విదేశాల నుంచి వచ్చినా.. ప్రేక్షకుల మనసు దోచేశారీ హీరోయిన్లు..!

విదేశాల నుంచి వచ్చినా.. ప్రేక్షకుల మనసు దోచేశారీ హీరోయిన్లు..!

సినిమా రంగం అంటే చాలు.. అది పూర్తిగా గ్లామర్‌తో నిండి ఉంటుందని కొందరి భావన. అయితే గ్లామర్ మాత్రమే కాదు..హీరోయిన్లు (actresses) సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ కూడా ఎంతో అవసరం. అలాంటి టాలెంట్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లో ఉన్నా సరే.. వారిని వెతికి మరీ అవకాశమిస్తారు దర్శక నిర్మాతలు. అందుకే మన బాలీవుడ్ సినిమాల్లోనే కాదు.. దక్షిణాది చిత్రాల్లో కూడా ఎంతో మంది హీరోయిన్లు విదేశాల (Foreign countries) నుంచి వచ్చి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.

కత్రినా కైఫ్

Instagram

మన దేశంలో టాప్ కథానాయికల లిస్టులో కత్రినా కైఫ్ ముందుంటుంది. అయితే కత్రినా కైఫ్ సొంతూరు లండన్. అక్కడే పుట్టి పెరిగిన ఈ భామ మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత ఎంప్లాయ్ మెంట్ వీసాపై భారత్‌కి వచ్చిన కత్రినా 2007లో "బూమ్" చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అది విజయం సాధించలేకపోయినా.. ఆ తర్వాత ఆమెకు చాలా అవకాశాలొచ్చాయి. హిందీతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లోనూ కత్రినా నటించింది. ఆ తర్వాత అక్షయ్ సరసన నటించిన "నమస్తే లండన్" సినిమాతో విజయాన్ని చవి చూసిన ఆమె కొన్ని సంవత్సరాల్లోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.

సన్నీ లియోనీ

Instagram

అవడానికి భారత మూలాలున్న వ్యక్తే అయినా.. సన్నీ లియోని పుట్టింది పెరిగింది మొత్తం కెనడా లోనే. అక్కడి ఒంటారియో ప్రాంతంలో ఆమె పెరిగింది. ఆమె తండ్రి టిబెట్‌కి చెందిన వారైతే.. తల్లి హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన వ్యక్తి. ఇప్పటికీ ఆమెకు కెనడా పౌరసత్వం ఉంది. చిన్నతనంలోనే వివిధ ఉద్యోగాలు చేయడం ప్రారంభించిన సన్నీ ఇరవై ఏళ్ల వయసులో పోర్న్ స్టార్‌గా మారింది. ఆ రంగంలో కొన్నేళ్ల పాటు నటించిన తర్వాత.. 2011లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2012లో విడుదలైన 'జిస్మ్ 2' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించింది. ఎంటీవీ షోలలోనూ కనిపిస్తూ బాలీవుడ్‌లో టాప్ స్థానానికి చేరుకుంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Instagram

సిలోన్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని కూడా గెలుచుకుంది. 2006లో ఆ కిరీటాన్ని సాధించిన జాక్ 2009లో 'అల్లాద్దీన్' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హౌజ్ ఫుల్ 2, రేస్ 2, కిక్ వంటి సినిమాలతో టాప్ కథానాయికల్లో ఒకరిగా మారిపోయింది ఈ శ్రీలంకన్ బ్యూటీ. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' చిత్రంలో 'బ్యాడ్ బాయ్' అనే పాటలో తన సరసన డ్యాన్స్ కూడా చేసి.. తెలుగులోకి అడుగుపెట్టింది జాక్వెలిన్.

