సంక్రాంతి వేళ.. ఈ పసందైన పిండి వంటలు మీకోసమే..!

సంక్రాంతి వేళ.. ఈ పసందైన పిండి వంటలు మీకోసమే..!

భార‌తీయ సంప్ర‌దాయాల‌కు, ఆచార‌వ్య‌వ‌హారాల‌కు అద్దం ప‌ట్టే ప్ర‌ధాన పండ‌గ‌ల్లో సంక్రాంతి కూడా ఒక‌టి.  ఇంటి ముంగిళ్ల‌లో వేసే రంగురంగుల ముగ్గులు, అంద‌రిలోనూ వ‌య‌సుని మ‌రిపించే స్థాయిలో ఉత్సాహాన్ని నింపే గాలిప‌టాల రెప‌రెప‌లు.. చెవుల‌కు విన‌సొంపుగా వినిపించే హ‌రిదాసుల కీర్త‌న‌లు.. వీట‌న్నింటినీ మించి గుమ్మం నుంచే ఘుమ‌ఘుమ‌లాడే పిండి వంట‌కాల సువాస‌న‌లు.. ఏమ‌ని చెప్పేది? ఎన్న‌ని చెప్పేది?? ఒక‌ప్ప‌డు సంక్రాంతి సంబ‌రాలంటే క‌న్నుల‌పండువ‌గా జ‌రిగేవి. మ‌రి, ఇప్ప‌డు ఆ సంప్ర‌దాయాలు, సంబ‌రాలు కేవ‌లం క‌ళ్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిపోతున్నాయి.


అదేనండీ.. ముగ్గుల స్థానంలో స్టిక్క‌ర్లు, గాలిప‌టాల స్థానంలో చ‌క్క‌ర్లు కొట్ట‌డం (బ‌య‌ట స‌రదాగా విహ‌రించ‌డం).. వంటివే జ‌రుగుతున్నాయి.  అంతేనా.. పండ‌గ అంటే ఒక సెల‌వు దినం అని ప‌రిగ‌ణించేవాళ్లు కూడా లేక‌పోలేదు. ఇక‌, పిండి వంట‌కాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? న‌చ్చిన వంట‌కాల‌ (dishes) జాబితాను తయారు  చేసుకుని న‌చ్చిన షాపు నుంచి కొనుక్కొని మ‌రీ తెచ్చుకుంటున్నారు. అంతా ర‌ెడీమేడ్ అయిపోయింది మ‌రి!!


కానీ పండ‌గ అంటే ఇది కాదు..  పిండి వంట‌కాలు, పండ‌గ ప‌నుల నేప‌థ్యంతో అంద‌రినీ ఒక చోట చేర్చి క‌లిసి మెలిసి ప‌ని చేసేలా చేయ‌డం ద్వారా వారి మ‌ధ్య స‌ఖ్య‌తను మ‌రింత పెరిగేలా చేయ‌డ‌మే అస‌లైన పండ‌గ‌! పిండి వంట‌కాలతో మ‌నం ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంతోపాటు..  వాటిని తయారుచేసే స‌మ‌యంలో అంతా క‌లిసి క‌ష్ట‌ప‌డ‌డం ద్వారా ఇంటిలో స‌మైక్య‌త కూడా పెరుగుతుంది. అస‌లు మునుప‌టి రోజుల్లో ఈ పిండి వంట‌కాల త‌తంగం ఎంత సంద‌డిగా సాగేదో మీకు తెలుసా??  నేను చెప్తాను వినండి..


