తెలంగాణ స్పెషల్ వంటకం - సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!

తెలంగాణ స్పెషల్ వంటకం - సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో రకమైన వంటకాన్ని తయారు చేస్తుంటారు. ఆయా వంటకాలు కూడా ఆ ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లకు, అక్కడి పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యే ముడిసరకులకి సంబంధించి ఉండడం విశేషం. అలా కేవలం తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే చేసుకునే ఒక ప్రత్యేకమైన వంటకమే - సర్వ పిండి.


ముందుగా ఈ వంటకానికి సర్వ పిండి (Sarva Pindi) అనే పేరు రావడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. ఈ వంటకాన్ని బియ్యప్పిండిని వాడుతూ ఒక లోతు గిన్నె లేదా కాస్త లోతుగా ఉండే పాత్రలో చేసుకుంటారు కాబట్టి.. ఆ పేరు రావడం జరిగింది. ఇదిలావుండగా ఈ వంటకాన్ని తెలంగాణ (Telangana) ప్రాంతంలో తప్పుల చెక్క (Tappala Chekka) & గిన్నప్ప (Ginnappa) అని కూడా పిలుస్తుంటారు.ఇక ఈ సర్వ పిండి వంటకం చేసుకోవడానికి కావాల్సిన వస్తువుల వివరాలు -


* బియ్యపిండి


* ఎల్లిగడ్డ (Garlic)


* పచ్చి మిరపకాయలు (Green Chillies) లేదా పట్టించిన కారం 


* పసుపు (Turmeric)


* ఉప్పు (Salt)


* జీలకర్ర (Cumin Seeds)


* కరివేపాకు (Curry Leaves) , ఉల్లి ఆకు (Onion Leaves), కొత్తిమీర (Coriander Leaves)


* ఉల్లిగడ్డలు (Onions)


* శనగపప్పు (Chana Dal) ఇక తయారు చేసే విధానం చూస్తే,


1.ముందుగా శనగపప్పుని రెండు గంటల పాటు నీటిలో నాన పెట్టుకోవాలి.


2.ఈ వంటకం తయారీకి మనం పచ్చి మిరపకాయలు లేదా పట్టించిన కారం అయినా వాడుకోవచ్చు.  పచ్చి మిరపకాయలు తీసుకున్నట్టయితే వాటితో పాటుగా జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉప్పు సరిపడినంత మోతాదులో వేసుకుని అన్నిటిని కలుపుకోవాలి.


3. అలా కలుపుకున్న మిశ్రమాన్ని బియ్యప్పిండితో కలిపి.. అదే సమయంలో కాసింత పసుపుని కూడా అందులో వేసి మొత్తం ఒక రొట్టె ముద్ద మాదిరిగా చేసుకోవాలి.  అదే సమయంలో మనం ముందుగా నీటిలో నాన పెట్టిన శనగపప్పుని సైతం ఈ మిశ్రమంలో పాటు బాగా కలపాలి.


4. ఇక ఈ రోజుల్లో ప్రత్యేకంగా సర్వ పిండి చేసేందుకు వీలుగా ఫ్రై ప్యాన్స్ లభ్యమవుతున్నాయి. అవి లేని పక్షంలో కాస్త లోతుగా ఉండే పాత్ర లేదా ఏదైనా పెనం ఉపయోగించి కూడా సర్వ పిండిని తయారు చేసుకోవచ్చు.


5. పెనం లేదా ఆయా పాత్ర పైన తొలుత కాస్త నూనె వేసి.. ఆ పాత్ర మొత్తం ఆ నూనెతో ఒకసారి పట్టించాక రొట్టె ముద్ద రూపంలో ఉన్న బియ్యపిండి మిశ్రమాన్ని ప్యాన్ లేదా పాత్రకి అనుగుణంగా అచ్చు వేయాలి.


6. ఇక స్టవ్ పైన చిన్న మంట మీద ఈ ప్యాన్‌ని పెట్టాలి. అలా ప్యాన్ పైన రోటీ ముద్దని పెట్టి అచ్చు వేసే సమయంలో.. మధ్యలో రంధ్రాలు పెట్టడం మర్చిపోవద్దు.


7. సన్నని మంట పైన ఉడికే ఈ వంటకపు పాత్రపై.. మూత పెడితే ఇంకాస్త త్వరగా ఉడికే ఆస్కారం ఉంటుంది. అలా రెండు పక్కల ఫ్రై చేసాక సర్వ పిండిని ఆరగింపుకి సిద్ధం చేయవచ్చు.ఈ వంటకాన్ని ఇలా పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ మిశ్రమాలతోనే కాకుండా.. సొరకాయ తురుము (Bottle Gourd) లేదా పాలకూర (Spinach) మిశ్రమాన్ని కలిపి కూడా చేసుకోవచ్చు. వీటిని సొరకాయ అచ్చులు & పాలకూర అచ్చులు అనే పేర్లతో  కూడా పిలుస్తుంటారు.


సాధారణంగా ఈ వంటకాల్ని సాయంత్రం సమయాల్లో స్నాక్స్‌గా తీసుకుంటుంటారు. తెలంగాణలో మాత్రమే దొరికే వంటకాల్లో సర్వపిండి తొలి స్థానాల్లో ఉంటుంది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


తెలుసుకున్నారుగా సర్వ పిండి ఎలా చెయ్యాలో అని.. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఒకసారి ప్రయత్నించండి ఈ వంటకాన్ని...


Featured Image: www.shutterstock.com


ఇవి కూడా చదవండి


హైదరాబాద్ వెళ్తున్నారా.. అయితే తప్పకుండా ఈ ఖీర్ టేస్ట్ చేయండి


సంక్రాంతికి తెలంగాణలో ఈ వంటకం చాలా స్పెషల్


ఇరానీ ఛాయ్ - కేరాఫ్ హైదరాబాద్