ప్రీతీ జింటా.. చ‌క్క‌ని న‌టి మాత్ర‌మే కాదు.. ధైర్య‌శాలి కూడా..!

ప్రీతీ జింటా.. చ‌క్క‌ని న‌టి మాత్ర‌మే కాదు.. ధైర్య‌శాలి కూడా..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌ (Movie industry)లోకి హీరోయిన్లు ఎంతో మంది వ‌స్తూ ఉంటారు. వారిలో కొంద‌రు ఒక‌టి లేదా రెండు సినిమాల‌తో త‌మ కెరీర్‌ను ముగిస్తే; ఇంకొంద‌రు మాత్రం ఏళ్ల త‌ర‌బ‌డి కొన‌సాగుతూ జాగ్ర‌త్త‌గా అభిన‌యానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌లు ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేస్తూ ఉంటారు. బాలీవుడ్ భామ‌ల్లో ఈ జాబితాలో ఉన్న వారి గురించి చెప్పుకోవాలంటే అందులో ప్రీతీ జింటా (Preity Zinta) పేరు కూడా త‌ప్ప‌కుండా ఉండి తీరుతుంది.


జ‌న‌వ‌రి 31, 1975 తేదిన జ‌న్మించిన ప్రీతి తండ్రి పేరు దుర్గానంద్ జింటా. ఆయ‌న ఒక ఆర్మీ ఆఫీస‌ర్. ప్రీతికి 13 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు అనుకోకుండా జ‌రిగిన కారు ప్ర‌మాదం కార‌ణంగా ఆయన మ‌ర‌ణించ‌గా; త‌ల్లి నిల్ ప్ర‌భ తీవ్ర గాయాల‌పాల‌య్యారు. దాదాపు రెండేళ్ల పాటు మంచానికే ప‌రిమిత‌మైన ఆమె.. ఆ త‌ర్వాత క్ర‌మంగా కోలుకున్నారు.


ఇలా చిన్న వ‌య‌సులోనే ఆక‌స్మికంగా త‌లెత్తిన ఈ ప‌రిస్థితుల కార‌ణంగా జీవితంలో ఏం జ‌రిగినా ధైర్యంగా ముందుకు సాగ‌డ‌మే త‌న ల‌క్ష్యంగా మార్చుకుంది ప్రీతి. ఈ క్ర‌మంలో మంచి మెరిట్‌తో త‌న చదువుని కొన‌సాగించింది. ఇంగ్లిష్‌లో ఆన‌ర్స్ చేయ‌డ‌మే కాదు.. క్రిమిన‌ల్ సైకాల‌జీలో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కూడా పూర్తి చేసింది. ఆ త‌ర్వాత అనుకోకుండా మోడ‌లింగ్ దిశ‌గా అడుగులు వేసింది ప్రీతి.


ఆమె తొలిచిత్రం 'దిల్ సే' (Dil Se). మ‌ణిరత్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా చ‌క్క‌ని అభిన‌యంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. నిజానికి శేఖ‌ర్ క‌పూర్ రూపొందించిన "తర‌రంపం" అనే సినిమా ద్వారా హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న న‌టించేందుకు ఆమె ముందుగా ఎంపికైంది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి కాక‌పోవ‌డంతో శేఖ‌ర్.. ప్రీతీ జింటాను మ‌ణిర‌త్నంకు ప‌రిచ‌యం చేశార‌ట‌!


అలా దిల్ సేతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రీతి.. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. వెంకటేష్ స‌ర‌స‌న‌ 'ప్రేమంటే ఇదేరా' (Premante Idera) & మహేష్ బాబు తొలిచిత్రం 'రాజకుమారుడు' (Rajakumarudu) లో క‌థానాయిక‌గా న‌టించి అంద‌రినీ మెప్పించింది. ఇలా కెరీర్ ప్రారంభంలోనే టాలీవుడ్‌లో మంచి హిట్స్ అందుకున్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువ‌గా దృష్టి సారించిందీ ముద్దుగుమ్మ‌.


కెరీర్ తొలినాళ్ల‌లోనే మంచి అవ‌కాశాలు చేజిక్కించుకొన్న ప్రీతి.. ఆ త‌ర్వాత కూడా అభిన‌యానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు ఎంచుకుంటూ ఎన్నో హిట్స్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. మొద‌టి చిత్రంతోనే ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్న ఈ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి కేవ‌లం న‌ట‌న‌లోనే కాదు.. ధైర్యంలోనూ దిట్టే అని నిరూపించుకుంది. 2003లో భ‌ర‌త్ షా అనే ఒక ఫిలిం ఫైనాన్షియర్‌కు ముంబ‌యి మాఫియాతో సంబంధం ఉంద‌ని.. పోలీసులు దాఖ‌లు చేసిన కేసులో 13మందిని సాక్ష్యులుగా చేర్చారు. వారిలో ప్రీతీ కూడా ఒక‌రు.