సంక్రాంతి పండ‌గ‌కు ప‌దిహేను రోజుల ముందు నుండే పిండి వంట‌ల హ‌డావుడి మొద‌లైపోయేది. బియ్యం నాన‌బెట్టుకోవ‌డం, వాటిని పిండి ఆడించుకోవ‌డం,  క‌ల్తీ లేని నెయ్యి, బెల్లం.. వంటివి స‌మ‌కూర్చుకోవ‌డం.. అబ్బో.. ఒక్క‌ట‌ని కాదు కానీ పండ‌గ సంద‌ర్భంగా త‌యారు చేయాల‌నుకున్న వంట‌కాలకు అవ‌స‌ర‌మ‌య్యే ప‌దార్థాల‌న్నీ ముందుగానే స‌మ‌కూర్చుకునేవాళ్లం. ఇందుకు దాదాపు రెండు నుంచి మూడు రోజుల స‌మ‌యం ప‌ట్టేది.


ఆ త‌ర్వాత ఇంటి ప‌నుల‌న్నీ ముగించుకొని;  తీరిక చేసుకుని పిండివంట‌లు వండేందుకు సిద్ధ‌మ‌య్యేవాళ్లం. వంట‌కానికి అవ‌స‌ర‌మ‌య్యే స‌మ‌యం బ‌ట్టి ఆ రోజు ఎన్ని ర‌కాల వంట‌కాలు చేయాలో నిర్ణ‌యించుకునేవాళ్లం. అయితే మొద‌టి రోజు మాత్రం త‌ప్ప‌కుండా ల‌డ్డూల త‌యారీతోనే ప్రారంభించేవాళ్లం.రవ్వ‌ల‌డ్డు: గోధుమ నూక‌, చ‌క్కెరతో త‌యారు చేసే ఈ ల‌డ్డూలను  పండ‌గ స‌మ‌యంలో పిల్ల‌లు బాగా ఇష్ట‌ప‌డ‌తారు. పైగా వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ముందుగా స్ట‌వ్‌పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు చెంచాల నెయ్యి వేసి కాస్త వేడెక్క‌నివ్వాలి. ఆ త‌ర్వాత అందులో కొన్ని కిస్‌మిస్‌, జీడిప‌ప్పు ప‌లుకులు వేసి దోర‌గా వేయించుకుని  ఒక ప్లేటులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్‌లో ఇంకాస్త నెయ్యి వేసుకొని.. ఆ తర్వాత పావుకేజీ గోధుమ నూక వేసి ఉండ‌లు క‌ట్ట‌కుండా జాగ్ర‌త్త‌గా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.  త‌ర్వాత దీనిని ఒక ప్లేటులోకి తీసుకొని చ‌ల్లార‌నివ్వాలి.


ఈలోగా రెండు క‌ప్పుల చ‌క్కెర తీసుకొని మిక్సీ ప‌ట్టి పౌడ‌ర్‌గా చేసుకోవాలి. వేయించుకున్న గోధుమ నూక కాస్త చ‌ల్లారిన త‌ర్వాత ఈ చ‌క్కెర పౌడ‌ర్‌ని అందులో వేసి రెండు చెంచాల నెయ్యి వేసి బాగా క‌ల‌పాలి.  ర‌వ్వ‌ల‌డ్డూలు మంచి వాస‌న వ‌స్తూ రుచిగా ఉండాలంటే యాల‌కుల పొడిని కూడా కాస్త చేర్చుకోవ‌చ్చు. ఇప్పుడు ఈ పిండిలో గోరువెచ్చ‌గా వేడి చేసిన నెయ్యి లేదా పాలు వేస్తూ ఉండ‌లు చుట్టుకునేందుకు వీలుగా క‌లుపుకోవాలి. ఆ త‌ర్వాత జాగ్ర‌త్త‌గా ఉండ‌లు చుట్టుకొని ఒక అర‌గంట పాటు బ‌య‌టే ఉంచడం వ‌ల్ల అవి కాస్త గ‌ట్టి ప‌డ‌తాయి. అనంత‌రం గాలి చొర‌బ‌డ‌ని డ‌బ్బాల్లో వాటిని భ‌ద్ర‌ప‌రుచుకుంటే 8 నుంచి 15 రోజుల వ‌ర‌కు అవి పాడ‌వ‌కుండా ఉంటాయి.

