హైదరాబాద్ (Hyderabad) అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఇక్కడ సందర్శించదగిన ప్రాంతాలతో పాటు నోరూరించే రుచులు కూడా. ముఖ్యంగా ఘుమఘుమలాడే బిర్యానీ (Hyderabadi Biryani), హలీమ్ (Haleem), షాహీ తుక్డా, షీర్ ఖుర్మా.. ఇలా ఈ వంటకాల పేర్లు చెబుతూ పోతే ఆ లిస్ట్ చాంతాడంత అవుతుంది. అయితే ఈ వంటకాలను కాస్త గమనిస్తే హైదరాబాద్‌ని పరిపాలించిన నిజాం రాజుల ముద్ర తప్పకుండా కనిపిస్తుంది. ఇరానీ ఛాయ్ (Irani Chai), ఉస్మానియా బిస్కట్ (Osmania Biscuit), నెయ్యితో నిండి ఉండే హైదరాబాదీ కిచిడీ.. ఇవన్నీ ఇందుకు నిదర్శనాలే!
కాలక్రమేణా కొన్ని ప్రదేశాలు, సంస్కృతులు ఎలా అయితే కనుమరుగైపోతూ ఉంటాయో.. ఒక ప్రాంతానికి చెందిన రుచులు కూడా అలానే కనుమరుగైపోతూ ఉంటాయి. హైదరాబాదీ వంటకాలకు సంబంధించిన ఈ జాబితాలో అనోఖి ఖీర్ (Anokhi Kheer) కూడా ఒకటి. పేరులానే ఈ వంటకం కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
సాధారణంగా పాయసం అంటే ఎవరైనా బియ్యంతో తయారు చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా ఉల్లిపాయలతో తయారు చేసిన పాయసం గురించి విన్నారా? ఇది చాలా రుచిగా కూడా ఉంటుందట! నిజాంల నాటి కాలంలో ఈ వంటకాన్ని ప్రజలు రోజూ తమ ఆహారంలో భాగంగా తీసుకునేవారట! కానీ కాలక్రమేణా ఈ వంటకం కనుమరుగైపోయి, ఇప్పుడు ఈ వంటకం గురించి తెలిసిన వారు చాలా అరుదనే చెప్పాలి.
మరి, ఇంతటి ప్రత్యేకమైన ఈ రెసిపీ గురించి నాకెలా తెలిసిందానా మీ సందేహం? ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ (International Sweet Festival)కు వెళ్లినప్పుడు నేను దీన్ని చూశా. అప్పటివరకు ఇలాంటి ఒక స్వీట్ ఇంతకుముందు హైదరాబాద్‌లో తయారు చేసుకునేవారని, ఇప్పుడు దాని గురించి తెలిసిన వారు చాలా అరుదని తెలిసింది. అందుకే ఆ స్పెషల్ రెసిపీ గురించి మీ అందరితో పంచుకోవాలని భావించి ఇలా మీ ముందుకు వచ్చా.
ఇంతకీ ఈ పాయసానికి అనోఖి ఖీర్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా?? అనోఖి అంటే చాలా ప్రత్యేకమైన అని అర్థం. ఆంగ్లంలో అయితే దీనిని యునీక్ అంటారు. ఈ వంటకాన్ని తెలుపు రంగు ఉల్లిపాయలతో భిన్నంగా తయారుచేస్తారు కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. మరి, ఈ స్పెషల్ స్వీట్ తయారీ ఎలాగో మనమూ చూసేద్దామా..
* ముందుగా స్టవ్ పై అరలీటర్ పాలు పెట్టి బాగా మరిగించాలి. ఆ తర్వాత వాటిని కిందకు దింపి పక్కన పెట్టుకోవాలి.
* ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఒక చెంచా నెయ్యి వేసి 10 – 15 జీడిపప్పులు (Cashews) & కిస్మిస్ (Rasins)లను అందులో దోరగా వేయించుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి.
* ఇప్పుడు రెండు తెల్లని ఉల్లిపాయలు (White Onions) తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. ఇవి మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేయాలి. వాటిని 5 నిమిషాల వరకు ఆ నీటిలో ఉడికించిన తర్వాత ఒక జల్లెడలో వేసి నీటిని వడకట్టుకోవాలి.
* మళ్లీ స్టవ్ పై గిన్నె పెట్టి మరోసారి గ్లాసు నీళ్లు వేసి మరిగించాలి. నీటిని వడకట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఈ నీళ్లలో మరోసారి వేసి ఇంకో 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు వాటిని మరోసారి జల్లెడపై వేసి నీటిని వడకట్టాలి. అనంతరం మరొక గ్లాసు చల్లని నీటిని వాటిపై పోసి శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉల్లిపాయలో ఉండే ఘాటు, వాసన తొలగిపోతాయి.
* ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక చెంచా నెయ్యి వేసి అందులో మనం నీటిలో ఉడికించుకున్న ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి. రెండు, మూడు నిమిషాలు ఈ ముద్దను వేయించిన తర్వాత అందులో నాలుగు చెంచాల చక్కెర వేసి బాగా కలపాలి.
* చక్కెర కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కాచి, చల్లార్చిన పాలను ఇందులో వేసుకోవాలి. ఉల్లి తురుము ముద్ద పాలల్లో కలిసిపోయేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఇవి ఉడికిన తర్వాత అందులో నాలుగు చెంచాల కోవా వేసి.. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
* ఈ మిశ్రమాన్ని కాసేపు మరిగించిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను ఇందులో వేసి మరొక ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
* చివరిగా ఈ మిశ్రమంలో యాలకుల పొడి (Cardamom Powder) కాస్త వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే.. నోరూరించే కమ్మని అనోఖి ఖీర్ రడీ అయిపోయినట్లే! దీనిని ఆనియన్ ఖీర్ (Onion Kheer) అని కూడా పిలవచ్చు. దీనిని వేడిగా లేదా చల్లగా ఎలా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది.
చూశారుగా.. మన హైదరాబాదీ స్పెషల్ వంటకం అయిన అనోఖి ఖీర్ తయారీ గురించి.. మీరు కూడా ఈ వంటకాన్ని ఓసారి ట్రై చేసి, మీకు నచ్చినవారికి తినిపించండి.
రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం మేం చేస్తాం…
Featured Image: https://www.facebook.com/JewelofNizam
ఇవి కూడా చదవండి
గండికోట – ది ఇండియన్ గ్రాండ్ కాన్యన్ .. ఈ ప్రదేశాన్ని అందరూ చూసి తీరాల్సిందే..!
ఇరానీ ఛాయ్ – కేర్ అఫ్ హైదరాబాద్