ప్రియమైన అత్తగారికి..
ఈ లేఖ (Letter) ద్వారా మీతో ఎంతో నిజాయతీగా మాట్లాడాలనుకుంటున్నా. నిజం చెప్పనా? నాకూ ఓ అత్తగారు (Mother in law) ఉంటారన్న ఆలోచననే నేను ఎప్పుడూ మనసులోకి రానివ్వలేదు. అత్తగారి గురించి ఆలోచించడానికే భయమేసేలా మన చుట్టూ ఉన్న మీడియా, సీరియళ్లు మార్చేశాయి.
అత్తగారంటే ఎప్పుడూ భయపడాలి.. లేదా తనని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగానే చూపించాయి. కానీ నా మనసులో నేనెప్పుడూ మనిద్దరి బంధం అలా ఉండాలని వూహించుకోలేదు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ.. ఒకరికొకరు అండగా నిలుస్తూ మన బంధాన్ని కొనసాగించాలన్నదే నా ఆశ. అలా ఉండడమే నాకు ఇష్టం కూడా..
మీ అబ్బాయికి మీరు జన్మనిచ్చారు.. మంచి మనిషిగా పెంచారు. తన పెంపకం కోసం మీరు పాటించిన నియమాలను నేను మెచ్చుకోక తప్పదు. మీ పెంపకం వల్లే తను ఇంత మంచి వ్యక్తిగా ఎదిగాడు. అందుకే తనతో నా జీవితాన్ని పంచుకోవడానికి నేను ఆసక్తి చూపించా. తనని ఇంత మంచి వ్యక్తిగా మార్చడం వెనుక మీ కష్టాన్ని నేను తక్కువగా చూడదల్చుకోలేదు.
ఇప్పటివరకూ నేను ప్రేమించిన జీవితాన్ని వదిలి నేను మీ ఇంటికి రాబోతున్నా. ఈ మార్పు అంత సులభమేమీ కాదు.. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని నాకు ముందే తెలుసు. నన్ను తప్పుగా అనుకోకండి. మీతో, మీ అబ్బాయితో నా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నేను ఎంతో ఆసక్తితో వేచి చూస్తున్నా. కానీ అదే సమయంలో నాకు సంబంధించిన ప్రతిఒక్కటీ వదిలి మీ ఇంటికి రావాలంటే భయంగా కూడా అనిపిస్తోంది. నా తల్లిదండ్రులు నన్ను ఆత్మవిశ్వాసం, సొంత వ్యక్తిత్వం గల.. తెలివైన, శక్తివంతమైన, నెమ్మదైన అమ్మాయిగా పెంచారు.
వాళ్లు నాకు నేర్పించనిదల్లా ఒకటే.. వారు లేకుండా జీవితం గడపడం. అందుకే ఈ కొత్త జీవితానికి నేను అడ్జస్ట్ కావడానికి నాకు కొంత సమయం పడుతుంది. కానీ నేను మీ ఇంట్లో అడ్జస్ట్ కావడానికి మీరు నాకు సహాయం చేస్తారని నా నమ్మకం. నేను ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ కాదు. తప్పులు కూడా చేస్తాను. కానీ అలాంటి సమయంలో కాస్త సహనంతో నాకు అండగా నిలిచి.. వాటిని మార్చుకోవడానికి నాకు సహాయం చేయండి.
నాలోని లోపాల గురించి నాకు బాగా తెలుసు. వాటిని అధిగమించేందుకు నేను ప్రయత్నిస్తున్నా. అందుకే నేను నేర్చుకుంటున్నా.. అని గర్వంగా చెబుతా. కాస్త సహనంగా ఉండి నేర్చుకోవడానికి నాకు కాస్త సమయాన్ని ఇవ్వండి చాలు.. మిగిలిన అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నట్లే మంచి భార్య, మంచి కోడలిగా నా బాధ్యతలను చక్కగా నెరవేరుస్తానని మీకు మాటిస్తున్నా. మీ మనసులో నాకు కాస్త చోటిస్తే చాలు.. ఓ కూతురిలా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తాను. మీ కోడలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, మీ కుటుంబంలో భాగమయ్యేందుకు ఆత్రుతతో వేచి చూస్తున్నా.
మనిద్దరం కలిసి అత్తాకోడళ్ల పట్ల ఉన్న కొన్ని మూసధోరణులను బద్దలు కొడదాం. ఏక్తా కపూర్‌లాంటి సీరియల్ నిర్మాతలకు ఫోన్ చేసి అసలైన అత్తాకోడళ్లు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మమ్మల్ని చూడండి అని చెబుదాం. ఒకరి కలలను, ఒకరి ఆశలను నెరవేర్చుకోవడానికి మరొకరం సహాయం చేసుకుందాం. మన బంధాన్ని చూసి ఇతరులు కుళ్లుకునేలా చేద్దాం. # అంటే ఏంటో ప్రపంచానికి చాటుదాం.
బంధాలు ఎలా కొనసాగాలో ఇతరులకు చాటుదాం. అన్ని విషయాల్లో ఓపెన్‌గా ఉండి.. ప్రతి విషయాన్ని ఒకరికొకరు చెప్పుకుందాం. సమస్యలుంటే మాట్లాడుకొని పరిష్కరించుకుందాం. ఆనందంలో, బాధలో ఒకరికొకరు తోడుందాం. ఏదో వూహించుకోకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. ఒక మహిళ మరో మహిళను ప్రోత్సహిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటుదాం. జీవితం ఎంతో అందమైనది. దాన్ని ఆనందంగా జీవిద్దాం. ఏమంటారు?
ఇట్లు
మీకు కాబోయే కోడలు.
కాలేజీలో మొదలై.. జీవితాంతం నిలిచిన అందమైన ప్రేమ కథలు మీకోసం..!
డియర్ ఎక్స్.. నన్ను మోసం చేసినందుకు ధన్యవాదాలు..!
పెళ్లికి ముందే ఈ ఎమర్జెన్సీ కిట్.. సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు..