ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
అల్లరి పిడుగు బుడుగు.. మనింట్లో చిచ్చర పిడుగైతే..?

అల్లరి పిడుగు బుడుగు.. మనింట్లో చిచ్చర పిడుగైతే..?

ముళ్లపూడి వెంకటరమణ రచించిన బుడుగు(Budugu) నవల గురించి తెలియని తెలుగువారెవరైనా ఉంటారా? ముద్దొచ్చే ఆ మాటలు.. మురిపించే ఆ అల్లరి.. అసలు ఇలాంటి పిల్లాడు మనింట్లో కూడా ఉంటే బాగుండుననిపిస్తుంది. మరి, అలాంటి పిల్లాడే మనింట్లో ఉంటే ఎలా ఉంటుంది? చదివినప్పుడు ఉన్న ముద్దు చూసినప్పుడుంటుందా? నవల చదువుతున్నప్పుడు ఇలాంటి అల్లరి పిడుగు మనింట్లోనూ ఉంటే బాగుండనిపిస్తుంది. అదే పిడుగు మనింట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఓసారి చూద్దాం.

బుడుగుకి ప్రైవేట్ చెప్పడానికి పదిమందో, పదిహేనుమందో ప్రైవేట్ మాస్టర్లు మారతారు. వచ్చిన ప్రతివాడు బుడుగు చేేసే అల్లరికి భయపడిపోయి మరీ పారిపోతుంటాడు. ఎవరైనా పారిపోకపోతే.. గాఠిగా ఏడ్చేసి బామ్మతో తిట్టించి మరీ బయటకు గెంటేస్తాడు. ఇలా మనింట్లో పిల్లలు ఉంటే ఇంకేమైనా ఉందా? వారానికో ట్యూషన్ మాస్టర్‌ని వెతకడమంటే మాటలా? నానా తిప్పలూ పడి ఎవరినైనా తీసుకొచ్చినా బుడుగులా అల్లరి చేస్తే వచ్చినవారు మాత్రం ఏముంటారు చెప్పండి? ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని బోర్డు పెట్టినట్లుగా.. ట్యూషన్ మాస్టర్ కావలెను అని బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంది. పోనీ మనమే వారి చేత హోం వర్క్ చేయిద్దామంటే మన మాట వారు వింటారా?

 1-budugu

బుడుగుకు ప్రైవేటే కాదు.. బడికెళ్లడం కూడా ఇష్టం ఉండదు. అదేంటో బడికెళ్లమనేసరికి పొట్ట మీద, వీపు మీద జెరం వచ్చేస్తుంటుంది. బడి, ప్రైవేటు మానేయాలంటే జెరమో, తలనెప్పో తెచ్చుకోవాలి కానీ కడుపునెప్పి తెచ్చుకోవద్దంటాడు బుడుగు. ఇలాంటి బుడుగులాంటి పిడుగులు మనింట్లోనూ ఉంటారు. రోజూ స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తుంటారు. అచ్చం బుడుగులానే.. కడుపునొప్పని, కాలునొప్పని వంకలు చెబుతుంటారు. అలాంటప్పుడు వారిని బతిమాలడానికి తలప్రాణం తోకకి వస్తుంది. కొన్నిసార్లైతే సహనం చచ్చిపోయి.. వారి వీపు విమానం మోత మోగించైనా సరే స్కూల్లో దింపేసి వస్తాం. కానీ రోజూ ఇలా చేయాలంటే మాత్రం తల ప్రాణం తోకకొచ్చేస్తుంది.

ADVERTISEMENT

5-budugu

తననేమైనా అంటే బుడుగు అసలు ఊరుకోడు. మరీ ఎక్కువగా మాట్లాడితే.. నేనేం చిన్నవాణ్నా చితకవాణ్నా అంటాడు. కుర్రకుంక అంటే అసలు ఊరుకోడు. ఎంత అల్లరి చేసినా సరే తనని ఏమీ అనకూడదంటాడు. ఈ విషయంలో మన పిల్లలు బుడుగుకి ఏ మాత్రం తీసిపోరు. వారిని ఒక్కమాట కూడా అనకూడదు. ఏమైనా అంటే.. వెంటనే తిరుగు సమాధానం చెబుతుంటారు. లేదా ఎదురు ప్రశ్నిస్తారు. తొలుత ఇది బాగానే ఉన్నా.. రాన్రానూ వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఓపిక నశించి విసుగొచ్చేస్తుంటుంది.3-budugu

