క్యాన్సర్(Cancer) ప్రస్తుతం మానవాళిని కబళించివేస్తున్న ఓ మహమ్మారి. మగవారి కంటే ఆడవాళ్లలోనే ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉండడం మనకు ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మనదేశంలో ఈ వ్యాధిబారిన పడి రోజూ లక్షలాది మంది ప్రాణాలు విడుస్తున్నారు. అయితే ముందుగానే ఈ వ్యాధి గురించి తెలుసుకొని చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకునే వీలుంటుంది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండడం ఓ పద్ధతైతే.. క్యాన్సర్‌కి సంబంధించిన లక్షణాల (Symptoms) ఆధారంగా వైద్యుల వద్దకు వెళ్లి.. చికిత్స తీసుకోవడం మరో పద్ధతి. మరి, ఏ తరహా క్యాన్సర్‌కి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం రండి..
రొమ్ము క్యాన్సర్ (Breast cancer)
ఆడవారిలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో ముఖ్యమైనది రొమ్ము క్యాన్సర్. ఈ తరహా క్యాన్సర్ మనదేశంలో ఎక్కువగా ప్రబలుతోందని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని నివారించేందుకు 35 ఏళ్లు నిండిన వారందరూ కనీసం ఏడాదికోసారి మామ్మోగ్రామ్ చేయించుకోవాలి. అప్పుడప్పుడు మీ రొమ్ములను చెక్ చేసుకోవడం వల్ల కూడా లక్షణాలను తొలి దశలోనే గుర్తించేందుకు వీలుంటుంది. రొమ్ములను చెక్ చేసుకున్నప్పుడు ఏదైనా గడ్డలాగా తగులుతున్నా.. రొమ్ముల ఆకారం మారినట్లు కనిపించినా రొమ్ము క్యాన్సర్ ఉందేమోనని అనుమానించవచ్చు.
దీనితో పాటు చనుమొనల నుంచి రక్తం రావడం లేదా పసుపు రంగు స్రావాలు కారడం, చనుమొనలు లోపలికి వెళ్లిపోవడం, చనుమొన చుట్టూ ఎరుపు రంగు దద్దుర్లు రావడం, రొమ్ములో గుంటలు పడడం, చంకలో గడ్డలు కనిపించడం, మెడ ఎముక వద్ద వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే రొమ్ములో గడ్డలన్నీ క్యాన్సర్‌వి కాకపోవచ్చు. అయితే ఇలాంటివి కనిపించినప్పుడు పరీక్షలు చేయించుకోవడం మంచిది.
Also Read ఈ లక్షణాలతో క్యాన్సర్ ను ముందుగానే
Image: Shutterstock
ఓవేరియన్ క్యాన్సర్ (Ovarian cancer)
మిగిలిన క్యాన్సర్లతో పోల్చితే అండాశయ క్యాన్సర్లను గుర్తించడం చాలా కష్టం. అందుకే దీని లక్షణాలను గుర్తించే సమయానికే వ్యాధి ముదిరిపోయి మూడో దశలోనో, నాలుగో దశలోనో ఉంటుంది. ఇలాంటప్పుడు సమస్య చికిత్సకు లొంగడం కాస్త కష్టమే. అందుకే దీన్ని గుర్తించేందుకు ఎప్పటికప్పుడు ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ చేయించుకోవడం మంచిది.
ఈ తరహా క్యాన్సర్ వస్తే మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా ట్యూమర్ పెరిగిపోయిన తర్వాత ఆకలి లేకపోవడం, ఎసిడిటీ, బరువు తగ్గిపోవడం, కడుపుబ్బరం, అజీర్తి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే లక్షణాలు కనిపించేవరకూ ఆగకుండా స్కాన్‌లో ఏదైనా ట్యూమర్ ఉందని తెలిస్తే వెంటనే క్యాన్సర్ ఉందా? లేదా? అని తెలుసుకోవడం మంచిది.
Image: Shutterstock
గర్భాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు (Uterus and cervical cancer)
స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ముఖ్యమైనవి గర్భాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు. వీటిని ముందుగా గుర్తించడం కాస్త కష్టమే అయినా.. కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఈ రెండు తరహాల క్యాన్సర్లకు దాదాపు ఒకే లక్షణాలు కనిపిస్తాయి. కటివలయ ప్రాంతంలో నొప్పి, రతి సమయంలో ఇబ్బంది, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో పాటు వాసనతో కూడిన డిశ్చార్జ్ వంటి లక్షణాలతో వీటిని గుర్తించేందుకు వీలుంటుంది. ఇలాంటివి కనిపించినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎండోమెట్రియల్ టిష్యూ శాంప్లింగ్ వంటి పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ అని తేలితే చికిత్స తీసుకోవడం ప్రారంభించాలి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer)
పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ఈ తరహా క్యాన్సర్ కేసులు ప్రస్తుతం బాగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా క్యాన్సర్లు పొగతాగేవారిలో ఎక్కువగా కనిపిస్తున్నా.. ఆ అలవాటు లేకపోతే ఈ సమస్య రాదని చెప్పేందుకు వీల్లేదు. ఊపిరితిత్తుల్లో కణతి ఏర్పడడం, దాని విస్తరణను బట్టి ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయి.
దగ్గు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, జ్వరం, నోటి నుంచి రక్తం రావడం, ఆకలి లేకపోవడం, ఆహారం తీసుకునేటప్పుడు ఇబ్బంది, బరువు తగ్గిపోవడం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఎక్కువగా ఈ క్యాన్సర్‌లో కనిపిస్తాయి. దీన్ని ముందుగానే గుర్తించేందుకు ఎప్పటికప్పుడు ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటివి చేయించుకోవాలి. క్షయ వ్యాధి వచ్చి తగ్గిన వాళ్లు ఈ పరీక్షలను కనీసం ఆరు నెలలకు ఒకసారైనా చేయించుకోవడం మంచిది.
జీర్ణాశయ క్యాన్సర్ (Stomach cancer)
ఈ తరహా క్యాన్సర్లు మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన దగ్గర కారం వినియోగం ఎక్కువ కాబట్టి ఈ తరహా క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నలభై ఏళ్లు నిండిన వారిలో రక్తహీనత, కడుపుబ్బరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, వాసనతో కూడిన తేన్పులు, వాంతులు, నలుపు రంగు విరోచనాలు వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవడం వల్ల ఫలితం కనిపిస్తుంది. ఈ తరహా క్యాన్సర్‌ని గుర్తించేందుకు సీటీ స్కాన్, ఎండోస్కోపీ వంటివి చేసి గుర్తించవచ్చు.
ఇవి కూడా చదవండి
అమ్మాయిలూ.. యోని ఆరోగ్యానికి ఇవి పాటించండి..
మానసిక ప్రశాంతత కోసం వేసే తేలికైన యోగాసనాలు ఏమిటి.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
మీ బ్యూటీ ఉత్పత్తుల్లో దాగి ఉన్న క్యాన్సర్ కారకాల గురించి ఆంగ్లంలో చదవండి.