మ‌న పూర్వీకులకు ఉన్న ఈ ఆహారపు అలవాట్లు.. మ‌న ఆరోగ్యానికి శ్రీ‌రామ‌ర‌క్ష‌..!

మ‌న పూర్వీకులకు ఉన్న ఈ ఆహారపు అలవాట్లు.. మ‌న ఆరోగ్యానికి శ్రీ‌రామ‌ర‌క్ష‌..!

కొన్నేళ్ల క్రితం వరకు బీపీ, షుగర్.. వంటి వ్యాధులు అరవై ఏళ్లు నిండిన వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. పాతికేళ్లకే బీపీ, ముప్ఫై ఏళ్లకే గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. దీనంతటికీ మన అనారోగ్యకరమైన జీవనశైలే కారణం. పని ఒత్తిడి ఎక్కువ కావడం, దాని వల్ల సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. తీసుకొన్న ఆ ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం.. వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు నేటి యువత.


ప్రోసెస్డ్ ఫుడ్, కల్తీ ఆహారం, రసాయనాలతో నిండిన కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది. అందుకేనేమో వయసులో ఉన్నా నిరుత్సాహంగానే ఉంటున్నాం. కానీ మన తాత, బామ్మలను చూడండి.. వయసుడిగినా ఎంత ఉత్సాహంగా ఉంటున్నారో.. చక్కగా వారి పనులు వారు చేసుకొంటున్నారు. మనం మాత్రం ఈసురోమంటూ తిరుగుతున్నాం.


ఆ తరం వారికి.. ఇప్పటి తరానికి ఆహారపు అలవాట్లలో (eating habits) చాలా తేడాలున్నాయి. మా చిన్నతనంలో  మా తాతయ్య వీటి గురించి ఎక్కువగా మాకు చెప్పేవారు. వారు ఎక్కువగా రాగులు, జొన్నలు, కొర్రలు వంటి వాటితో అన్నం వండుకొని తినేవారట. బియ్యంతో కూడా వండుకొనేవారట కానీ.. చాలా తక్కువని చెప్పారు. ఆ బియ్యం కూడా దంచినవే కానీ.. ఇప్పటిలా పాలిష్ చేసినవి కావు. బహుశా.. వారి ఆహారపు అలవాట్ల కారణంగానే ఇప్పటికీ అంత బలంగా ఉన్నారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. అంతేకాదు.. మన తాతముత్తాల ఆహారపు అలవాట్లు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అనిపిస్తోంది.


1-food-habits-learn-from-ancestors


చిరుధాన్యాలు:


సాధారణంగా మనం తినే ఆహారం మన వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా ఉండాలి. దానికి తగినట్లుగానే మన పంటలుండాలి. అందుకే పూర్వకాలంలో ఏ పంటలు పండితే వాటినే ఆహారంగా తీసుకొనేవారు. ముఖ్యంగా వారి ఆహారంలో చిరుధాన్యాలు ఎక్కువగా ఉండేవి. ఓ యాభై ఏళ్ల క్రితం వరకు ఇలాగే ఉండేది.  కానీ మధ్యలో మనం కాస్త పక్కదారి పట్టాం. గోధుమ పిండి చపాతీలు, పాలిష్ బియ్యానికి అలవాటు పడ్డాం. 


ఈ క్రమంలో చిరుధాన్యాలను చులకనగా చూడటం మొదలు పెట్టాం. కానీ వాస్తవానికి మన ఆరోగ్యాన్ని కాపాడేవి అవే. వీటిలో ప్రొటీన్లు, పీచుపదార్థం పుష్కలంగా లభిస్తాయి. పైగా వీటిలో గ్లూటెన్ అస్సలుండదు. అలాగే విటమిన్ బి, విటమిన్ ఇ, ఐరన్, పాస్ఫరస్ ఇంకా ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.


2-food-habits-learn-from-ancestors


ఆహారంతో వైద్యం


ఇప్పుడంటే మనం జలుబు వస్తే ట్యాబ్లెట్ల కోసం పరుగెడుతున్నాం.. కానీ నిన్నమొన్నటి వరకు దానికోసం ఇంటి వైద్యమే చేసుకొనేవాళ్లం. పాలల్లో శొంఠి, మిరియాలు లేదా పసుపు, మిరియాలు వేసి బాగా కాచి ఇచ్చేవారు. అంతే మరుసటి రోజుకి జలుబు మాయం అయిపోయేది. ఇప్పటిలా అప్పట్లో ప్రతి చిన్నదానికి మందులపై ఆధారపడేవారు కాదు. ఆహారం ద్వారానే జబ్బులను నయం చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చేవారు.


ప్రతి కూరలోనూ పసుపు వేసేవారు. ఆ అలవాటు వల్లే మనదేశంలో అల్జీమర్స్ వ్యాధి చాలా తక్కువగా ఉంది. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు.. ఇలా ఆరోగ్యాన్ని కాపాడేవన్నీ వారి ఆహారంలో భాగంగా ఉండేవి. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటికీ వీటిని మనం పాటిస్తున్నాం.


