భాయ్ ఏక్ ఛాయ్ ఔర్ దో బిస్కెట్ …
చిచ్చా .. దో ఛాయ్ .. చార్ బిస్కెట్ లేకే ఆనా!!
ఈ రెండు సంభాషణలు మనకి సాధారణంగా హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రతీ ఇరానీ ఛాయ్ కేఫ్‌లోనూ (Irani Chai Cafes) వినిపిస్తాయి. ఇక హైదరాబాద్‌లో ఇరానీ ఛాయ్ ఎంత ఫేమస్సో అలానే.. బిస్కెట్ కూడా అంతే ఫేమస్. అయితే ఇదేదో సాధారణమైన బిస్కెట్ కాదండి.. చూడడానికి అతి సాధారణంగా కనిపించే అసాధారణమైన ఉస్మానియా బిస్కెట్ (Osmania Biscuit).
హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగి… ఖండాంతరాల్లో ఫేమస్ అయిన ఈ ఉస్మానియా బిస్కెట్ కథ, కమామీషు ఏంటో కాస్త విపులంగా తెలుసుకుందాం.
అసలు ఇంత సాధారణంగా కనిపించే ఈ బిస్కెట్ అసాధారణమైన ఫాలోయింగ్‌ని మూటగట్టుకోవడానికి గల అసలు కారణాలేంటో.. అదే సమయంలో హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రతి ఛాయ్ కేఫ్‌లో ఇవి ఎందుకు ఉంటాయి అనే అంశాలు కూడా ఇక్కడ చర్చించుకుందాం…
ముందుగా ఉస్మానియా బిస్కెట్ ఎలా తయారైందో తెలుసుకుందాం… ఆఖరి నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) తన వంటశాల నిర్వాహకులని.. తమ కోసం ఒక రుచికరమైన చిరుతిండి పదార్ధాన్ని తయారుచేయమని ఆదేశించారట. అయితే ఆ పదార్ధం కూడా కాస్త తీపిగా, కాస్త ఉప్పగా ఉండేటట్టుగా ఉండాలని చెప్పారట. అలా ఆయన ఆదేశాల మేరకు నైజాం వంట మాస్టార్లు తయారుచేసిన పదార్థమే ఈ బిస్కెట్.
చూడడానికి చాలా సాదాసీదాగా ఉండే ఈ బిస్కెట్‌ని తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు కూడా చాలా మామూలివే – మైదా పిండి, వెన్న, పాలు, ఉప్పు & చక్కెరను ఈ బిస్కెట్ తయారీకి ఉపయోగిస్తారట. ఇక ఈ బిస్కెట్‌ని తయారుచేసిన కొత్తలో వీటి రుచి బాగుండడంతో పాటుగా.. త్వరగా జీర్ణమయ్యే తిండిగా ప్రసిద్ధి చెందడంతో.. వీటిని అప్పటికే నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రిలోని (Osmania Hospital) రోగులకు పంచేవిధంగా నిజాం ప్రభువులు ఆర్డర్ ఇచ్చారట. తద్వారా ఈ బిస్కెట్లకి ఉస్మానియా బిస్కెట్స్ అనే పేరు వచ్చిందని కూడా అంటుంటారు.
మరికొంతమంది మాత్రం ఈ బిస్కెట్స్‌ని ఉస్మానియా ఆసుపత్రికి ఎదురుగా ఉన్న బేకరీలో విక్రయించేవారని.. అందుకనే వీటికి ఆ పేరు వచ్చిందని కూడా చెబుతుంటారు. ఏదేమైనప్పటికి ఈ బిస్కెట్స్‌కి హైదరాబాద్ నుంచి ఎప్పటికి వేరు చేయలేని పేరు మాత్రం లభించింది. ఆ తరువాత కాలంలో ఇవే బిస్కెట్స్ రకరకాల రూపాలలో కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే అందులో బాగా పేరుతెచ్చుకున్నది మాత్రం “చాంద్ బిస్కెట్”. ఈ బిస్కెట్ అర్ధచంద్రాకారంలో ఉండడంతో.. దీనికి చాంద్ బిస్కెట్ అనే పేరు రావడం జరిగింది. ఈ బిస్కెట్ కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ అని చెప్పాలి.
