అందాల అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) ఈలోకాన్ని విడిచి దాదాపు సంవత్సరం కావస్తున్నా.. ఇప్పటికీ ఆమె మన మధ్యలో లేదంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీదేవి తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించి.. దేశంలోని ప్రతి ఒక్కరి అభిమాన నాయికగా మారిపోయింది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈ అందాల తార లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ముఖ్యంగా ఆమె కుటుంబసభ్యులు తను లేదనే నిజాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటూ.. బాధ నుంచి కోలుకుంటున్నారు.
దక్షిణాది చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి సౌతిండియాతో పాటు.. బాలీవుడ్‌లోనూ నాలుగు దశాబ్దాలపాటు తన నటనా ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది. తన జనరేషన్‌కి చెందిన నటులందరితోనూ కలిసి నటించిన శ్రీదేవి లేడీ సూపర్‌స్టార్‌గా పేరుప్రఖ్యాతులు గడించింది.
ప్రస్తుతం మన దేశంలో బయోపిక్‌ల (Biopic) ట్రెండ్ నడుస్తోంది. అటు రాజకీయ నాయకులతో పాటు.. ఇటు సినీరంగానికి చెందిన వారి బయోపిక్‌లు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. దీనికి గతేడాది విడుదలైన మహానటి సినిమానే నిదర్శనం. ఇప్పుడు ఇదే కోవలో శ్రీదేవికి సంబందించిన బయోపిక్ వార్త చక్కర్లు కొడుతోంది. శ్రీదేవి జీవితంపై సినిమా తీయడానికి ఆమె మరణం తర్వాత చాలామంది ప్రయత్నించారు. కథలు సిద్ధం చేసుకున్నారు. త్వరలో శ్రీదేవి బయోపిక్ కూడా మొదలవుతుందన్న వార్తల మధ్య ఇప్పుడు ఓ కీలక సమాచారం బయటికొచ్చింది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన బయోపిక్‌ని నిర్మించనున్నాడని.. దానికి ఆయనే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.
బోనీ కపూర్ (Boney Kapoor)కి నిర్మాతగా మంచి అనుభవమే ఉంది. వివిధ భాషల్లో ఎన్నో చిత్రాలను నిర్మించినా ఇప్పటివరకూ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. అలాంటిది ఆయన ఇప్పుడు భారతదేశ చరిత్రలోనే పెద్ద లేడీ సూపర్ స్టార్‌గా అభివర్ణించే శ్రీదేవి జీవితకథకు దర్శకత్వం వహించడమంటే ఎంతైనా కత్తిమీద సామే అని చెప్పాలి. శ్రీదేవి జీవితంలోని ఎన్నో విషయాలు ఆయనకు మాత్రమే తెలిసినా.. దాన్ని తెరపై సరిగ్గా చూపించగలరా? అన్నదే ఇక్కడ ముఖ్యమైన అంశం.
అయితే బోనీ కపూర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఓ ముఖ్యమైన కారణమే ఉందట. ఈ మధ్య కాలంలో వచ్చే బయోపిక్స్ దాదాపు చాలావరకూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తన భార్య జీవితం గురించి ఎవరైనా వివాదాలు రేకెత్తించేలా సినిమా తీస్తే.. ఆ తర్వాత దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని భావించిన ఆయన అలాంటివి అవసరం లేకుండా తనే సొంతగా సినిమా రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాడట.
ఇప్పటికే బోనీ కపూర్ మంచి కథకులని ఎంపిక చేసి వారి చేత.. ఆమె జీవితంలో జరిగిన సంఘటనల సమాహారాన్ని అందంగా ఆసక్తికరంగా.. ఒక కథలా మార్చి చెప్పేలా సిద్ధం చేయిస్తున్నాడని కథనం. శ్రీదేవి జీవితంపై మరెవరూ సినిమా రూపొందించకుండా దానికి కాపీరైట్ తీసుకోవాలని బోనీ ఆలోచిస్తున్నారట. అంతేకాదు..ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే పలు టైటిల్స్‌ని కూడా రిజిస్టర్ చేశారట. అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన బోనీ కపూర్ నుండి ఇంకా వెలువడాల్సి ఉంది.
ఒకవేళ ఈ బయోపిక్ కార్యరూపం దాలిస్తే శ్రీదేవి పాత్రలో ఎవరు కనిపిస్తారు అన్న ప్రశ్న అప్పుడే బాలీవుడ్‌లో మొదలైంది. శ్రీదేవి అందమైన రూపంతో పాటు అద్భుతమైన నటనకు కేరాఫ్ అడ్రస్. మరి, ఆమె పాత్రలో నటించడం అంటే మామూలా.. దానికి బాలీవుడ్‌లో ఎవరు సరైన ఎంపిక అని చాలామంది ఆలోచిస్తున్నారు. కొందరు ఆమె కూతురు జాన్వి కపూర్ తల్లి పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అంటున్నా.. ఆమెకి ఇంకా తల్లి పాత్ర చేసేంతలా నటనలో అనుభవం రాలేదు అనేవారు కూడా లేకపోలేదు.
ప్రస్తుతం తెలుగులోనూ బయోపిక్ సీజన్ నడుస్తోంది. తాజాగా ఎన్ఠీఆర్ (NTR) జీవితాన్ని ఆధారం చేసుకుని తీస్తున్న చిత్రం ఎన్ఠీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) విడుదల కాగా.. ఫిబ్రవరి 7న ఎన్ఠీఆర్ మహానాయకుడు (NTR Mahanayakudu) విడుదలకానుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) బయోపిక్ యాత్ర (Yatra) ఫిబ్రవరి 9న విడుదలకానుంది.
మొత్తానికి తెలుగులో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నవేళ.. అతిలోకసుందరి శ్రీదేవి జీవితకథకి చెందిన ఈ బయటకి రావడంతో ఆమెకి ఉన్న కోట్లాది అభిమానులు కనీసం ఇలాగైనా మరోసారి ఆమెని తెరపైన చూసేందుకు అవకాశం దొరకనుంది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 24న ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
శ్రీదేవిని జాతీయ అవార్డు వరించిన వేళ.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శ్రీదేవికి స్పెషల్ సెల్యూట్.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
శ్రీదేవి మరణం తర్వాత.. బోని కపూర్ రాసిన ప్రేమలేఖ.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి