ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా చందమామ కథలు (Chandamama Kathalu), బాలమిత్ర (Balamitra), పెద్ద బాలశిక్ష (Pedda balasiksha).. వంటి పుస్తకాలు ఎక్కువగా కనిపించేవి. మరి, ఇప్పుడు పాఠ్యపుస్తకాల తర్వాత పిల్లల చేతుల్లో ఎక్కువగా కనిపిస్తున్నవి స్మార్ట్ ఫోన్లే. ఇంకా చెప్పాలంటే పుస్తకాలు సైతం పక్కన పెట్టి మరీ ఫోన్‌లో ఆడుకునేందుకు, నచ్చిన వీడియోలు చూసేందుకు అమితంగా ఆసక్తి చూపిస్తున్నారు నేటి తరం పిల్లలు. మరి, ఇలాంటి వారిలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచడం ఎలా? అని ఆలోచించారు శాన్ ఫ్రాన్సిస్కో (San Fransico)కు చెందిన ఒలీవియా రక్షిత్ (Olivia Rakshith). ఆమె ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన స్టార్టప్ పేరే కామిక్ ఫ్లిక్స్ (ComicFlix).
ఇంతకీ ఏంటీ సంస్థ? ఇది ఏం చేస్తుందనే కదా మీ సందేహం?? అక్కడికే వస్తున్నామండీ.. పిల్లలు ఎంతో ఆసక్తి చూపించే చిత్రాలు, సీరియల్స్.. వంటి వాటిని ఓ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సహాయంతో డిజిటల్ కామిక్ బుక్స్‌గా మారుస్తోన్న సంస్థ కామిక్ ఫ్లిక్స్. దీనిని ఒలీవియా రక్షిత్ అనే మహిళ ప్రారంభించారు. పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచడమే ఈ స్టార్టప్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థను ఆమె రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. పుస్తకాలు చదవడం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తే ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగేలా చేసిందని చెప్పచ్చు. అయితే ఈ తరం పిల్లలు పుస్తకాలు చదవడం కంటే వీడియోలు వంటివి ఎక్కువగా చూడడం ఆమె గమనించారు. మరి, ఆ వీడియో రూపంలో ఉన్న సినిమాలు, సీరియల్స్‌నే పిల్లలకు కామిక్స్ రూపంలో పుస్తకాలుగా మార్చి ఇస్తే తప్పకుండా చదువుతారు కదా అనే ఆలోచనతో ఆమె ఈ స్టార్టప్‌ను మొదలుపెట్టారు.
అయితే ఈ గ్రాఫికల్ కామిక్ బుక్స్ రూపొందించేందుకు ఆయా సినిమా లేదా సీరియల్స్ లోని క్యారెక్టర్స్‌ను కామిక్ రూపంలో మార్చుకోవాలి. కథను పూర్తిగా చదివి పిల్లలకు అర్థమయ్యే రీతిలో కథను పుస్తకానికి అనుగుణంగా కుదించగలగాలి. సాధారణంగా అయితే ఈ పనులన్నీ మాన్యుయల్‌గా చేయడానికి చాలా సమయమే పడుతుంది. కానీ ఒలీవియా దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్‌ను తయారు చేశారు. దీని ద్వారా ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేయడమే కాకుండా కామిక్ పుస్తకాన్ని సైతం సిద్ధం చేసేయచ్చంటారామె. పైగా ఈ మొత్తం ప్రాసెస్ కోసం దాదాపు రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందంతే! ఇంత తక్కువ సమయంలో ఒక సినిమా లేదా సీరియల్‌ను కామిక్ బుక్‌గా మార్చే సాఫ్ట్ వేర్ బహుశా ఈ ప్రపంచంలో తన వద్దే ఉందేమో అంటారు ఒలీవియా.
అలా ఆలోచన వచ్చిందే తడవుగా ఓ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ రూపొందించిన.. ఆమె దాని ద్వారా తయారు చేసిన రెండు పుస్తకాలను మొదట తన పిల్లలకు ఇచ్చి చదవమని వారిపైనే ప్రయోగించారు. వాళ్లు కూడా ఆ కామిక్ బుక్స్ చదివేందుకు బాగా ఆసక్తి చూపి, వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ తర్వాతే రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు ఒలీవియా. మరి, ఎందుకు ప్రత్యేకించి సినిమాలు, సీరియల్స్.. వంటి కథలనే ఎంచుకుంటున్నారు అని ఆమెను ఎవరైనా అడిగితే.. పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపే అంశాలనే వారికి బొమ్మల రూపంలో పుస్తకాల ద్వారా అందిస్తే వారు చదివేది ఎంజాయ్ చేస్తూనే పుస్తక పఠనం పట్ల క్రమంగా ఆకర్షితులవుతారు అంటారామె.
