రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma)- ఈ మధ్యకాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ప్రముఖ దర్శకుడు. మునుపటి రోజుల్లో ఈయన రూపొందించిన సినిమాలు, వాటికి సంబంధించిన విశేషాల ద్వారా వార్తల్లో ఉంటే; ప‌్రస్తుతం మాత్రం ఆయన సామాజిక మాధ్యమాల్లో చేసే ట్వీట్స్‌తో సెన్సేషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ టాపిక్స్ లో భాగం అవుతున్నారు.
మొన్నటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ (Lakshmis NTR) సినిమాకు సంబంధించిన పాత్రల్లో నటిస్తోన్న పలువురు నటులను సామాజిక మాధ్యమాల వేదికగా అందరికీ పరిచయం చేసిన ఆర్జీవీ తాజాగా మరో నాలుగు ఫొటోలను అందరితోనూ పంచుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన ఆ వర్కింగ్ స్టిల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వాటిలో ఒకటి పార్టీ అంతర్గత సమావేశానికి సంబంధించిన స్టిల్ కాగా; మరొక దానిలో ఎన్టీఆర్ (NTR), చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కనిపిస్తున్నారు. ఇంకొక రెండు స్టిల్స్‌లో లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi), ఎన్టీఆర్ (NTR) కనిపిస్తున్నారు.
ఆర్జీవీ ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తున్నట్లు ప్రకటించింది మొదలు ఆ సినిమాపై చిత్రసీమలో ఎన్నో వార్తలు వినిపించాయి. వినిపిస్తున్నాయి కూడా! కేవలం పబ్లిసిటీ కోసమే వర్మ ఇలా ప్రకటిస్తున్నారు తప్ప వాటిలో వాస్తవం లేదని కొందరు వాపోతే; ఆ ప్రకటనలు కేవలం మాటలకే పరిమితం అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. కానీ కొద్ది రోజుల క్రితం సినిమాలో పలు పాత్రల్లో నటిస్తోన్న నటీనటుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం ద్వారా సినిమా గురించి అందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ.
అయినప్పటికీ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరగడం లేదని, కేవలం ప్రచారం కోసమే ఫొటోలను విడుదల చేస్తున్నారని కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయట! బహుశా అందుకే.. ఆర్జీవీ వీటికి కూడా క్లారిటీ ఇవ్వాలని భావించారేమో..! సడెన్‌గా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన నాలుగు వర్కింగ్ స్టిల్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వర్మ షేర్ చేసిన కాసేపటికే ఇవి వైరల్ అవ్వడమే కాదు.. నెటిజెన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి.
ఈ సినిమాలో భాగంగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది? అనే అంశానికి వెండితెరపై దృశ్యరూపం ఇవ్వనున్నాడు వర్మ. తాజాగా విడుదల చేసిన స్టిల్స్ చూస్తుంటే ఇది ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తోన్నట్లు అనిపిస్తోందంటున్నాయి సినీవర్గాలు. ఎన్టీఆర్ జీవితంలోని మలుపులను వర్మ తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై ప్రదర్శించనున్నాడు అంటున్నారు ఆయన అభిమానులు. ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి వచ్చే ప్రతి అప్ డేట్ ఆ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి.
కథకు కీలకమైన లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టిని తీసుకోగా; ఎన్టీఆర్ పాత్ర కోసం మాత్రం ఒక రంగస్థల నటుడిని ఎంపిక చేసుకున్నారు ఆర్జీవీ. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారంతా తెలుగు చిత్రసీమకు కొత్తవారే అని చెప్పవచ్చు.
ఇక క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) విడుదల కావడం, ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు సంపాదించుకోవడం జరిగింది. ఇది హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో దీనికి కొనసాగింపుగా వచ్చే రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు (NTR Mahanaykudu) సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ కథాకథనాలకు భిన్నంగా ఉంటుందన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై కూడా సినీ అభిమానుల్లో అంచనాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మరి, వర్మ ఆ అంచనాలను అందుకుంటాడా?? మొదటి నుంచీ చెబుతున్నట్లు ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత ఎవరికీ తెలియని నిజాలను ఆయన బయటపెడతారా?? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే!
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ (kalyani Malik) స్వరాలు అందిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తారన్న అంశంపై మాత్రం రామ్ గోపాల్ వర్మ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి
రాణీ లక్ష్మీబాయి పాత్రకు వన్నె తెచ్చిన.. కంగనా రనౌత్ చిత్రం “మణికర్ణిక” (సినిమా రివ్యూ)
“లక్ష్మీస్ ఎన్టీఆర్” హీరోయిన్ యజ్ఞ శెట్టి గురించి.. ఎవరికీ తెలియని విషయాలివే..!