బ్రా (bra) ఆడవారి వస్త్రధారణలో ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అయితే బ్రాలు, వక్షోజాల (breasts) గురించి మాట్లాడడం మన దేశంలో అత్యంత సున్నితమైన అంశమే. ఇలాంటి అంశాలే బ్రా గురించి మనకు అత్యవసరమైన విషయాలు తెలియకుండా చేస్తుంటాయి.
అయితే ఎంత కాదనుకున్నా.. బ్రాలు మన జీవితంలో తప్పనిసరి విషయం కాబట్టి.. వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో మనం కూడా.. మన జీవితమంతా మనం నిజమని నమ్మిన కొన్ని అపోహల గురించి.. అసలు నిజాల గురించి తెలుసుకుందాం రండి..
1. తెలుపు రంగు బ్రా వేసుకుంటే అస్సలు కనిపించదు.
చాలామంది దుస్తుల కింద తెలుపు రంగు బ్రా వేసుకోవడం వల్ల అది కనిపించకుండా ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఇది సరికాదు.. తెలుపు రంగు టీషర్ట్ వంటివి వేసుకున్నప్పుడు ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే తెలుపు రంగు టీషర్ట్ లేదా కాస్త పల్చగా ఉన్న డ్రస్ వంటివి వేసుకున్నప్పుడు.. తెలుపు బ్రా కంటే చర్మం రంగులో ఉన్న బ్రా (న్యూడ్ బ్రా)ని ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపించండి. ఇది చర్మం రంగులో ఉంటుంది కాబట్టి పెద్దగా కనిపించే అవకాశం ఉండదు.
2. బ్రాలు తరచూ ఉతకకూడదు..
చాలామంది బ్రాలు తరచూ ఉతకడం సరికాదని భావిస్తుంటారు. అందుకే రెండు సార్లు వేసుకుంటే కానీ వాటిని ఉతకరు. కానీ ఇది సరికాదు. ఒకసారి మనం బ్రా వేసుకున్నప్పుడు మన చర్మం, బ్రాకి మధ్య రాపిడి జరిగి.. చెమట దానికి అంటుకొనే అవకాశం ఉంది.
అలాగే వీటిని ఉతకకుండా వేసుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి వేసుకున్న తర్వాత తిరిగి మళ్లీ ఆ బ్రాని వేసుకోవడానికి.. కనీసం 24 గంటలు గ్యాప్ ఇస్తేనే దాని ఎలాస్టిక్ తిరిగి యథాస్థితికి చేరుతుంది. ఇలా చేరకుండా వేసుకుంటే బ్రా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందట.
3. బ్రాలను వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడదు..
ఇది కొంతవరకూ నిజమే. బ్రాలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి వాషింగ్ మెషీన్లో గట్టిగా రుద్దుతూ ఉతకడం వల్ల ఇవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడదని చెబుతుంటారు. కానీ దీనికోసం మనం ప్రత్యేకంగా బ్రాలను చేత్తో ఉతుకుతూ మన సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. మెష్ బ్యాగ్‌లో వేసి చల్లని నీటితో ఉతికితే సరిపోతుంది.
4. బ్రాలను చాలారోజులు ఉపయోగించవచ్చు
బ్రాలు పాడయ్యే వరకూ ఎన్ని సంవత్సరాలైనా ఉపయోగించవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. బ్రాలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. వాటిని తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకూ ఉపయోగించి ఆ తర్వాత పడేయాల్సి ఉంటుంది. కావాలంటే వాడని బ్రాల కప్స్ కట్ చేసి ట్యూబ్ టాప్స్ వంటి వాటికి కుట్టుకోవచ్చు.
5. బ్రాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుంది.
ఇది చాలామందికి ఉండే అపోహ. రొమ్ము క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలుంటాయి. అందులో నిజముందని నిరూపించే పరిశోధనలు ఇప్పటివరకూ లేవనే చెప్పాలి. అంతేకాదు.. బ్రా వల్ల ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయని కూడా తేలలేదు.
6. బ్రా వేసుకొని పడుకోవడం వల్ల రొమ్ములు షేప్ మారకుండా ఉంటాయి.
రొమ్ములు షేప్ మారకుండా ఉండేందుకు.. బ్రాలకు ఏమాత్రం సంబంధం లేదు. బ్రాలు వేసుకోవడం వల్ల రొమ్ములకు కింద నుంచి కాస్త సపోర్ట్‌ని అందిస్తాయి. అంతేకానీ ఇది వేసుకోకపోవడం వల్ల అవి జారిపోయినట్లుగా తయారవుతాయన్నదానికి ఏమాత్రం ఆధారాలు లేవు. గురుత్వాకర్షణ శక్తి, పిల్లలు పుట్టడం వంటి కారణాల వల్ల రొమ్ములు సాగిపోయినట్లుగా తయారవుతాయి.
7. సరైన సైజ్ బ్రా వేసుకోకపోవడం వల్ల రొమ్ములు సాగిపోతాయి.
రొమ్ములు సాగడానికి బ్రాకి ఏమాత్రం సంబంధం లేదు. అయితే గురుత్వాకర్షణ శక్తికి గురై రొమ్ములు కిందకి జారకుండా వాటికి సపోర్ట్ అందించేందుకు మాత్రం బ్రా బాగా ఉపయోగపడుతుంది. కానీ బ్రా లేకుండా అవి సాగుతాయన్న సంగతి నిజం కాదు. బ్రా లేకపోతే రొమ్ములు వాటి యథా స్థితిలోనే ఉండిపోతాయి.
8. రొమ్ముల సైజ్‌కి.. బరువుకి ఏమాత్రం సంబంధం ఉండదు.
మన బరువుకి బ్రా సైజ్‌కి చాలా సంబంధం ఉంటుంది. మనం పెరిగే లేదా తగ్గే ప్రతి రెండున్నర కేజీల బరువుకి మన బ్రా సైజ్ ఒక సంఖ్య తగ్గుతూ వస్తుంది. అంటే ఐదు కేజీల కంటే ఎక్కువ తగ్గితే మీ బ్రా సైజ్ తగ్గించడం, ఐదు కేజీల కంటే ఎక్కువగా పెరిగితే మీ బ్రా సైజ్ పెరగడం జరుగుతుంది. ఎందుకంటే రొమ్ముల్లో ఎక్కువగా ఉండేది కొవ్వు కణజాలమే కాబట్టి బరువు పెరుగుదల, తగ్గుదలకు సంబంధించి మొదటి ప్రభావం వాటిపైనే పడుతుంది.
ఇవి కూడా చదవండి.
అమ్మాయిలూ.. వీటి గురించి అసలు బాధ పడాల్సిన అవసరమే లేదు..!
ఈ ఫ్యాషనబుల్ వస్తువులు.. మీ వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే..!