బుడుగ్గాడి అల్లరి చేసినా చాల ా నిజాయతీపరుడు. అబద్ధం చెబితే అస్సలు ఊరుకోడు. అందుకే పలక పగలదని చెప్పిన విశ్వనాథాన్ని పలక పగలగొట్టి మరీ నిలదీస్తాడు. మనింట్లో పిల్లలు అలా ఉంటే.. ఒక్కసారి ఊహించుకోండి. బాబోయ్ అనిపిస్తోంది కదా. వాస్తవానికి పిల్లలకు నిజ్జంగా నిజం చెప్పడం మాత్రమే వచ్చు. అది మంచి అలవాటే. కానీ కొన్నిసార్లు నిజం చెప్పి మనల్ని ఇరకాటంలో పడేస్తుంటారు. మరీ ముఖ్యంగా నలుగురు బంధువులు ఒకచోట చేరినప్పుడు, ఆఫీసులో కొలీగ్స్ ముందు.. మనం ఇంట్లో మాట్లాడుకొనే విషయాలను తీసుకొచ్చి వారి ముందు చెబుతుంటారు. ‘నాన్నోయ్.. నీకు ఓ అంకుల్ మాట్లాడితే ఒళ్లు మండిపోతుందంటావ్గా.. ఆ అంకుల్ ఈ అంకులేనా?’ అని ప్రశ్నిస్తారు. అది ఈ అంకుల్ కాదురా అంటే.. ‘నువ్వబద్ధం చెబుతున్నావు.. నాకు తెలుసు ఈ అంకులే’ అనేసి ఆడుకోవడానికి వెళ్లిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో తలెక్కడ పెట్టుకోవాలో కూడా మ‌న‌కు తెలీదు. అందుకే బుడుగు అస్తమానూ నిజం చెప్పకూడదని కూడా చెబుతాడు.

2-budugu-telling truth

ADVERTISEMENT

బుడుగుకి బీడీ కాల్చడమంటే ఇష్టం. కానీ కాల్చడు. ఎందుకంటే తను పెద్దవాడు కాబట్టి. ఇంకా పెద్దవాడయ్యాక కాలుస్తాడట. అది కూడా రైలుబండో, జెటకా బండో తోలేటప్పుడు కాలుస్తాడు. అప్పటి వరకు బీడీలు బామ్మ వత్తుల పెట్టెలో దాచుకుంటాడట.  వామ్మో.. మన పిల్లలు కూడా ఇలా ఏ సిగరెట్టో తెచ్చి పెట్టెలో పెడితేనో..? వారి అల్లరిని చూసి మురిసిపోవాలో.. లేకపోతే వారి ఆలోచనలు చూసి బాధపడాలో తెలీదు. అఫ్ కోర్స్.. ఏ పిల్లలూ ఇలా చేయరనుకోండి. కానీ మేం చెప్పదలుచుకొన్నదేంటంటే.. బుడుగు తన బాబాయి, పక్కింటి మొగుడు, జెటకా బండి వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యి బీడీ కాలుస్తానన్నాడు. మరి, మన చుట్టూ ఇలా సిగరెట్, బీడీ వంటివి కాల్చేవారుంటే.. మన పిల్లలూ అవే నేర్చుకొంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని మా ఉద్దేశం.

4-budugu

ముళ్లపూడి వారి బుడుగు పిల్లల ప్రవర్తన, వారి అల్లరికి ప్రతిరూపం. అందుకే తెలుగువారందరికీ బుడుగు అంటే మహా ఇష్టం. అలాంటి అల్లరి పిడుగు ఇంట్లో ఉంటే ఆ హడావుడే వేరు. ఇంకా చెప్పుకోవాలంటే.. పిల్లలు అల్లరి చేయాలి. ఆ అల్లరి అందంగా ఉండాలి. శ్రుతి మించితేనే ఇబ్బంది. ఏమంటారు?

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??

ఇలాంటి చిత్ర‌విచిత్ర‌మైన వ్యక్తులు.. మీకూ మార్కెట్లో ఎదుర‌య్యారా?

లక్ష్యం చేరుకొనే ప్రయాణంలో మనం నేర్చుకొనే విషయాలివే..

06 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT