సుహాసిని (Suhasini) – కెమెరా అసిస్టెంట్‌గా తన సినీ కెరీర్‌ని మొదలుపెట్టి.. ఆ తరువాత నటిగా, దర్శకురాలిగా , మాటల రచయితగా, నిర్మాతగా & టెలివిజన్ షో వ్యాఖ్యాతగా పలు రంగాల్లో తనదైన ముద్రవేసిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. కథానాయికగా ఎన్నో ప్రేరణాత్మకమైన చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం మాత్రం తల్లి పాత్రలకు పరిమితమయ్యారు. వచ్చిన అవకాశాల్లో తనకు నచ్చిన వాటిని అందిపుచ్చుకుంటూనే తనలోని నటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఆమె తాజాగా తనలోని మరో కోణాన్ని కూడా బయటపెట్టారు. ఇంతకీ ఆ కోణం ఏంటో మీకు తెలుసా??
చెన్నైలోని ప్రఖ్యాత నాట్య కళాశాలలో ఇటీవల సరసాలయ ప్లాటినమ్ జూబ్లీ (Sarasalaya Platinum Jubilee Event) పేరిట ఒక ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించారు. ఇప్పటికే ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేసిన సుహాసిని ఈ వేడుకల ద్వారా తనలోని నాట్యమయూరిని ప్రజలకు పరిచయం చేశారు. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది నిజమండీ.. ఎప్పుడో 43 ఏళ్ల క్రితం ఆమె అదే నాట్య కళాశాలలో నాట్యం చేయడం నేర్చుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ విద్యను ఎక్కడా ఆమె ప్రదర్శించలేదు. అందుకు ఆమెకు తగిన అవకాశం కూడా రాలేదు. కానీ 43ఏళ్ల తర్వాత నేర్చుకున్న కళాశాలలోనే ఆమె అరంగేట్రం చేసినందుకు చాలా గర్వంగా ఉందన్నారు సుహాసిని.
అయితే భరతనాట్యం నేర్చుకున్న సమయంలో తన నాయనమ్మ కోరిక మేరకు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఇంట్లోనే ఒక ప్రదర్శన ఇచ్చారట! ఆ తర్వాత మళ్లీ ప్రదర్శన ఇచ్చింది ఇప్పుడే! అందుకే దీనిని నా తొలి అరంగేట్రం అనుకోవచ్చంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సుహాసిని. ఈ కార్యక్రమానికి ఉన్న మరొక విశేషం ఏంటంటే.. 43ఏళ్ల క్రితం ఆమెకు మేకప్ వేసిన సేతు మాధవన్ (Sethumadhavan) ఇప్పుడు కూడా ఆమెకు మేకప్ వేశారు. అందుకే కార్యక్రమం అనంతరం ఆయనతో కలిసి ఫొటోలు దిగుతూ ఈ ప్రదర్శనలో సేతుమాధవన్ పాత్ర మరువలేనిదన్నారు సుహాసిని. అయితే భరతనాట్యం నేర్చుకుని చాలా సంవత్సరాలు కావస్తుండడంతో తన స్నేహితురాలు ఇచ్చిన సలహా మేరకు ఈ ప్రదర్శన ఇవ్వడానికి సరసాలయ కళాశాలకు చెందిన ఒక ప్రముఖ అధ్యాపకురాలి పర్యవేక్షణలో.. 12 రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం ద్వారా ఈ అరంగేట్రంకు సిద్ధమయ్యారట సుహాసిని.
ఈ ప్రదర్శనకు ప్రముఖ నృత్యకారిణులైన పద్మ సుబ్రహ్మణ్యం (Padma Subramanyam), లక్ష్మి విశ్వనాధ్ (Lakshmi Vishwanath) లతో పాటు సుహాసిని కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. వీరంతా కన్నులపండువగా సాగిన ఆమె ప్రదర్శనను కళ్లారా తిలకించారు. సుహాసిని భర్త, ప్రముఖ దర్శకుడు మణిరత్నం మాత్రం ఈ ప్రదర్శన విషయమై కాస్త భయపడ్డారట! దీని గురించి సుహాసిని మాట్లాడుతూ- “43 ఏళ్ళ తరువాత నాట్యం చేస్తున్నావు, ఇది సినిమా కాదు.. ఇక్కడ టేక్ 2 ఉండదు..” అంటూ ఆ ప్రదర్శనలో తాను ఎక్కడ తప్పు చేసి అందరి ముందూ ఇబ్బందిపడతానో అని ఆయన పడిన కంగారు గురించి చెప్పుకొచ్చారు.
అయితే ప్రదర్శన అంతా చక్కగా ముగియడంతో ఆమెతో పాటు అక్కడున్నవారంతా సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇస్తారా అని కొందరు అడగ్గా.. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పట్లో చెప్పలేను అంటూ ఆమె అన్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ మధురమైన క్షణాలను సంతోషంగా గడిపారామె.
ఇక ఆమె నటిస్తోన్న సినిమాల విషయానికి వస్తే, తాజాగా వైఎస్సార్ జీవితకథ ఆధారంగా రూపొందించిన “యాత్ర” సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటించి, అందరినీ మెప్పించారు సుహాసిని. ప్రస్తుతం తెలుగులో “సూర్యకాంతం” చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తున్నారు జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటీమణి. చూద్దాం.. భవిష్యత్తులో ఆమె ఇంకేమైనా నృత్య ప్రదర్శనలు ఇస్తారేమో..!
ఇవి కూడా చదవండి
కమర్షియల్ హంగులతో నిండిన.. ఎన్టీఆర్: మహానాయకుడు (సినిమా రివ్యూ)