మహిళ ముగ్గు పెడుతుంటే.. కాన్వాస్ పై పెయింట్ వేస్తున్నంత అందంగా ఉంటుంది. వాకిలి చిమ్మి.. చుక్కలు పెడుతుంటే.. ఆకాశంలోని చుక్కలన్నీ.. ఆమె ముగ్గుపిండిలో దాక్కొని నేల మీద వరసకట్టి.. ఆమె చేతి నేర్పరితనానికి మురిసిపోయి.. అన్నీ ఏకమై ముగ్గుగా మారిపోయాయా అనిపిస్తుంది. ఆ ముగ్గుని చూసి మనసు పడిన హరివిల్లు తనలోని రంగులద్ది దాన్ని రంగవల్లిగా మార్చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటి అందమైన ముగ్గులను చూస్తున్నప్పుడు మహిళలు ముగ్గుల విషయంలో ఎందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు? అసలు వాటి వల్ల మహిళలకు కలిగే ప్రయోజనం ఏంటి?
ముగ్గు, రంగవల్లి.. పేరేదైనా కానివ్వండి.. మగువకు అవి చాలా ప్రత్యేకమైనవి. కోడి కూయకముందే నిదుర లేచి.. వాకిలి ఊడ్చి.. కల్లాపి జల్లి.. పిండితో ముగ్గు వేస్తుంది మహిళ. ఇది కళాత్మకతతో కూడిన సంప్రదాయం. అంతకుమించి అది ఆమెకు చాలా ఇష్టమైన దినచర్య. ఇక పండగ వస్తే.. ఇంటిని శుభ్రంగా కడిగి ముగ్గులతో అందంగా తీర్చిదిద్దుతారు. ముంగిట పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఏ విషయంలోనైనా వారు అలసటగా భావిస్తారేమో కానీ ముగ్గు విషయంలో మాత్రం.. వారికి అలుపే రాదు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే.. ముగ్గు నేను వేస్తానంటే.. నేను వేస్తానని గొడవపడతారు.
ఏ మగువైనా ముగ్గు వేయడం పూర్తయిన తర్వాత తృప్తిగా చూసుకొంటుంది. అవును ముగ్గు మహిళ సంతోషానికి చిహ్నం. ముంగిట మగువ తీర్చిదిద్దిన ముగ్గు చూసి ఆమె మనసు ఎలా ఉందో చెప్పేయచ్చు. మనసే కాదు.. ఆమె ఆరోగ్యాన్ని కూడా అంచనా వేయచ్చు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే.. ఆ ఇంట్లో జరగకూడనిది జరిగినట్లుగా భావిస్తారు. పండగ సమయంలో ముగ్గుల్లో రంగులను నింపుతారు. ఆ రంగులు ఆమె ఆనందానికి ప్రతీక.
మహిళలు తీర్చిదిద్దిన ముగ్గులను మనం గమనిస్తే అందులో వారి నైపుణ్యం ప్రతిఫలిస్తుంది. ముగ్గు పిండిని రెండు వేళ్లతో తీసుకొని వాటి మధ్య నుంచి వదులుతూ గీతను అందంగా వచ్చేలా పోత పోస్తారు. ఈ ముగ్గు గీత వారిలోని నేర్పరితనాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే పోత సన్నగా ఉంటే ముగ్గు తేలిపోయినట్టుగా ఉంటుంది. అలాగని లావుగా ఉంటే.. చూడటానికి అంత బాగుండదు. అందుకే పోత మధ్యస్థంగా ఉండేలా చాలా నేర్పుగా రంగవల్లి వేస్తుంటారు.
ఈ ముగ్గుని వారు ఎంతందంగా వేస్తారంటే.. ముగ్గును ఎక్కడ మొదలుపెట్టి.. ఎక్కడ ఆపారో కూడా గుర్తించలేనంత బాగా వేస్తారు. కొందరిలో దించిన చేయి ఎత్తకుండా ముగ్గు పూర్తి చేసే నైపుణ్యం ఉంటుంది. ముగ్గుల్లో ఎన్ని రకాలున్నాయో మహిళలనే అడిగి తెలుసుకోవాలి. పద్మాలు, మారేడు దళాలు, పందిరి మంచాలు, మల్లెతీగలు, చేపముగ్గు, దీపాల ముగ్గు, తాబేలు ముగ్గు, రథం ముగ్గు, పాము ముగ్గు, షట్కోణాలు, నక్షత్రం ముగ్గు ఇలా ఎన్నో రకాల ముగ్గులున్నాయి. సందర్భాన్ని బట్టి ఏ ముగ్గు వేయాలో అది వేస్తుంటారు. ఇటీవలి కాలంలో మగువలు ఈ ముగ్గులకు ఆధునిక భావాలను జోడిస్తున్నారు.
ముగ్గు (Rangoli) మనకు జీవిత పాఠాలను నేర్పిస్తుంది. ఆశ్చర్యంగానే అనిపిస్తున్నా ఇది నిజం. ముగ్గు వేసేటప్పుడు.. చుక్కలను కలుపుతూనే ఓసారి ముగ్గు ఎలా వేశానా? అని చూస్తారు. చిన్నతప్పు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే దాన్ని సరిచేస్తారు. అంటే తప్పుని సరిదిద్దుకొంటారు. అంతేకాదు.. మరోసారి అదే ముగ్గు వేస్తే అది పునరావృతం కాకుండా జాగ్రత్తపడతారు. అంటే తప్పుల నుంచి పాఠం నేర్చుకోమని చెబుతుంది ముగ్గు. ముగ్గులు వేసే విషయంలో మహిళలు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఇది వారిలో పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా.. వారి నైపుణ్యానికి మెరుగుపట్టి.. ది బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా చేస్తుంది. అంటే అది మనలో నేర్చుకొనే తత్వాన్ని పెంపొందిస్తుంది.
ఆరోగ్యం, శుభ్రత కలగలిపిన సంప్రదాయం. బియ్యప్పిండిలో గుల్ల సున్నం కలిపి ముగ్గు వేయడం మన తెలుగు సంప్రదాయంలో భాగం. ఈ సున్నం వల్ల అనారోగ్యాన్ని కలిగించే క్రిమికీటకాలు.. ముగ్గు కర్రలు దాటి ఇంట్లోకి ప్రవేశించలేవు. సాధారణంగా ముగ్గు గీతలను కర్రలనే పిలుస్తారు. ముగ్గు మహిళను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే… ముగ్గు ఆమె శరీరానికి వ్యాయామం. ఆమె ప్రత్యేకించి దీనికోసం ప్రత్యేకంగా వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేదు. ముగ్గు పెట్టే సమయంలో చుక్కలు కలపడానికి వీలుగా ఆమె అటూ ఇటూ కదులుతుంది. కూర్చోవడం, వంగడం, చేతులను కలపడం.. చేస్తూ ఉంటుంది. ఆమె శరీరం సైతం చాలా వేగంగా కదులుతూ ఉంటుంది. ఇది రోజూ గంటపాటు వర్కవుట్లు చేసిన దాంతో సమానం. రోజూ ముగ్గు వేయడం వల్ల వెన్నెముక గట్టిపడుతుంది.
ఇవి కూడా చదవండి
సంప్రదాయబద్ధంగా పండగ వేడుకలు జరుపుకుందాం.. తదుపరి తరాలకు వాటిని అందిద్దాం..!
సంక్రాంతి ముంగిట్లో విరిసే ముత్యాల ముగ్గుల హరివిల్లు… !
సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..