బ్రేకప్(Breakup).. ప్రతిఒక్కరి జీవితంలోనూ ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదేమో.. మనసారా ఇష్టపడిన వ్యక్తి వివిధ కారణాల వల్ల దూరమైతే తట్టుకోలేని బాధ కలుగుతుంది. అయితే ఈ బాధలో ఉన్నప్పుడు వాలెంటైన్స్ డే (Valentines day) లాంటి ప్రత్యేకమైన రోజు వస్తే అది ఇంకా బాధని కలిగిస్తుంది.
ప్రపంచమంతా ప్రేమలో మునిగితేలుతుంటే మనం ప్రేమించిన వ్యక్తి జ్ఞాపకాల్లో మునిగి బాధపడుతూ కూర్చుంటాం. ఆ రోజు ఎక్కడికి వెళ్లినా ఆనందంలో ఉన్న జంటలు కనిపిస్తుంటే.. ఎలాగైనా అవతలి వ్యక్తితో మాట్లాడాలని ప్రయత్నించడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగకుండా.. మీరూ బాధపడకుండా ఈ వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా జరుపుకొనే వీలుందని మీకు తెలుసా? మరి, దానికోసం ఏం చేయాలంటే..
1. కమ్యూనికేషన్ కట్ చేయండి
మీకు ఇటీవలే బ్రేకప్ అయ్యి ఉంటే మీ బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్ షిప్ పూర్తిగా కట్ చేయండి. దీనికోసం ఫోన్‌లో తన నంబర్ డిలీట్ చేయడం లేదా బ్లాక్ చేయడం, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అకౌంట్లలో తనని బ్లాక్, అన్ ఫ్రెండ్, అన్‌ఫాలో చేయడం మంచిది. దీనివల్ల మీకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా.. మానసికంగా మాత్రం కాస్త ఆనందం కలుగుతుంది. అంతేకాదు.. ఎప్పుడైనా బాగా ఎమోషనల్‌గా ఫీలైనప్పుడు తిరిగి మాట్లాడాలని అనిపించినా దానికి వీలుండదు. అంతేకాదు.. ఆ వ్యక్తిని గుర్తుచేసే వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే వాటిని కూడా తీసి పారేయండి. దీనివల్ల తన జ్ఞాపకాలను దూరం చేసుకొని ఆనందంగా జీవించే వీలుంటుంది.
2. స్నేహితులతో ఎంజాయ్ చేయండి.
వాలెంటైన్స్ డే.. అనగానే ప్రేమికులు, పెళ్లైన జంటలు ఆనందంగా గడుపుతూ ఉంటారు. వారిని చూసి మనకూ ఓ జంట ఉంటే ఎంత బాగుండు అనుకోవడం సహజం. అయితే ఇలా ఒత్తిడికి గురై బాధపడడం లేదా బాధపెట్టే బంధాల్లోకి అడుగుపెట్టడం వల్ల అప్పుడు ఆనందంగానే ఫీలైనా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే వాలెంటైన్స్ డేని మీలా సింగిల్‌గా ఉన్న స్నేహితులతో ఎంజాయ్ చేయండి. ఆ రోజు గర్ల్స్ నైట్ అవుట్ లాంటివి ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల మీరే కాదు.. వారూ అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండేందుకు వీలుంటుంది. వీలైతే ఎక్కడైనా కారయోకీ, బార్, నైట్ క్లబ్.. ఇవేవీ కుదరకపోతే ఇంట్లోనే పార్టీ చేసుకోండి. చక్కగా నచ్చినవి తింటూ, తాగుతూ సంగీతానికి స్టెప్పులేస్తూ ఆనందంగా గడపండి.
3. ఐ లవ్ మీ అని చెప్పండి..
సాధారణంగా ఇప్పటివరకూ వాలెంటైన్స్ డేకి “ఐ లవ్ యూ” అని చెప్పడం అలవాటైపోయి ఉంటుంది. అయితే ఇతరులను ప్రేమించడంలో మునిగిపోయి మనల్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోతున్నాం. అందుకే ఈ వాలంటైన్స్ డేకి “ఐ లవ్ మీ” అని చెప్పుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటివరకూ తనకి మీరు నచ్చకపోవడానికో.. లేక తను మిమ్మల్ని మోసం చేయడానికో మీరే కారణమని మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ గడిపి ఉండవచ్చు. కానీ ఎవరి ఫీలింగ్స్, ఎవరి ప్రవర్తన వారి సొంతం. ఇతరుల భావాలకు మీరు బాధ్యులు కారని గుర్తుచేసుకోండి. మీరెలా ఉన్నారో అలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అంతేకాదు.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి చక్కటి రిలాక్సింగ్ స్నానం లేదా స్పా ట్రీట్‌మెంట్ లాంటివి మీకు మీరు అందించుకోండి.
4. మీకోసం చక్కటి బహుమతి..
ప్రతి వాలెంటైన్స్ డేకి ఇతరులకు బహుమతులు కొంటూ డబ్బులు వృథా చేస్తున్నారే తప్ప మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రేమించుకున్నారా? మీకు మీరే గిఫ్టులు అందించుకున్నారా? లేదు కదా.. ఆ పని ఇప్పుడు చేయండి. మీకు మీరే బహుమతులు అందించుకోండి. అది మీరు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న ఖరీదైన బహుమతో.. లేదా ఎప్పటినుంచో వెళ్లాలనుకుంటున్న లగ్జరీ టూరో.. ఇలా ఏదో ఒకటి మీకు మీరే బహుమతిగా అందించుకోండి.. దీనివల్ల మీకు మీరే సంతోషాన్ని అందించుకోవడంతో పాటు మీ జీవితంలో బహుమతులు అందించే వ్యక్తులు లేరని బాధపడే వీలు లేకుండా చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి.
బ్రేకప్ తర్వాత.. ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బందే మరి!
మేజర్ శశిధరన్ విజయ్ నాయర్ జంట ప్రేమకథ వింటే.. మీరూ కంటతడిపెడతారు..!
మంచి హాలీడేని ఎంజాయ్ చేయాలంటే.. ముస్సోరీ ట్రిప్‌ని ప్లాన్ చేసేయండి..!