ఇంకొక 10-15 రోజుల్లో ఎండాకాలం మొదలు కాబోతుంది. నిత్యం రద్దీగా ఉండే మన హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఆ ఎండ నుండి కాస్త సేదతీరడానికి సామాన్యుడికి.. ఒక ఒయాసిస్‌లా కనిపించేదే మన “హైదరాబాద్ కి షాన్ ” – ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ (Famous Ice Cream Parlour). హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న మొజామ్ జాహి మార్కెట్ ఏరియాలో (Moazzam Jahi Market) ఉండే ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్‌కి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.
దాదాపు 65 ఏళ్ళ క్రితం మొహమ్మద్ హలీమ్ (Mohammed Haleem) అనే వ్యక్తి మొజామ్ జాహి మార్కెట్లో ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ పేరుతో ఓ షాపును ప్రారంభించారు. ఎటువంటి రసాయనాలు లేదా కలర్స్ వాడకుండా.. స్వయంగా చేతితో చేసే హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ తయారుచేయడమే ఈ పార్లర్ ప్రత్యేకత. ఇప్పటికి కూడా ఆయన వారసులు ఈ దుకాణాన్ని అదే పద్ధతిలో కొనసాగిస్తూ ఎప్పటిలాగే హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు.
ప్రస్తుత ధరల ప్రకారం ఈ పార్లర్లో స్కూప్ ఐస్ క్రీమ్ కేవలం రూ.15 మాత్రమే అంటే షాక్ అవ్వాల్సిందే. నేడు హైదరాబాద్ జంట నగరాలతో పాటు.. సిటీలోనే అనేక చోట్ల పలురకాల ఐస్ క్రీమ్ సెంటర్స్ వచ్చినప్పటికీ.. ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్‌కి ఉండే ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు అన్నది నిర్వివాదాంశం. దీనికి ముఖ్య కారణమేంటి అంటే – ఇక్కడ సీజన్‌కి తగ్గట్టుగా దొరికే పండ్లతో తయారుచేసే ఐస్ క్రీమ్స్ లభ్యమవుతుండడం. అవి కూడా అత్యంత సహజంగా ఎటువంటి కలర్స్ లేదా షుగర్ కోటెడ్ మిశ్రమాలు కలపకుండా తయారవ్వడం. అలాగే ఈ పార్లర్లో ఇతర ఐస్ క్రీమ్ పార్లర్స్‌తో పోలిస్తే ధరలు చాలా వెసులుబాటుగా ఉండటం కూడా ఈ షాపు సక్సెస్‌కి ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
ఇక్కడ దొరికే ఐస్ క్రీమ్స్‌లలో ప్రధానంగా మ్యాంగో ఐస్ క్రీమ్ (Mango Ice Cream)కి మంచి ఆదరణ ఉంది. ఆ ఐస్ క్రీమ్ రుచి చూస్తే.. అచ్ఛం మామిడిపండు తిన్న అనుభవం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. వేసవి కాలంలో అయితే ఈ దుకాణం వద్ద ప్రజల తాకిడి విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా వేసవి సెలవుల్లో హైదరాబాద్‌లో ఉండే వారు లేదా సెలవులకి నగరానికి వచ్చేవారు.. హైదరాబాద్ ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ రుచి చూడాల్సిందే.
ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్‌కి వచ్చే కస్టమర్లలో ఎక్కువమంది చిరు వ్యాపారస్తులతో పాటు.. రోజు వారి పనులు చేసుకొనేవారు కూడా ఉండడం విశేషం. అత్యంత తక్కువ ధరల్లో వేసవి తాపాన్ని ఈ పార్లరులోని ఐస్‌క్రీమ్ తీర్చడమే అందుకు ప్రధాన కారణం. అలాగని.. ఈ పార్లరుకి దిగువ, మధ్యతరగతి కస్టమర్లే వస్తారనుకుంటే పొరపాటే. అనేకమంది బిగ్ షాట్స్ & సెలబ్రిటీలు కూడా ఈ ఫేమస్ ఐస్ క్రీమ్‌కి ఫ్యాన్స్ అయ్యారంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
సంవత్సరం పొడువునా ఇక్కడ ఐస్ క్రీమ్ విక్రయం జరిగినా.. ప్రధానంగా వేసవి కాలం & రంజాన్ సీజన్లలో ఇక్కడ దొరికే ఫ్లేవర్స్ అత్యంత రుచికరంగా & మధురంగా ఉంటాయి. దాదాపు రూ. 15 నుండి మొదలై రూ. 200 ధర వరకూ ఇక్కడ ఐస్ క్రీములు లభిస్తాయి. అందుకే హైదరాబాద్‌లోని బెస్ట్ ఫుడ్ స్పాట్స్‌లో ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ ఒకటిగా ఎప్పటికి నిలిచిపోతుంది.
ఇక ఈ ఫేమస్ పార్లర్ పక్కనే మరికొన్ని షాపులు కూడా ఐస్ క్రీమ్ వ్యాపారంలో బాగా రాణిస్తున్నాయి. గఫుర్ & షా పార్లర్స్ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఐస్ క్రీమ్‌ని తయారుచేస్తూ.. కస్టమర్ల తాకిడితో కిటకిటలాడుతున్నాయి.
హైదరాబాద్ మధ్యలో రోడ్డు పక్కనే దాదాపు ఒక 50 నుండి 70 ప్లాస్టిక్ టేబుల్స్ & చైర్స్ మధ్య.. మన కుటుంబ సభ్యులతో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటే వచ్చే ఆ మజానే వేరు కదా. హైదరాబాద్ పార్లర్స్ నుండి బెంగళూరు (Bengaluru) & ముంబై (Mumbai)కి ఐస్ క్రీములు పార్సిల్స్ కూడా వెళతాయంటే వీటి రేంజ్ ఏంటో అర్థమైపోతుంది కదూ!!
హైదరాబాద్ వస్తే.. ఒక్కసారైనా రుచి చూడాల్సిన ఐస్ క్రీమ్ ఫేమస్ ఐస్ క్రీమ్ అని ఇట్టే చెప్పేయవచ్చు.
ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ వద్ద దొరికే ఫ్లేవర్స్‌తో పాటు స్పెషల్ ఐస్ క్రీమ్ వివరాలు ఈ క్రింద చదవచ్చు –
* మ్యాంగో
* చీకు – సపోటా
* కస్టర్డ్ యాపిల్
* అంజీర్
* మస్క్ మిలన్
* డ్రై ఫ్రూట్
* బాదాం
* కసాటా
* డబల్ చాకోలెట్
* రాజ్ భోక్
* కుల్ఫీ
* హనీమూన్
* న్యాచురల్ ఐస్ క్రీమ్
* థండర్ బాల్ – మిక్స్ డ్రై ఫ్రూట్
* టూటీ ఫ్రూటీ
* బటర్ స్కాచ్ , డ్రై ఫ్రూట్ , వెనిలా – ఫేమస్ ఐస్ క్రీమ్
* చాకోలెట్ బ్లాస్ట్
* ఫైవ్ స్కూప్
* సండే డార్క్ చాక్లెట్
* కుండ ఐస్ క్రీమ్
Featured Image: Trip Advisor, Zomoto
ఇవి కూడా చదవండి
మెట్రో రైల్.. హైదరాబాదుకి ఒక వరం