Image: Robot (Comicflix.com)
అంతేకాదు.. ఒలీవియా రూపొందించే ఈ పుస్తకాలు కేవలం ఒకటి లేదా రెండు భాషల్లోనే లభ్యమవుతున్నాయని మీరనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే ఒక్కసారి కథను కామిక్స్ రూపంలోకి మార్చాక ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వీటిని పుస్తకాలుగా ప్రచురించే విధంగా సాఫ్ట్ వేర్ డెవలప్ చేశారు ఒలీవియా. దాని ద్వారా దాదాపు రెండున్నర గంటల నిడివి ఉండే కథను సుమారు 22 పేజీల పుస్తకంగా మార్చేస్తారు.
శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేస్తోన్న ఈ కామిక్ ఫ్లిక్స్ సంస్థ ఇటీవలే హైదరాబాద్‌లో కూడా తన కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభించింది. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి అయిన సురేష్ ప్రొడక్షన్ వారి యాంట్ హిల్ స్టూడియో (Ant hill Studio)తో కలిసి పని చేయడం ప్రారంభించిందీ సంస్థ. వీరి సహాయంతో కామిక్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పటి వరకు దాదాపు 40 కాన్సెప్ట్స్ సిద్ధం చేసింది. ఈ సంస్థ ఇప్పటివరకు రూపొందించిన కామిక్ బుక్స్‌లో నందమూరి తారక రామారావు (NTR) నటించిన ‘జస్టిస్ చౌదరి’, రజినీకాంత్ (Rajinikanth) నటించిన ‘ముత్తు’, ‘రోబో’, ‘అవతార్’, రానా (Rana) నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో పాటు ‘మాయాబజార్’ వంటి పౌరాణికాలు, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోని సైతం కామిక్ బుక్స్‌గా మార్చారు.
Image: Maya Bazar (Comicflix.com)
ఇప్పటివరకు వారికి లైసెన్స్ లభించిన కథలను మాత్రమే ఈ సంస్థ పుస్తకాలుగా మలిచింది. అయితే భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు సైతం లేకపోలేవు. ఎందుకంటే ఒక్కసారి సినిమా విడుదలైన తర్వాత కొంత కాలానికి నిర్మాతకు ఆ వీడియోతో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ దానిని ఇలా పుస్తక రూపంలో ప్రచురించడం వల్ల వాటి ద్వారా కూడా వారికి ఆర్థికంగా ఎంతో కొంత ప్రయోజనం ఉండే అవకాశాలు ఉంటాయి. అదీకాకుండా ఈ సంస్థ వారు సైతం రానున్న రోజుల్లో సొంతంగా కథలు రాసుకొని వాటిని కూడా పుస్తకాలుగా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట!
ఈ సంస్థ టీంలో ఇప్పటి వరకు టెక్నాలజిస్ట్‌లు, ఆర్టిస్ట్స్, స్టోరీ టెల్లర్స్, అడ్వైజర్స్ భాగంగా ఉన్నారు. వీరంతా సమన్వయంతో కలిసి పని చేసి ఈ కామిక్ పుస్తకాలను మన ముందుకు తీసుకొస్తున్నారు. కామిక్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి పని చేస్తోన్న సంస్థల జాబితాలో కేవలం సురేష్ ప్రొడక్షన్స్ ఒక్కటే కాదు.. కమల్ హాసన్‌కి చెందిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ (RaajKamal Films International), షీమారో (Sheemaroo), వయాకామ్ 18 (Viacom 18) & ఐటీసీ ఇన్ఫోటెక్ (ITC Infotech) వంటి సంస్థలు కూడా ఉన్నాయి.
ఒలీవియా ప్రారంభించిన ఈ గ్రాఫిక్ నావెల్స్ కు ప్రస్తుతం ఇండియాలో కూడా మార్కెట్ బాగానే ఉంది. అందుకే భవిష్యత్తులో మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా పని చేసే విధంగా తమ కార్యాచరణ ఉండనుంది అంటారామె. ఏదైతేనేం.. కనీసం ఈ రూపంలోనైనా పిల్లలు పట్టుమని కాసేపు ఒక దగ్గర కూర్చొని ఇష్టంగా పుస్తకం చదివితే అదే పదివేలు. ఇదే క్రమంగా వారికి పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుతుంది. వారిలో వచ్చే ఈ మార్పు అన్ని విధాలా ప్రయోజనమే కదా! అందుకే ఈ సంస్థ నుంచి మరిన్ని గ్రాఫిక్ నావెల్స్ మనకు అందుబాటులోకి రావాలని, అవి పిల్లలను బాగా ఆకర్షించాలని కోరుకుందాం..
Featured Image: Comicflix.com
ఇవి కూడా చదవండి
“తాజ్ మహోత్సవ్” ఎందుకు అంత ప్రత్యేకమంటే..?
మాటల్లోనే కాదు.. మనసులోనూ సుమ కనకాల మాణిక్యమే..!
హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!