మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీపరిశ్రమలో టాప్ హీరోగా ఎన్నో హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు. 2007లో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో నటించిన తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో.. ఆయన మళ్లీ మేకప్ వేసుకోవడానికి దాదాపు పదేళ్ల సమయం పట్టింది. అలా 2017లో ఖైదీ నెం: 150తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్. ఈలోగా రామ్చరణ్ నటించిన మగధీర, బ్రూస్ లీ చిత్రాల్లో అతిథిగా మెరిసిన విషయం విదితమే.
ప్రస్తుతం మరో మెస్మరైజింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు మెగాస్టార్. స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తోన్న సైరా (Sye raa) చిత్రంతో సినీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి పాత్రలకు చెందిన వార్తలు అప్పుడప్పుడూ విడుదల చేస్తూ వచ్చిందీ చిత్రబృందం. అయితే సైరాలో మరో నవ నాయిక కూడా మెరవనుందంటూ గత కొద్దిరోజులుగా చిత్రసీమలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ కథాకమామీషేంటంటే..
మెగా కుటుంబం నుంచి ఇప్పటివరకు వారసులుగా ఎంతో మంది హీరోలు వెండితెరకు పరిచయమై ఎవరి శైలిలో వారు సత్తా చాటుతోన్న విషయం విదితమే. అలాగే మెగా కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన కథానాయిక నిహారిక కొణిదెల (Niharika Konidela). బుల్లితెరపై వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత పలు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. వెండితెరపై 2016లో “ఒక మనసు” చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత “హ్యాపీ వెడ్డింగ్” చిత్రంలో నటించినప్పటికీ ఇది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన తదుపరి చిత్రమైన “సూర్యకాంతం” పైనే దృష్టి సారిస్తోంది.
అయితే చిత్రసీమలో తాజాగా వినిపిస్తోన్న వార్తల ప్రకారం నిహారిక కూడా సైరా చిత్రంలో ఒక పాత్రలో మెరవనుందట! ఒక సన్నివేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారి చేతులకు చిక్కకుండా నిహారిక పాత్ర ఆయన్ని రక్షిస్తుందని ఈ వార్తల సారాంశం. అయితే ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర అని కూడా కొందరు ఊహిస్తున్నారు. ఈ వార్తలు ఇప్పటికే ప్రాచుర్యం పొందినప్పటికీ సినీబృందం లేదా మెగాఫ్యామిలీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. అలాగని ఈ వార్తలను ఖండించలేదు.
కథానాయికగా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఇలాంటి కీలక పాత్రలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకోవడం నిహారికకు తప్పకుండా కలిసి వస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక సైరా చిత్రం విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా; సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో రెండు భారీ షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న సైరా ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. దాదాపు రూ.150కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒక్క జార్జియా షెడ్యూల్ కే సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేశారట!
సైరాకు కేవలం బడ్జెట్ మాత్రమే భారీ కాదు.. తారాగణం కూడా భారీనే! ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), సుదీప్ (Sudeep), జగపతి బాబు (Jagaapthi Babu) తో పాటుగా నాయికలుగా నయనతార (Nayanthara) & తమన్నా (Tamannaah)ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో నిహారిక కొణిదెల కూడా చేరనుంది. అలాగే ఇది 1850ల కాలం నాటికి చెందిన కథ కాబట్టి అప్పటి పరిస్థితులు, వాతావరణాన్ని తెరపై చూపించేందుకు సాంకేతిక వర్గం కూడా కష్టపడి పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా తన మార్క్ చూపిస్తారని ఇప్పటికే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇక ఇందులోని స్టంట్స్ కోసం రామ్ – లక్ష్మణ్ లతో పాటు లీ విట్టకర్ & గ్రెగ్ పావెల్ లు కూడా కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రం ద్వారా హిందీ సంగీత దర్శకుడైన అమిత్ త్రివేది (Amit Trivedi) తెలుగు తెరకి పరిచయమవుతున్నారు.
భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటికే ఉన్న భారీ తారాగణంతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవరెవరు వెండితెరపై మెరవనున్నారా అని అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో నిహారిక నటిస్తోందనే వార్త అందరిలోనూ సంతోషాన్ని నింపింది. చూద్దాం.. ఇన్ని భారీ హంగుల మధ్య నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఇంకా ఎవరెవరు భాగం కానున్నారో..!
Featured Image: Intagram/ Niharika Konidela
ఇవి కూడా చదవండి
జయలలిత బయోపిక్ “తలైవి” గురించి.. ఆసక్తికర విశేషాలు
శ్రద్ధాకపూర్.. పుట్టిన రోజు సందర్భంగా సాహో టీజర్..!
దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?