మరోసారి ప్రేక్షకులని 'ఫిదా' చేస్తామంటున్న సాయి పల్లవి - శేఖర్ కమ్ముల

మరోసారి ప్రేక్షకులని 'ఫిదా' చేస్తామంటున్న సాయి పల్లవి - శేఖర్ కమ్ముల

సాయి పల్లవి (Sai Pallavi) తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికి.. ఆమెకి తెలుగునాట ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఇక్కడి ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తెలుగులో చేసిన మొదటి చిత్రం 'ఫిదా'తో (Fidaa)  అందరిని ఫిదా చేసేసింది.

ఫిదా చిత్రం కోసం తెలుగు భాషని.. అందులోనూ తెలంగాణ మాండలికాన్ని కూడా నేర్చుకుని, భానుమతి పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది సాయి పల్లవి. ఆ చిత్రంలో ప్రదర్శించిన అభినయంతో.. ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులో పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం విశేషం.  ఈ సినిమాలోని నటనకు గాను అనేక అవార్డులను కూడా ఆమె కైవసం చేసుకుంది. 

ఇక సాయి పల్లవితో 'ఫిదా' వంటి ఒక సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన శేఖర్ కమ్ముల (Sekhar Kammula).. ఇప్పుడు మరోసారి ఆమెని హీరోయిన్‌గా ఎంపిక చేయడం గమనార్హం.  వివరాల్లోకి వెళితే, 2017లో ఫిదా చిత్రం ఘన విజయం తరువాత.. శేఖర్ కమ్ముల చేసే తదుపరి చిత్రంపై సినీ అభిమానులకు మరింత ఆసక్తి పెరిగింది. ఈ తరుణంలో దాదాపు.. రెండు సంవత్సరాల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టడం విశేషం. 

Naga Chaitanya Sekhar Kammula

తాజాగా అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఆగష్టులో సెట్స్ పైకి వెళ్లి.. ఈ సంవత్సరాంతంలో విడుదలవుతుందనేది సమాచారం. 

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. ఇక సాంకేతిక వర్గ ఎంపిక మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది.  ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్‌ని కూడా రెండు లేదా మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నారట. 

అయితే ఒక కథ తనకి పూర్తి స్థాయిలో నచ్చితే తప్ప.. ఏ ప్రాజెక్టు కూడా టేకప్ చేయరని శేఖర్ కమ్ములకు పేరుంది.  అలాంటిది చాలా గ్యాప్ తర్వాత.. ఆయన మళ్లీ దర్శకత్వం వహిస్తుండడంతో.. ఈ ప్రాజెక్టుపై ట్రేడ్ వర్గాలకు కూడా మంచి అంచనాలే ఉన్నాయి.  

అదే సమయంలో హిట్ కాంబినేషన్‌ని బలంగా నమ్మే మన పరిశ్రమలో, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబో‌ని పాజిటివ్‌గానే ప్రేక్షకులు తీసుకుంటారని చెప్పచ్చు. అదే సమయంలో శేఖర్ కమ్ముల సైతం సినిమాని ప్రేమించి తీస్తాడు తప్ప, కమర్షియల్ ఆలోచనలతో సినిమా తీసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఇక సాయి పల్లవి, నాగ చైతన్యలు ఇరువురు కూడా తమ కెరీర్‌ విషయంలో.. ఇప్పటివరకూ ఆచితూచి అడుగులు వేసినవారే. 

సాయి పల్లవి విషయానికి వస్తే.. గత వారమే వేణు ఉడుగుల (Venu Udugula) దర్శకత్వంలో ఆమె నటిస్తున్న విరాట పర్వం (Virata Parvam) చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానరుపై సినిమా తెరకెక్కుతోంది. అలాగే నాగ చైతన్య విషయానికి వస్తే, వెంకీ మామ (Venky Mama) అనే మల్టీ స్టారర్‌లో తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో (Victory Venkatesh) తాను నటించడం విశేషం. ఈ చిత్రం ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. 

Sai Pallavi

అయితే సాయి పల్లవి గత చిత్రం "పడి పడి లేచే మనసు" (Padi Padi Leche Manasu) బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడగా.. నాగ చైతన్య మజిలీ (Majili) చిత్రం హిట్ అనిపించుకుంది. మరి వీరిద్దరూ కలిసి చేయబోతున్న ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.  

ఇవి కూడా చదవండి

ఆ నిమిషం నేను సినిమాలు వదిలేసి మెడిసిన్ చేద్దామనుకున్నా : సాయి పల్లవి

మన వెండితెర ముద్దుల 'రౌడీ'ల గురించి.. ఈ విశేషాలు మీకు తెలుసా?

నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య