తెలుగింటి అమ్మాయిల కొంటెదనం.. వారి నడత, నడక, హావభావాలు, రూపురేఖలు అన్నింటికీ ప్రాణప్రతిష్ట చేసి.. తన అద్భుత చిత్రాల ద్వారా వారి సౌందర్య సొబగులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత చిత్రకారుడు బాపు సొంతం. బాపు చిత్రాలలో ఏదో తెలియని చిలిపితనం ఉంటుంది. ఆ చిత్రాలను చూసే వారికి ఓ చిత్రమైన అనుభూతి కూడా కలుగుతుంది. హాస్యం, చతురత, సరసం, విరహం.. ఒకటేమిటి.. ఎన్ని రకాల రసాలనైనా తన చిత్రాలతో పలికించడం బాపు స్పెషాలిటీ. అందుకేనేమో తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆడపిల్ల.. తెలుగమ్మాయి అయినా కాకపోయినా.. బాపు బొమ్మలా ఉందంటారు. అలాంటి బాపు చిత్రాలలో కొన్ని ఈ రోజు మీకు ప్రత్యేకం
వాలుజడ
బాపు చిత్రాలలో అన్నింటికన్నా ప్రత్యేకం ఏమిటంటే.. అమ్మాయిల వేసుకొనే పొడుగు జడ లేదా వాలుజడ. ఆ జడతోనే చిత్ర విచిత్ర విన్యాసాలను తన చిత్రాలలో కొంటెగా చేయిస్తారు బాపు. ఏకంగా “రాధాగోపాళం” చిత్రంలో ఈ వాలుజడ మీద ఓ పాట సైతం రాయించారంటేనే.. దీని ప్రత్యేకత ఏమిటో మనకు అర్థమవుతుంది కదా..!
రూపాయి కాసంత బొట్టు
చిత్రమేంటంటే.. బాపు బొమ్మలు అన్నింటిలో కూడా ఆడవాళ్లకు రూపాయి కాసంత బొట్టు ఉంటుంది. ఆ బొట్టే ఆ చిత్రానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది.
కాటుక కళ్లు
బాపు చిత్రాలలో ఆడపిల్లలకు ఉండే మరో ప్రత్యేకత కాటుక కళ్లు. ఆ చిత్రాలను చూస్తుంటే.. కళ్లకు కాటుక పెట్టుకోవడం కూడా ఓ కళ అని అనిపించక మానదు.
పట్టు పరికిణీ
పరికిణీలో తెలుగమ్మాయిని చూస్తే.. ఏ కవికైనా కవిత్వం తన్నుకుంటూ వచ్చేస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి పరికిణీని చిత్రాతి చిత్రమైన డిజైన్స్‌లో తన చిత్రంలో చూపిస్తుంటారు బాపు.
రంగవల్లులు
బాపు చిత్రాలలో రంగవల్లులకు కూడా ప్రధాన పాత్రే ఉంటుంది. అందమైన ముగ్గులేసే ఆడపిల్లల భంగిమలు కూడా అందంగానే చిత్రీకరించడం బాపు ప్రత్యేకత.
బంగారు పట్టీలు
బాపు చిత్రాలలో కనిపించే మరో విచిత్రం బంగారు పట్టీలు, వెండి పట్టీలు లేదా కడియాలు. అవే చిత్రాలకు అదనపు ఆకర్షణ కూడా.
ఎన్నో. మరెన్నో..
ఇంకా శృంగారాది రసాలను తన చిత్రాలలో కళాత్మకంగా చూపించడం బాపు ప్రత్యేకత. బాపు చిత్రాలు ఎంత కళాత్మకంగా ఉంటాయో.. అంతే రసానుభూతిని కూడా కలిగిస్తాయి. అదేవిధంగా ఒక ప్రత్యేకత కలిగిన చిత్రాలుగా కూడా చూపరులను ఆకట్టుకుంటాయి అనడంలో సందేహం లేదు.
Images: Instagram
ఇవి కూడా చదవండి
నాన్నంటే నాకెంత ఇష్టమో..! (తండ్రీ, కూతుళ్ల అనుబంధాన్ని తెలిపే 13 క్యారికేచర్లు)