#POPxoWomenWantMore మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

#POPxoWomenWantMore  మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

మన దేశంలో మహిళలంటే చాలా చిన్నచూపు ఉంది. శారీరకంగా, మానసికంగా వారు బలహీనంగా ఉంటారనే అభిప్రాయం ఎంతోమందిలో చాలా బలంగా ఉంది. మరో రకంగా చెప్పాలంటే ఈ భావన తరతరాలుగా మ‌న‌ నరనరాల్లో జీర్ణించుకుపోయింది. మీలోనూ ఇలాంటి భావన ఉంటే ఇప్పటికైనా దాన్ని మార్చుకోండి. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే చాలా శక్తిసామర్థ్యాలు కలిగినది స్త్రీ . అసలు తనలో ఎంత శక్తి ఉందో తెలుసుకొంటే.. ఆమె శక్తిహీనురాలనే ఆలోచనే ఏ మ‌హిళ‌కీ రాదు.


మహిళల్లో ఎంతో శక్తి నిగూఢమై ఉంటుంది. వారు ఎంత శక్తిమంతులో తెలుసుకోవడానికి చరిత్రను ఓసారి తిరగేసి చూడండి. ఎంతోమంది మహిళలు ధైర్యసాహసాలకు ప్రతిరూపాలుగా నిలిచారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా, కేలాడి చిన్నమ్మ, రాణీ రుద్రమ.. ఇలా చరిత్రను వెతికితే ఎందరో శ‌క్తిమంత‌మైన‌ మహిళలు మనకు కనిపిస్తారు. రాజ్యాన్ని జనరంజకంగా పాలించడం మాత్రమే కాదు.. శత్రు రాజులకు చుక్కలు సైతం చూపించారు. 


మహిళల శక్తి గురించి తెలుసుకోవాలంటే.. చరిత్రనే తిరగేసి చూడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ఆడవాళ్లని చూస్తే చాలు. అటు ఇంటిని.. ఇటు ఆఫీసుని.. పిల్లల బాధ్యతను ఒంటిచేత్తో చక్కబెడుతుంటారు. అసలు ఇన్ని పనులు చేయాలంటే ఎంత సామర్థ్యం ఉండాలి? ఎంత శక్తిమంతులై ఉండాలి? కానీ ఇవేమీ పట్టించుకోకుండా మహిళల్ని చిన్నచూపు చూసేవారు నేటికీ మనకు కనిపిస్తూనే ఉంటారు.


1-woman-strength


ఈ భూమి మీద అస‌లు మ‌హిళ‌ లేక‌పోతే.. ఎలా ఉంటుందో మీరు ఊహించ‌గ‌ల‌రా?


ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. చేపట్టిన ప్రతి పనినీ విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘ఆడదానికి నీకెందుకు ఇవన్నీ? ఇంట్లో పని చూసుకోవచ్చుగా?’ అని కొంద‌రు అంటూ ఉంటారు. స్వ‌తంత్రంగా వ్యవహరిస్తోన్న ఆమెను చూసి అపహాస్యం చేస్తారు. అవహేళన చేస్తారు. వాటన్నింటినీ ఎదుర్కొని.. తన గమ్యాన్ని చేరుకొంటుంది మ‌హిళ‌.


ఆధునికమని చెప్పుకొంటున్న నేటి సమాజంలోనూ ఒక స్త్రీ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏటికి ఎదురీదాల్సిందే. ఈ ప్రయాణంలో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎదురయ్యే వేధింపులు మానసికంగా మహిళలను కుంగిపోయేలా చేస్తాయి. అయినా వాటన్నింటినీ ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు ధైర్యాన్ని, శక్తిని కూడదీసుకొని ముందుకు సాగిపోతూనే ఉంటారు. ఇలా చేయడానికి ఎంతో మానసిక స్థైర్యం అవసరం. ఆ స్థైర్యం మహిళలకు మాత్రమే ఉంది.


మహిళలు తలుచుకొంటే ఏ పనైనా సాధించగలరు. వారికి ధైర్యం చాలా ఎక్కువ. అందుకే ఎంత క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా చాలా గుండె నిబ్బరంతో ఉంటారు. అదే సమయంలో వారు సున్నితమైన మనస్కులు కూడా. అసలు స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు. తన రక్తమాంసాలతోనే ఈ జగత్తు నడుస్తోంది. ఇక ముందూ నడుస్తుంది. అలాంటి మహిళను కించపరచడం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకోవడమే. మీకు జన్మనిచ్చిన తల్లిని అవమానించిన‌ట్లే లెక్క‌..!


2-women-strength


మ‌హిళా శ‌క్తిని(women strength) తెలుసుకోవాలంటే మనం ఎక్కడెక్కడో పరిశోధన చేయాల్సిన అవసరమే లేదు. పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మీ అమ్మ‌ను గమనిస్తే చాలు. ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఏదో ఒక పనిచేస్తూనే ఉంటుంది. ఇంటిని చక్కబెట్టడంలోనే ఆమె సామర్థ్యం మనకు తెలుస్తుంది. చాలా ఆర్గనైజ్డ్‌గా పనిచేస్తుంది. ఏ సమయానికి ఏ పని చేయాలో అదే చేస్తుంది. ఎవరికి ఏమి అందించాలో అదే అందిస్తుంది. ఇంటిల్లిపాదికీ అవసరమైనవన్నీ తనే దగ్గరుండి చూసుకొంటుంది. ఇంట్లో ఏమున్నాయో.. ఏమి లేవో.. తనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదు. ఇది చాలదా ఆమె ఎంత మేధావో చెప్పడానికి. అయినప్పటికీ ఆమెను చాలా చులకనగా చూస్తారు. ఆమె శ్రమను తక్కువ చేసి మాట్లాడతారు.


అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట


నేటితరం మహిళలైతే అటు ఇంటిని.. ఇటు ఉద్యోగపరమైన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇదే పనిని పురుషులను చేసి చూడమనండి. ఒక రోజు చేస్తారు.. రెండు రోజులు చేస్తారు. మూడో రోజు చేతులెత్తేస్తారు. కానీ మహిళలు మాత్రం అలా కాదు. తాము చేసే ప్రతి పనినీ చాలా బాధ్యతాయుతంగా పూర్తిచేస్తారు. ప్రతి పనిని ప్రేమగా చేస్తారు. ఆర్థికంగానూ ముందుచూపుతో ఉంటారు. కొన్ని సందర్భాల్లో అమ్మ పోపుల డబ్బాలో దాచిపెట్టిన డబ్బులే మనకు అక్కరకొస్తాయి.


అయినప్పటికీ ప్రతి విషయంలోనూ మహిళలు చిన్నచూపునే ఎదుర్కొంటున్నారు. సరైన ప్రోత్సాహం లేక వారి శక్తిసామర్థ్యాలు నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఇప్పటికైనా వారి ప్రతిభను గుర్తించి వారికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తే.. మ‌రింత ప్ర‌గ‌తిని సాధిస్తూ సాధికార‌త దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులేస్తారు.


రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?