ప్రేమికుల రోజు అదేనండీ వాలెంటైన్స్ డే(valentines day) రాగానే ప్రతి ప్రేమ జంట ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తుంటారు. కొందరు రెస్టరంట్లు, రిసార్టులకు వెళ్తుంటే మరికొందరు మాత్రం ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు ట్రిప్(trips)కి వెళ్తుంటారు. అయితే వాలెంటైన్స్ డే కోసం ప్రత్యేకంగా నాలుగైదు రోజులు సెలవు పెట్టలేనివారు ఎంతోమంది ఉంటారు. మరి, ఇలాంటివారేం చేయాలి? ఎప్పటిలా రెస్టరంట్, సినిమా అంటూ గడిపేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? అవసరం లేదండీ.. మన చుట్టుపక్కలే ప్రకృతి నిండిన ప్రదేశాలు ఎన్నో మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రేమికుల రోజున ఆయా ప్రదేశాలను చుట్టేసి మీ ప్రేమను మరింత బలంగా మార్చుకోవడంతో పాటు ప్రకృతితోనూ ప్రేమలో పడిపోండి.
1. అనంతగిరి హిల్స్
హైదరాబాద్‌కి దగ్గర్లో ఉన్న ప్రదేశాల్లో ఒకరోజు ట్రిప్‌కి చక్కటి ఎంపిక అనంతగిరి కొండలు. హైదరాబాద్ శివార్లోని వికారాబాద్ వద్ద ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. హైదరాబాద్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి రావచ్చు. ఉదయం కాస్త తొందరగా వెళ్తే రోజంతా ప్రకృతి ఒడిలో గడిపే వీలుంటుంది. ఇక్కడ రాత్రి బసకు మరీ ఎక్కువ ఏర్పాట్లు లేకపోవడంతో డే ట్రిప్‌కి మాత్రమే ఇది అనుకూలం. లేదంటే మీరే టెంట్లు తీసుకెళ్లి క్యాంపింగ్ చేసే వీలు కూడా ఉంది. అనంతగరి కొండల్లోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని చూసి కొండల్లో, గుట్టల్లో పచ్చని ప్రకృతిలో మునిగి ఆనందం పొందవచ్చు. అక్కడి నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లడం మర్చిపోవద్దు. అనంతగిరికి హైదరాబాద్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. కావాలంటే బైక్ లేదా కార్లో కూడా వెళ్లవచ్చు.
2. పాకాల చెరువు
వరంగల్ జిల్లాలో ఉన్న ఈ పాకాల చెరువు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ప్రకృతి అందాలతో అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడే రాత్రి కూడా ఉండే వీలుంది కాబట్టి ముందు రోజు రాత్రి అక్కడికి వెళ్లి ఉదయాన్నే ట్రిప్‌ని ప్రారంభించడం వల్ల సమయం కలిసొస్తుంది. పాకాల చెరువు దగ్గర కళ్లు తిప్పుకోలేని ప్రకృతి అందాలను ఆస్వాదించే వీలుంటుంది. ప్రభుత్వం ఇందులో బోటింగ్‌కి కూడా ఏర్పాట్లు చేసింది కాబట్టి ఇద్దరూ జంటగా చెరువులో బోటింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడ పక్షులు, జంతువులను చూస్తూ రోజంతా గడపవచ్చు. మీకు ఫొటోలంటే ఇష్టమైతే మీకోసం ఇది చక్కటి ప్రదేశం. మంచి సీనరీలాంటి అందమైన ప్రదేశాలతో ఫొటోల్లో అందంగా కనిపించేందుకు ప్రయత్నించండి. వరంగల్ నుంచి 50 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రదేశానికి రోడ్ ట్రిప్‌లో కారు లేదా బైక్ పై వెళ్లవచ్చు. వరంగల్ నుంచి ఇక్కడికి వెళ్లేందుకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
3. సూర్యలంక బీచ్
హైదరాబాద్ లో ఉన్నవారు వెళ్లేందుకు చాలా దగ్గరగా ఉన్న బీచ్ ఇది. హైదరాబాద్ నుంచి 319కి.మీ, విజయవాడ నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్‌కి వెళ్లడానికి రెండు రోజులు కేటాయించుకుంటే ఆనందంగా గడిపేందుకు వీలుంటుంది. గుంటూరు దగ్గర్లోని బాపట్లలో ఉన్న ఈ బీచ్ కి గుంటూరు నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బీచ్‌తో పాటు ఇక్కడి హరిత బీచ్ రిసార్ట్‌లో గడపడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా మిగులుతుంది. బీచ్‌లంటే ఇష్టపడే వారికి ఇది చక్కటి ఎంపిక. ఇక్కడి బీచ్ లో రోజంతా గడపడంతో పాటు దగ్గర్లోని హోటళ్లలో నోరూరించే ఆంధ్రా వంటకాలను ప్రయత్నించడం.. మీ వాలెంటైన్స్ డేని ఆనందంగా మారుస్తాయి.
4. పాపికొండలు
రెండు కొండల మధ్యలో నది పారుతుంటే ఎంతో అందంగా ఉంటుంది కదా.. మరి, ఆ అందాల నదిలో బోట్‌లో వెళ్తుంటే ఇంకెంత అందంగా ఉంటుందో.. ఇలాంటి చక్కటి అనుభవాన్ని సొంతం చేసుకోవాలంటే పాపికొండలకు బోట్ ట్రిప్ మంచి ఎంపిక. పేరంటాల పల్లిలో గిరిజనులతో ఆటపాటలు, కొల్లూరులో వెదురుతో చేసిన గుడిసెల్లో బస, చక్కటి అందమైన నది, చుట్టూ ప్రకృతిలో బోటు ప్రయాణం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. భద్రాచలం లేదా రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి పాపికొండలకు వెళ్లే వీలుంది. ఈ ప్రదేశానికి రెండు రోజుల ట్రిప్‌ని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా అన్ని ప్రదేశాలను తీరిగ్గా చూసే వీలుంటుంది.
ఇవే కాదు.. రాజమండ్రి, వైజాగ్ దగ్గర్లో ఉన్నవాళ్లకు ఎన్నో బీచ్‌లతో పాటు అరకు, తలకోన, హార్స్‌లీహిల్స్, గండికోట వంటివి దగ్గర్లోనే ఉంటాయి కాబట్టి వాటిని కూడా ప్రయత్నించవచ్చు.
ఇవి కూడా చదవండి
ఎప్పుడూ రెస్టారెంట్లు, రిసార్ట్‌లేనా? ప్రేమికులారా.. ఈ కొత్త ఐడియాలు మీకోసమే..!
మంచి హాలీడేని ఎంజాయ్ చేయాలంటే.. ముస్సోరీ ట్రిప్‌ని ప్లాన్ చేసేయండి..!
అగస్త్య పర్వతం ఎక్కింది.. ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది..!
Images – Tripadvisor