సంతోషంగా ఉండమని తెలిసినా.. బంధంలో ఎందుకు కొనసాగుతున్నారంటే..?

సంతోషంగా ఉండమని తెలిసినా.. బంధంలో ఎందుకు కొనసాగుతున్నారంటే..?

భార్యాభర్తలు లేదా సహజీవనం చేస్తున్న వారిలో కొన్ని జంటలు తొలుత చాలా అన్యోన్యంగా ఉంటారు. కానీ కొంత కాలం గడిచేసరికి ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడుతుంది. ఇలాంటి వారిలో కొందరు ధైర్యం చేసి విడాకులు తీసుకొంటున్నారు.


కానీ కొంతమంది మాత్రం ఇష్టం లేకపోయినా.. నరకప్రాయంగా ఉన్నా.. ఆ బంధంలోనే కొనసాగుతూ ఉంటారు. సంతోషంగా లేనప్పటికీ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లోనే (toxic relationship)  ఉంటారు. కానీ ఎందుకు? తమ చుట్టూ తాము గిరి గీసుకొని అక్కడి నుంచి.. బయటకు రాకుండా ఎందుకు ఉండిపోతున్నారు? తమను దహించి వేస్తున్న అగ్నినుంచి బయటకు రారెందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనమూ చూద్దాం


పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది?


చాలామంది మహిళలు తమ వైవాహిక బంధంలో సంతోషంగా లేకపోయినప్పటికీ.. ఆ బంధంలోనే కొనసాగడానికి ప్రధాన కారణం పిల్లలు. భర్తకు దూరంగా వెళ్లడం వల్ల తన పిల్లల జీవితం ఏమైపోతుందో అనే ఆలోచనే వారిని ఇంకా ఆ బంధంలో కొనసాగేలా చేస్తుంది.


భర్త నుంచి విడిపోవడం వల్ల తనకు కలిగే ప్రయోజనం కంటే.. అతనితో కలసి ఉండడం వల్ల పిల్లలకు కలిగే మేలే ఎక్కువగా ఉందనే ఆలోచిస్తుంటారు కొందరు. దీని కారణంగానే చాలామంది మహిళలు టాక్సిక్ రిలేషన్ షిప్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. తాను విడాకులు తీసుకోవడం వల్ల తోటి పిల్లలు.. తమ చిన్నారులను గేలి చేస్తారేమోననే కారణం కూడా వారిని ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోనివ్వకుండా అడ్డుకొంటోంది.


1-why-dont-women-get-out-of-unhappy-relationship


ఎవరు ఏమనుకొంటారోననే భయం


చిన్నప్పటి నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకొంటూ పెరిగాం. ముఖ్యంగా "అమ్మాయిలు అలా ఉండాలి.. ఈ పని చేయకూడదు" అని చెబుతూ ఉంటారు. అలా లేకపోతే ఆ తప్పు అమ్మాయిలదే అని కూడా అంటారు. ఈ కారణంతోనే ఎక్కువ మంది శారీరక, మానసిక హింసను ఎదుర్కొంటున్నప్పటికీ ఆ బంధం నుంచి బయటకు రారు. ‘నా భర్తకు నేను విడాకులిస్తే నన్నే వేలెత్తి చూపిస్తారు’, ‘నలుగురిలోనూ నన్ను తక్కువ చేసి మాట్లాడతారు’, ‘విడాకులిస్తే నా తల్లిదండ్రులే నాకు విలువనివ్వరు’, ‘ నా భర్తను వదిలేస్తే నా తల్లిదండ్రుల పరువు ఏమవుతుంది’ అనే ఆలోచనలు టాక్సిక్ రిలేషన్ నుంచి మహిళలను బయట పడకుండా చేస్తున్నాయి.