 


కేసు విచార‌ణ జ‌రుగుతున్న క్ర‌మంలో బెదిరింపులు రావ‌డం, హెచ్చ‌రింపులు.. వంటి కార‌ణాల వ‌ల్ల మిగ‌తా సాక్ష్యులంతా ఈ కేసు నుంచి త‌ప్పుకోగా; ఒక్క ప్రీతి మాత్ర‌మే తుది వ‌ర‌కు త‌న మాట‌పై నిల‌బ‌డింది. ఈ క్ర‌మంలో ఎన్ని బెదిరింపులు వ‌చ్చినా ఆమె ఏ మాత్రం భ‌య‌ప‌డ‌లేదు. ఈ ధైర్యానికి గాను ప్ర‌ఖ్యాత గాడ్ ఫ్రే మైండ్ ఆఫ్ స్టీల్ అవార్డు (Godfrey Mind of Steel Award) ఆమెను వ‌రించింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ- నేను ఒక ఆర్మీ కుటుంబంలో పెరిగాను. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ భ‌యంతో నిజానికి వెన్ను చూప‌ను అని చెప్పుకొచ్చింది ప్రీతి. దీంతో ఆమెను అంద‌రూ రియ‌ల్ హీరో అని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.


అంతేకాదు.. న‌టిగా అంద‌రికీ సుప‌రిచితురాలైన ప్రీతి మంచి కాల‌మ్ రైట‌ర్ కూడా! ఓ ప్ర‌ముఖ న్యూస్ వెబ్ సైట్లో ప్రత్యేకించి ఒక కాల‌మ్ రాసేది. అలాగే మ‌హిళ‌ల‌కు సంబంధించిన ప్ర‌ధాన స‌మ‌స్య‌లైన మాన‌వ అక్ర‌మ ర‌వాణా, భ్రూణ హ‌త్య‌లు.. వంటి వాటిపై జ‌రిగే పోరాటాల్లో త‌ను కూడా భాగ‌మ‌య్యేది. అంద‌రిలోనూ అవ‌గాహ‌న క‌లిగించేందుకు త‌న వంతు పాత్ర పోషించేంది. ఇన్ని కోణాలు ఉన్న ఆమెలో ఒక వ్యాపార‌వేత్త కూడా ఉంద‌న్న విష‌యం 2008లో అంద‌రికీ తెలిసింది.


ఐపీఎల్ (IPL)లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలవెన్ (Kings XI Punjab) జట్టుకి ఫ్రాంచైజీగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్రారంభించిన ఆమె ఇప్ప‌టికీ దానిని కొన‌సాగిస్తోంది. అంతేకాదు.. 2017లో సౌతాఫ్రికా (South Africa)లో జ‌రిగిన టీ20 లీగ్‌కు సంబంధించి కూడా ఒక జ‌ట్టుని ఆమె కొనుగోలు చేసింది. అలాగ‌ని త‌న‌లోని న‌టికి ఆమె బై చెప్ప‌లేదు. గ‌తేడాది "భాయ్ జీ సూప‌ర్ హిట్" సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.


ఇక ఆమె వ్య‌క్తిగత జీవిత విష‌యానికి వ‌స్తే 2016లో ఫిబ్ర‌వ‌రి 29న అమెరికాకు చెందిన జీనీ గుడ్ఇన‌ఫ్ (Gene Goodenough)ను వివాహ‌మాడింది. ఇటు సినిమాలు, అటు క్రీడ‌ల వ్య‌వ‌హారాల‌తో బిజీగా గ‌డుపుతోన్న ఈ సొట్ట‌బుగ్గల సుంద‌రి నేడు త‌న 43వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా POPxo త‌ర‌ఫున మ‌నమంతా కూడా ఆమెకు బ‌ర్త్ డే విషెస్ చెప్పేద్దామా..


హ్యాపీ బ‌ర్త్ డే ప్రీతీ..!


Images: Instagram/Preity Zinta


ఇవి కూడా చ‌ద‌వండి


 


టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం..!


తండ్రికి త‌గిన త‌న‌య‌.. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అనిపించుకున్న శృతీ హాసన్..!


శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?