డాక్టర్. ముత్తులక్ష్మీ రెడ్డి ఎవరు..? ప్రతీ మహిళ ఆమె గురించి ఎందుకు తెలుసుకోవాలంటే..?

డాక్టర్. ముత్తులక్ష్మీ రెడ్డి ఎవరు..? ప్రతీ మహిళ ఆమె గురించి ఎందుకు తెలుసుకోవాలంటే..?

ఆమె వైద్యురాలు (doctor) మాత్రమే కాదు.. రాజకీయ నాయకురాలు.. అలాగే స్త్రీల హక్కుల కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారిణి కూడా. శాసన మండలి సభ్యురాలిగా (legislator) దేవదాసీ విధాన రద్దు కోసం అహర్నిశలు పోరాడిన ఆమె.. నిర్బంధ వ్యభిచారాన్ని రద్దు చేయాలని.. స్త్రీల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు ఉండాలని పోరాటం చేసిన మొదటి మహిళ. 1931 సంవత్సరంలోనే అఖిల భారతీయ మహిళల సదస్సుకి అధ్యక్షత వహించి.. భారతీయ మహిళలు మొత్తం తమ హక్కుల కోసం పోరాడాలని.. విద్య అనేది ప్రతీ మహిళ కనీస హక్కని చాటి చెప్పిన మడమ తిప్పని మగువ ముత్తులక్ష్మీ రెడ్డి. 

ఆడపిల్లల హక్కుల కోసం ఆంక్షలు ఉన్న ఆ కాలంలోనే.. వైద్యపట్టా అందుకొని.. 1912లో ఒక చరిత్రనే తిరగరాశారు ముత్తులక్ష్మీ రెడ్డి. ఆమె ప్రేరణతో తర్వాతి కాలంలో ఎందరో మహిళలు.. వైద్యవిద్య వైపు మొగ్గు చూపారంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు స్వయంగా "స్త్రీధర్మ"  అనే ఒక పత్రికను స్థాపించి అందులో స్త్రీల ఆరోగ్య సమస్యలు, స్త్రీ విద్య, స్త్రీ హక్కులు, మహిళాభ్యుదయం ఇత్యాది అంశాలపై విరివిగా వ్యాసాలు రాసేవారామె. ఆ విధంగా.. ఆమె ఎందరో మహిళలకు ప్రేరణగానూ నిలిచారు. 

రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?

అనీ బీసెంట్ లాంటి మహిళలు సైతం.. ముత్తులక్ష్మీరెడ్డిని చూసి ఎంతో నేర్చుకున్నామని కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి. ముత్తులక్ష్మీ తండ్రి నారాయణ స్వామి అయ్యర్ మద్రాసు మహారాజా కళాశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసేవారు. ఆయన ఓ దేవదాసీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు చంద్రమ్మాళ్. చిన్నప్పటి నుండీ ముత్తులక్ష్మిపై తన తల్లి ప్రభావం ఎంతగానో ఉండేది. ఆమె ద్వాారా దేవదాసీ మహిళలు ఎదుర్కొనే సమస్యలను గురించి చిన్నప్పుడే తెలుసుకున్నారు. ఏదో ఒక రోజు ఆ దేవదాసీ విధానాన్ని రద్దు చేసేందుకు పోరాడుతానని.. చిన్నప్పుడే ఓ సంకల్పం చేసుకున్నారు. తాను పెద్దయిన తర్వాత.. శాసన మండలి సభ్యురాలిగా పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చాక.. దేవదాసీ విధానాన్ని రద్దు చేయడం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. 

మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

 

వైద్యురాలిగా ముత్తులక్ష్మీ కెరీర్ బ్రహ్మాండంగా కొనసాగుతున్నా.. ఒక వైపు ఇంట్లో వారి పోరు, బంధువుల పోరు ఆమెను అసహనానికి గురి చేస్తూనే ఉండేవి. 14 ఏళ్లకే, 15 ఏళ్లకే పూర్వకాలంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిగేవని.. ముత్తు లక్ష్మీకి పాతికేళ్లు వచ్చినా.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటని ఆమెను సూటిపోటి మాటలతో వేధించిన వారూ లేకపోలేదు. అయినా ఆమె తన అభిమతం మేరకే.. తనకు నచ్చిన వ్యక్తినే.. తనకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంది. ఒక వైద్యురాలిగా తాను చేరాలని భావించిన లక్ష్యాలు అన్నీ కూడా చేరుకున్నాకే.. 28 ఏళ్ల వయసులో.. తన సహాధ్యాయి, తెలుగు వ్యక్తి సుందర రెడ్డిని పెళ్లి చేసుకుంది. 

మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యాక.. ఆమె తీసుకొచ్చిన ప్రతిపాదనలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. భారతదేశంలో మహిళలకు ప్రత్యేకంగా ప్రసూతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె ఓ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. అది అమలు చేసేవరకు.. ఆమె ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. అలాగే పబ్లిక్ ప్రాంతాలలో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలని మొదటిసారి ప్రతిపాదన తీసుకొచ్చిన వ్యక్తి కూడా ముత్తులక్ష్మీ రెడ్డి కావడం గమనార్హం.

చదరంగంలో నేటి తరానికి స్ఫూర్తి.. గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక..!

ముత్తులక్ష్మీ రెడ్డి ఇంగ్లీషు, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల కోసం ఆమె ఎంతగానో బాధపడేవారు. తర్వాత అసలు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చేయడానికే భారతదేశంలో అనువైన పరిస్థితులు లేవని చింతించేవారు. అప్పుడు ఆమె ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్. తర్వాత అదే సంస్థను ప్రభుత్వం తన ఆధ్వర్యంలోకి తీసుకుంది. ఇలా ముత్తులక్ష్మీ రెడ్డి గురించి చెప్పుకుంటే ఎన్నో విశేషాలున్నాయి.

ఈ రోజు ఆమె 133వ జయంతి సందర్భంగా.. గూగుల్ ఓ డూడుల్‌ను కూడా రూపకల్పన చేసింది. భారతీయ మహిళల కోసం తన జీవితంలో ఎంతో చేసిన.. ఆ మహా పోరాటయోధురాలిని మనం కూడా స్మరించుకుందామా..!