5-food-habits-learn-from-ancestors


శుద్ధమైన నూనెలు


ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నా మనం మార్కెట్‌కే వెళుతున్నాం. మన దుర‌దృష్టం కొద్దీ ఎక్కువ డబ్బులిచ్చి నాణ్యత లేనివి కొనుగోలు చేస్తున్నాం. పైగా వాటినిండా రసాయన అవశేషాలు. రిఫైన్డ్ ఆయిల్ అని మనం ఇప్పుడు వాడుతున్నామే.. దాన్ని తయారుచేసే క్రమంలో రంగు, వాసన మారకుండా ఉండటానికి దానిలో బ్లీచింగ్ ఏజెంట్లను కలుపుతారు.


ఇలాంటి ఉత్పత్తులు మనల్ని క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడేలా చేయవచ్చు. మీకు ఈ విషయంపై నమ్మకం కలగాలంటే.. కాస్త టైమ్ తీసుకొనైనా సరే నూనె ప్యాకెట్‌ను ఓసారి పరిశీలించండి. దానిపై BHT, BHA లాంటి ప్రమాదకరమైన రసాయనాలుంటాయి. వీటి వల్ల క్యాన్సర్, బ్రెయిన్ డ్యామెజ్ వంటి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు.


ఇదంతా ఇప్పటి పరిస్థితి. ఒకప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఇప్పటిలాగా అప్పుడు రిఫైన్డ్ నూనెలు వాడేవారు కాదు. అన్నీ ఊరిలో ఉన్న మిల్లుల్లో అత్యంత సాధారణమైన పద్ధతుల్లో ఆడించినవే అయి ఉండేవి. పైగా కమ్మటి వాసనతో చాలా సహజంగా అనిపించేవి. అడుగున కాస్త మడ్డి ఉన్నా.. దాని వల్ల ప్రాణాంతక వ్యాధులేవీ వచ్చేవి కావు.


పైగా అప్పట్లో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగం తక్కువే కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి చేటూ కలిగేది కాదు. ఇప్పుడూ కొన్ని సూపర్ మార్కెట్లలో ఆర్గానిక్ పేరుతో కొన్ని ఉత్పత్తులు కనిపిస్తాయి. కానీ వాటిని చూసినప్పుడు.. నిజంగానే వీటిని ఎరువులు, పురుగుమందులు వేయకుండా పండించారా? అనే అనుమానం మ‌న‌కు కలుగుతుంది.


3-food-habits-learn-from-ancestors


బెల్లం..


మన సంప్రదాయ వంటకాల్లో ఎక్కువగా బెల్లమే ఉపయోగిస్తారు. ఎలాంటి రసాయనిక పదార్థాలు ఉపయోగించకుండా చెరకు రసాన్ని మరిగించి దీన్ని తయారుచేస్తారు. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎనీమియా(రక్తహీనత) రాకుండా ఉంటుంది. క్యాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఎముకలు సైతం గట్టిగా ఉంటాయి. అందుకే ఒకప్పుడు టీ తయారుచేయడానికి సైతం బెల్లమే ఉపయోగించేవారు.


కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బెల్లం వినియోగాన్ని దాదాపు పక్కన పెట్టేశాం. పూర్తిగా రిఫైన్డ్ చేసిన పంచదార ఉపయోగిస్తున్నాం. దీన్ని కూడా చెరకుతోనే తయారుచేస్తారు. కానీ రిఫైన్డ్ చేసే క్రమంలో దానిలో ఉన్న పోషకాలు నశించిపోతాయి. దీన్ని ఉపయోగించడం వల్ల మనకు కలిగే ఉపయోగం మాట పక్కన పెడితే.. అది శరీరంలో క్యాలరీలు నింపేదిగా మాత్రమే మిగిలింది.


4-food-habits-learn-from-ancestors


ప్రాంతీయంగా దొరికే పండ్లు..


ఇప్పుడు మనకు రకరకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. నిజం చెప్పాలంటే.. వాటిలో చాలా వరకు మన దేశంలో పండేవే కావు. అన్ని రకాల పండ్లను తింటున్నా... మన ఆరోగ్యం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది. కానీ మన పూర్వీకులు మాత్రం ప్రాంతీయంగా పండిన పండ్లనే తినేవారు. సపోటా, మామిడి, సీతాఫలం, జామ, బత్తాయి, నారింజ ఇలా సీజన్ల వారీగా పండే వాటిని కచ్చితంగా తినేవారు.


కానీ ఇఫ్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్, కివీ, యాపిల్ ఇలాంటి వాటన్నింటినీ తింటున్నాం. విదేశాల్లో పండిన ఈ పండ్లు మన చేతుల్లోకి రావాలంటే ఇంచుమించుగా నెల నుంచి రెండు నెలల సమయం పడుతుంది. అయినా అవి నిగనిగలాడుతూనే ఉంటాయి. ఇదేదో కొంచెం తేడాగా అనిపిస్తోంది కదా.. అందుకే రుతువులను అనుసరించి పండే పంటలు తాజాగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి చాలా మంచివి అనే విషయాన్ని తెలుసుకోవాలి.


Images: Shutterstock


 ఇవి కూడా చ‌ద‌వండి


అలనాటి తారల నుంచి.. మనం నేర్చుకోవాల్సిన బ్యూటీ పాఠాలు ఇవే...!


అల్లరి పిడుగు బుడుగు.. మనింట్లో చిచ్చర పిడుగైతే..?


రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..?