 ఇక సంక్రాంతి పండ‌గ అన‌గానే అంద‌రికీ ప్ర‌ధానంగా గుర్తుకు వ‌చ్చేవి అరిసెలే! అయితే వీటి త‌యారీకి కాస్త  స‌మ‌యం ఎక్కువ ప‌డుతుంది. ముందుగా వీటి త‌యారీకి అవ‌స‌ర‌మ‌య్యే బియ్యం శుభ్రంగా క‌డిగి ఐదారు గంట‌లు నాన‌బెట్టుకుని పొడి చేసుకోవాలి. అలాగే క‌ప్పు తురిమిన బెల్లం, ఐదు చెంచాల నువ్వులు, త‌గినంత నూనె, నెయ్యి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్‌పై గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి తురిమిన బెల్లం వేయాలి. ముదురుపాకం వ‌చ్చే వ‌ర‌కు దానిని మ‌రిగించాలి. ఆ త‌ర్వాత అందులో మ‌నం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండిని వేసి ఉండ‌లు క‌ట్ట‌కుండా బాగా క‌ల‌పాలి.


ఇందులో రెండు చెంచాల నెయ్యి వేసుకోవ‌డం వ‌ల్ల పిండి మృదువుగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకొని ఒక్కో ఉండ‌ను చేతితోనే మందంగా, పూరీలా ఒత్తుకోవాలి. వాటిపై అక్క‌డ‌క్క‌డా నువ్వులు వేసి,  బాగా కాగిన నూనెలో వేసి బంగారు వ‌ర్ణం వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. అయితే అరిసెలు నూనె ఎక్కువ‌గా లాగేస్తూంటాయి. ఆ నూనెని అబ‌క‌ల స‌హాయంతో అరిసెని నొక్కి పెట్టి ఉంచి సుల‌భంగా తొల‌గించేయ‌చ్చు.


 
 

 

 


View this post on Instagram


#ariselu #sankranti2019 #specialsweets #jayasrisweets #indiansweets #sankrantispecial #sweetcravings #specialfood


A post shared by Jayasri Sweets (@jayasrisweets) on

సంక్రాంతి పండ‌గ స‌మ‌యంలో త‌యారుచేసే పిండి వంట‌ల్లో అరిసెల త‌ర్వాతి స్థానం సున్నుండ‌ల‌దే! వీటి తయారీ కోసం ముందుగా మిన‌ప్ప‌ప్పుని వేయించుకుని సిద్ధం చేసుకోవాలి. ఇది చ‌ల్లారిన త‌ర్వాత పుట్నాల‌ప‌ప్పుతో క‌లిపి మిక్సీ ప‌ట్టుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పొడుల‌ను ఒక ప్లేట్‌లో వేసి బాగా క‌ల‌పాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. చేతివేళ్ల‌కు నూనె లేదా నెయ్యి కాస్త రాసుకొని ఈ పొడిని ఉండ‌ల్లా చుట్టుకోవాలి. అంతే.. కమ్మ‌ని సున్నుండ‌లు త‌యార్‌..!
 

 

 


View this post on Instagram


Presenting Mil's Sunnundalu / urad dhal ladoo made from roasted Urad dhal, little rice, sugar and ghee. Learnt it finally with some tips.. Her measurements are by hands and eye, so I have to experiment myself to get the perfect one before it goes as an video. One of the last pic from this place, though I have loads of memories to carry along with me... Off to our favourite place which we have been waiting from day 1 (indeed 1+ years) of this vacation, welcoming you shortly to palakaad zone from Hyderabad - #thangachi's house... . . . #sweet #sunnundalu #andhra #andhrasweets #bhojanam #eattherainbow #foodreviewindia #southindiancusine #hyderabadi #southindianfood #foodtalkindia #gharkakhana #nomnom24x7 #walkwithindia #telugufood #sohyderabad @mumbaifooodies @dillifoodies @foodbossindia #hyderabadfoodie #neeskitchen #indianfoodstories #hyderabad_diaries #odiafood #foodmaniacindia #whatvegetarianseat #therawtextures #platinggoals