వారిలో ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణంమన సమాజమే. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్న మహిళను సూటిపోటి మాటలతో వేధించడం సాధారణంగా జరిగే అంశమే. ఆ హింసను తట్టుకొనే కంటే.. ఈ నరకాన్ని అనుభవించడమే మంచిదనే అభిప్రాయం వల్ల మహిళలు హింసాత్మక బంధం నుంచి బయటకు రాలేకపోతున్నారు.


మారతాడేమోననే ఆశ


కొంతమంది పురుషుల్లో మహిళలంటే చాలా చిన్నచూపు ఉంది. ఆ ప్రభావం ఎక్కువగా వారు కట్టుకున్న భార్యపైనే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి భార్యను అవమానిస్తూ మాట్లాడటం, ఆమె తరపు వారిని కించపరుస్తూ మాట్లాడటం వంటివి చేస్తుంటారు. అంతేకాదు.. ఆమెకు సంబంధించిన పనులేమీ అంత ముఖ్యమైనవి కాదనే భావన సైతం వారిలో ఉంటుంది. నాలుగ్గోడల మధ్యే కాదు.. నలుగురిలో ఉన్నప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారు.


ఈ రకమైన మానసిక హింసను అనుభవించడం చాలా కష్టం. ఇలాంటి వారితో బంధంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ నరకం నుంచి బయటపడిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ "ఈ రోజు కాకపోతే రేపు నా భర్తలో మార్పు వస్తుంది. నన్ను ప్రేమగా చూసుకొంటాడు"  అనే ఆలోచనలతో వారు తమ వైవాహిక బంధంలో కొనసాగుతుంటారు. ఏదో ఒక అద్భుతం జరిగి అతనిలో మార్పు వస్తుందేమోననే ఆశతో వారు కాలం వెళ్లదీస్తుంటారు.


2-why-dont-women-get-out-of-unhappy-relationship


సర్దుకుపోదాంలే అనే భావన


మనదేశంలో పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కలసిన బంధంలా కాకుండా.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధంగానే భావిస్తారు. అందుకే భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్ఫర్థలు వస్తే వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే.. భార్యభర్తల మధ్య జరిగే గొడవ వల్ల ప్రభావితం అయ్యేది వారిద్దరు మాత్రమే కాదు.. పిల్లలు, తల్లిదండ్రులు కూడా. అలాగే ఇతర కుటుంబ సభ్యుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. చిన్నగొడవకే ఇంత బాధపడే కుటుంబ సభ్యులు విడాకులు తీసుకొంటే ఇంకెంత బాధపడతారో అనే ఆలోచన కూడా వారిని వెనకడుగు వేసేలా చేస్తోంది. అందుకే మనవారి కోసం కాస్త సర్దుకుపోతే సరిపోతుంది కదా అనే ఆలోచనతో వారు ఉంటున్నారు.


ఒంటరిగా జీవితం కొనసాగించడానికి భయం


కొన్ని అధ్యయనాల ప్రకారం అప్పటి వరకూ కలసి ఉన్న భాగస్వామిని విడిచి.. ఒంటరిగా జీవితం కొనసాగించాలంటే కొందరికి చాలా భయమట. ఇది మహిళలకే కాదు.. పురుషులకూ వర్తిస్తుంది. విడిపోవడానికి ముందున్న భయం కంటే విడిపోయిన తర్వాత వారిలో భయం మరింత పెరిగిందట. ఆ భయం నుంచి బయటపడటానికి తాము సంతోషంగా ఉండమని తెలిసినప్పటికీ తిరిగి తమ భాగస్వామితో కలసి బతకడానికే ప్రాధాన్యమిస్తున్నారట.


Featured Image: Shuttestock


GIFs: Giphy


ఇవి కూడా చేయండి


డిప్రెషన్ మిమ్మల్ని కుంగదీస్తోందా? దాని పని ఇలా పట్టండి


Real love story: నువ్వీ దరినీ.. నేనా దరినీ.. వాట్సాప్ కలిపింది ఇద్దరినీ..


లివిన్ రిలేషన్షిప్ గురించి ప్రతిఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే..!