం రోజు చూసేందుకు ఇది చక్కటి ఎంపిక అని చెప్పుకోవచ్చు..
4. లగాన్
మన దేశం నుంచి ఆస్కార్‌కి ఎంపికైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అంతటి అద్భుతమైన సినిమా ఇది. అది కూడా మనదేశంలో ఎక్కువగా ఆసక్తి కనబరిచే క్రీడ అయిన క్రికెట్‌పై తీసింది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో రూపొందించిన ఈ సినిమాలో నటీనటులందరూ అద్భుతమైన నటనను కనబర్చారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ చిత్రం మీ లిస్టులో తప్పక ఉండాల్సిందే.
5. స్వదేశ్
భారత్‌లో పుట్టి, పెరిగి విదేశాలకు వెళ్లేవారిపై రూపొందించిన చిత్రం ఇది. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించలేకపోయినా.. ఇందులో షారూఖ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై కూడా ఈ సినిమా ఎక్కువగానే ఫోకస్ చేస్తుంది.
6. గాంధీ
మహాత్మా గాంధీ పాత్రను ఎవరైనా అద్బుతంగా పోషించగలరంటే ఆ వ్యక్తి బెన్ కింగ్‌స్లే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గాంధీజీ ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ కళ్లకు కట్టినట్లుగా చూపుతుంది. కేవలం గణతంత్ర దినోత్సవం సందర్భంగానే కాదు.. మామూలుగా కూడా ఈ సినిమాను చూసి ఎంతో నేర్చుకోవచ్చు.
7. చక్ దే ఇండియా
బాలీవుడ్ బాద్‌షా నటించిన మరో చిత్రాన్ని కూడా మీ లిస్ట్‌లో చేర్చుకోవాల్సిందే. ఎందుకంటారా? మన జాతీయ క్రీడ అయిన హాకీపై అందరిలోనూ అవగాహన పెంచడమే కాదు.. అమ్మాయిలను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని నిరూపించిన చిత్రం ఇది. చక్ దే ఇండియా మీలో దేశభక్తిని పెంచడం మాత్రమే కాదు.. ఏదైనా సాధించాలనే స్ఫూర్తిని కూడా అందిస్తుంది.
8. గదర్ ఏక్ ప్రేమ్‌కథా
భారత్, పాకిస్థాన్‌లకు చెందిన ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమకథే ఈ చిత్రం. దేశభక్తిని పెంపొందించడంలో ఈ సినిమా తన వంతు పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో ఓ చిన్నారి హిందుస్థాన్ జిందాబాద్ అని అరిచే సంఘటనైతే మన రోమాలు నిక్కబొడిచేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు.
ఇవే కాదు.. కమల్ హాసన్ నటించిన ఇండియన్, రానా హీరోగా విడుదలైన ద ఘాజీ ఎటాక్ సినిమాలు చూడొచ్చు. లేదంటే కంగన ప్రధాన పాత్ర పోషించిన మణికర్ణిక చిత్రం థియేటర్‌లో చూసేందుకు సిద్ధమైపోండి.
ఇవి కూడా చదవండి
రిపబ్లిక్ డే స్పెషల్.. ట్రై కలర్ నెయిల్ ఆర్ట్స్ మీరూ ప్రయత్నించండి..!
గణతంత్ర దినోత్సవానికి మువ్వన్నెల రుచులతో రంగులద్దండి..!