A post shared by Neeru Srikanth | Neeskitchen (@neeskitchen) on
 ఏంటీ?? వ‌రుస‌గా స్వీట్స్ గురించే చెబుతున్నారు అని చూస్తున్నారా??  కారం వంట‌కాలు కూడా  పిండి వంట‌ల్లో భాగ‌మే. ముఖ్యంగా మిన‌ప్పిండితో త‌యారు చేసే జంతిక‌లు ముఖ్యమైనవి. పండగ స‌మ‌యంలో క‌ర‌క‌ర‌లాడే స్నాక్స్ అంటే చాలామందికి ఇవే గుర్తొస్తాయి. వీటి త‌యారీకి వ‌రిపిండి, శెన‌గ‌పిండి.. వంటివి ఉప‌యోగిస్తూ ఉంటారు. అయితే మిన‌ప్ప‌ప్పుతో త‌యారుచేసే జంతిక‌లు రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇంత‌కీ వాటిని ఎలా త‌యారుచేయాలంటే..  ఒక గిన్నెలో ఒక గ్లాసు దోర‌గా వేయించిన మిన‌ప్ప‌ప్పు, మూడు గ్లాసుల బియ్యం తీసుకొని మెత్త‌ని పిండిలా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నూనె వేడి చేసి పోయాలి.


ఆ త‌ర్వాత అందులో చెంచా కారం, నువ్వులు లేదా వాము, కొద్దిగా ఉప్పు వేసి అవ‌న్నీ క‌లిసేలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చ‌ని నీళ్లు ఇందులో పోస్తూ జంతిక‌ల పిండిని సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ పిండి మ‌రీ గ‌ట్టిగా లేదా మ‌రీ ప‌లుచ‌గా ఉండ‌కుండా చూసుకోవాలి.  దానిని 10 నిమిషాల పాటు నాన‌నివ్వాలి. ఈలోగా జంతిక‌లు వేసే గొట్టం లేదా పుడ‌క‌కు నెయ్యి లేదా నూనె రాసి కొద్దికొద్దిగా పిండి తీసుకొని కాగుతున్న నూనెలో జంతిక‌లు వేయించాలి. అంతే.. మిన‌ప్ప‌ప్పు జంతిక‌లు ర‌డీ..!

 స‌కినాల త‌యారీ కూడా దాదాపుగా ఇలానే ఉంటుంది. కాక‌పోతే స‌కినాలు వండేందుకు ఉప‌యోగించే బియ్య‌ప్పిండి మ‌న‌మే తయారుచేసుకోవాలి. ముందుగా ఒక రాత్రంతా బియ్యం నాన‌బెట్టి.. ఉద‌యాన్నే అందులో ఉన్న నీటిని తొల‌గించి కాస్త ఆర‌నివ్వాలి. ఆ త‌ర్వాత ఆ బియ్యాన్ని పిండిలా చేసుకొని; అందులో వాము, ఉప్పు, నువ్వులు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ జాగ్ర‌త్త‌గా పిండిలా క‌లుపుకోవాలి. అలా క‌లిపిన పిండి చేతికి అంటుకోనంత వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా క‌లుపుతూ ఉండాలి. ఇప్ప‌డు ఒక మెత్త‌ని వ‌స్త్రాన్ని తీసుకుని దానిపై ఈ పిండిని చేతి వేళ్ల‌తోనే గుండ్రంగా చుట్టాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు వీటిని ఆర‌నిచ్చి త‌ర్వాత కాగుతున్న నూనెలో వేసి వేయించుకుంటే స‌కినాలు త‌యార్‌..