ఇక ఈ బిస్కెట్లకి సామాన్య పౌరుడి దగ్గర నుంచి ప్రముఖ సెలబ్రిటీల వరకూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారట. ఉదాహరణకి ప్రముఖ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు.. ఆయనను ఆ నగరానికి సంబంధించి తనకు నచ్చిన మూడు విషయాలు చెప్పమని.. మీడియావాళ్లు అడిగారట. అందుకు ధోని తనకు నచ్చినవాటిలో బిర్యానీతో పాటు ఉస్మానియా బిస్కెట్ కూడా ఒకటని తెలిపారట. హైదరాబాద్ వచ్చే అనేకమంది సెలెబ్రిటీలు సైతం ఇక్కడ రుచి చూడాలనుకునే పదార్ధాలలో ఉస్మానియా బిస్కెట్ కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఈ బిస్కెట్లకి ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడానికి మరొక కారణం.. వీటి ధర అత్యంత స్వల్పంగా ఉండడమే. చాలా చౌక ధరలోనే ఇవి లభిస్తుండడంతో హైదరాబాద్‌లో నివసించే రోజు కూలీల దగ్గర నుంచి సామాన్య ప్రజానీకం వరకు ఉదయాన్నే ఒక ఇరానీ ఛాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కెట్‌ని తమ అల్పాహారంగా తీసుకుని దినచర్యని ప్రారంభిస్తుంటారు.
ఇటు చూడడానికి సాధారణంగా ఉంటూ లభ్యతలోనూ చాలా చౌకగా ఉండడమే కాకుండా.. అటు పోషణ విలువల్లోనూ సమృద్ధిగా ఉండే ఈ ఉస్మానియా బిస్కెట్స్‌కి ఆదరణ ఎలా తగ్గుతుంది మీరే చెప్పండి. అందుకనే అసలైన హైదరాబాదీ ఎవ్వరూ కూడా ఈ ఉస్మానియా బిస్కెట్ లేని హైదరాబాద్‌ని ఊహించుకోలేరు. అంతలా ఇక్కడ ప్రజానీకంతో ఈ బిస్కెట్ మమేకమైపోయింది.
ఇది హైదరాబాద్ కి షాన్ “ఉస్మానియా బిస్కెట్” హిస్టరీ. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు సాయంత్రం “ఏక్ ఛాయ్ ఔర్ దో ఉస్మానియా బిస్కెట్”కి మీరూ సిద్ధమైపొండి!
హైదరాబాద్‌లో ఉస్మానియా బిస్కెట్స్ లభ్యమయ్యే పలు షాపుల వివరాలు ఇవే..!
1.సుభాన్ బేకరి, నాంపల్లి మార్కెట్ రోడ్, లక్డీకపూల్
2.నిమ్రా కేఫ్ అండ్ బేకరి, చార్మినార్, హైదరాబాద్
3.కేఫ్ నిలోఫర్, రెడ్ హిల్స్ రోడ్, లక్డీకపూల్
4.కరాచీ బేకరి, కూకట్పల్లి
5.కేఎస్ బేకర్స్, కేపీహెచ్‌బీ కాలనీ
6.పిస్తా హౌస్, నిజాంపేట
7.టొస్ట్ స్నాక్స్ సెంటర్, పంజాగుట్ట
8.ఎంఎం బేకర్స్, ఉప్పల్
Featured Image: Captures By Adi
ఇవి కూడా చదవండి
రంజాన్ సీజన్ స్పెషల్.. హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??
ఈ వేసవి సెలవుల్లో.. మీరు తెలంగాణలో చూడదగ్గ ఎకో – టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!
హైదరాబాద్‌లో బెస్ట్ ‘హలీమ్’ రుచి చూడాలంటే.. ఈ 10 హోటల్స్‌కి వెళ్లాల్సిందే..!