 సంక్రాంతి పండ‌గ అన‌గానే ఎక్కువ‌మందికి గుర్తుకొచ్చే వాటిలో పాకుండ‌లు కూడా ఒక‌టి. వీటి త‌యారీకి ఉప‌యోగించే బియ్య‌ప్పిండిని కూడా మనమే తయారుచేసుకోవాలి. బియ్యాన్ని ఒక రాత్రంతా నాన‌బెట్టి  మ‌రుస‌టి రోజు మిక్సీ ప‌ట్టి త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పాకుండ‌లు త‌యారుచేసే స‌మ‌యానికి ఈ పిండి కాస్త తేమ‌గా ఉండేలా చూసుకోవాలి సుమా..! ముందుగా ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి అందులో బెల్లం వేయాలి.


అది క‌రిగిన త‌ర్వాత న‌ల‌క‌లు ఉంటే ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టుకొని మ‌ళ్లీ స్ట‌వ్‌పై  పెట్టాలి. పాకం వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగిన త‌ర్వాత ఇందులో కొబ్బ‌రి తురుము, కొద్దిగా నెయ్యి, యాల‌కుల పొడి వేసి బాగా క‌ల‌పాలి. దీనిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన త‌ర్వాత మ‌నం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బియ్య‌ప్పిండిని కూడా ఇందులో వేసి ఉండ‌లు క‌ట్ట‌కుండా క‌లుపుకోవాలి. మ‌రో ఐదు నిమిషాల పాటు దీనిని ఉడ‌క‌నిచ్చి ఆ త‌ర్వాత స్ట‌వ్‌పై నుంచి దింపుకోవాలి. ఈ పిండి పూర్తిగా చ‌ల్లారిన త‌ర్వాత చిన్న చిన్న ఉండ‌ల్లా చుట్టుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి వేయించుకుంటే స‌రి.. నోరూరించే పాకుండ‌లు సిద్ధ‌మైన‌ట్లే!
 

 

 


View this post on Instagram


Mana pindivantalu. #pakundalu #favourite


A post shared by Ms. Adabala (@thehalf8akedcupcake) on

ఇక పండ‌గ అన‌గానే బూరెలు, గారెలు, పాయసం.. వంటివి కూడా వండుకుంటూ ఉంటాం. ఇవీ ఈ పిండి వంట‌కాల్లో భాగమే మ‌రి..| ఇలా ర‌క‌ర‌కాల పిండి వంట‌లు త‌యారు చేస్తూ, వాటి త‌యారీ గురించి మాట్లాడుకుంటూ; వ‌ండిన ప‌దార్థాలు రుచి చూస్తుంటే.. ఎవ‌రికైనా స‌రే.. పండ‌గ ముందుగానే వ‌చ్చేసిందా.. అని అనిపించ‌క మాన‌దు! ఏమంటారు?? మ‌రి, ఈ పండ‌గ‌కు మీరు ఏయే వంట‌కాల‌తో సిద్ధ‌మ‌వుతున్నారు?? ఏవైనా స‌రే.. స్వ‌యంగా మ‌న చేతుల‌తో వండి వ‌డ్డిస్తేనే క‌దా.. ఆ ఆనందం, తృప్తి మ‌న సొంత‌మ‌య్యేది..! మీ అంద‌రికీ సంక్రాంతి పండ‌గ శుభాకాంక్ష‌లు మ‌రి..!


Images: Instagram, Shutterstock


ఇవి కూడా చదవండి


సంక్రాంతికి తెలంగాణలో ఈ వంటకం చాలా స్పెషల్


సంప్రదాయ‌బ‌ద్ధంగా పండ‌గ వేడుక‌లు జ‌రుపుకుందాం.. త‌దుప‌రి త‌రాల‌కు వాటిని అందిద్దాం..!


కొత్త అల్లుళ్లు, కోడి పందేలు.. సరదాల సంక్రాంతి తెచ్చే ఆనందాలెన్నో..!