అమీ జాక్సన్

Instagram

అమీ లూయిస్ జాక్సన్.. బ్రిటన్‌కి చెందిన ఓ ప్రముఖ మోడల్.. నటి.. ఆమెను ఓ అవార్డు ఫంక్షన్‌లో చూసిన  దర్శకుడు ఒకరు ఆమెను తమిళ చిత్రం 'మదరాసు పట్టణం' సినిమాలో కథానాయికగా ఎంచుకున్నారు. బ్రిటిష్ అమ్మాయికి, భారతీయ యువకుడికి మధ్య చిగురించే ప్రేమకు సంబంధించిన ఈ కథలో అమీ అద్భుతమైన నటనను చూసి.. ఆమెకు ఆపై అవకాశాలు చాలా వచ్చాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీ సినిమాల్లోనూ కనిపించి ఆకట్టుకుంది. శంకర్ దర్శకత్వంలో ఆమె నటించిన ఐ, రోబో 2.0 చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించి పెట్టాయి.

నర్గీస్ ఫక్రీ

Instagram

అమెరికా నుంచి వచ్చి బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న కథానాయిక నర్గీస్ ఫక్రీ. ఆమె తండ్రి పాకిస్థానీ, తల్లి చెక్ రిపబ్లిక్‌కి చెందిన వ్యక్తి. అయితే ఆమెకు ఆరేళ్ల వయసున్నప్పుడే.. తల్లిదండ్రులు విడిపోవడంతో అమెరికన్ మూలాలున్న వ్యక్తిగానే పెరిగింది. రణ్ బీర్ కపూర్ సరసన 'రాక్ స్టార్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మద్రాస్ కెఫె, స్పై, అజార్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. కేవలం నటించడం మాత్రమే కాదు.. పాటలు పాడడంలోనూ నర్గీస్‌కి మంచి అనుభవం ఉంది.

లీసా హేడెన్

Instagram

లీసా హేడెన్ ఆస్ట్రేలియాకి చెందిన నటి, మోడల్, టీవీ ప్రజెంటర్. 2010లో 'ఆయేషా' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది లీసా. తర్వాత కంగన సరసన 'క్వీన్'లో నటించిన ఆమె.. ఆ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని కూడా సాధించింది. ఎన్నో మ్యాగజైన్ల కవర్లపై మెరిసిన ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న లీసా.. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీకి సిద్ధం అంటోంది.

మాహిరా ఖాన్

Instagram

మాహిరా హఫీజ్ ఖాన్.. పాకిస్థాన్‌కి చెందిన కథానాయిక . అక్కడ కేవలం సినిమాల్లోనే కాదు.. టీవీ సీరియళ్లలోనూ నటించి మంచి పేరు సాధించింది. అదే ఆమెను బాలీవుడ్‌లో మొదటి చిత్రంలోనే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సరసన నటించేలా చేసింది. షారూఖ్ సరసన "రేయిస్" చిత్రంలో నటించిన మాహిరా ఆపై మరే బాలీవుడ్ చిత్రంలోనూ కనిపించకపోవడం గమనార్హం. ఇక ఇప్పుడు భారతీయ చిత్రాల్లో పాకిస్థానీ నటులపై నిషేధం విధించాక.. ఆమె మళ్లీ బాలీవుడ్‌లో నటించే అవకాశం లేకపోయినా.. ఎంటీవీలో హోస్ట్‌గా.. అలాగే వివిధ ఇంటర్నేషనల్ ఛానళ్ల కార్యక్రమాల్లో కనిపిస్తూ యాక్టివ్‌గానే ఉంటోంది.

నోరా ఫతేహీ

Instagram

ఈ మధ్యే 'ఓ సాకి సాకి' అంటూ 'బట్లా హౌజ్' సినిమాలో ఆడి పాడి ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది అందాల భామ నోరా ఫతేహీ. ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో కనిపించడంతో పాటు టీవీ షోలు.. మ్యూజిక్ ఆల్బంలతో అభిమానులను ఆకర్షిస్తోంది. కెనడాలో పుట్టి పెరిగిన ఈ భామ కేవలం హిందీ సినిమాల్లోనే కాదు.. తెలుగు చిత్రాల్లోనూ ప్రత్యేక గీతాల్లో నర్తించింది. బాహుబలి చిత్రంలోని 'మనోహరీ' పాటతో పాటు టెంపర్‌లో 'ఇట్టాగె రెచ్చిపోదాం'.. ఊపిరి సినిమాలో 'డోర్ నంబర్ 36' పాటలో కనిపించి ఆకట్టుకుంది.

ఈవ్లిన్ శర్మ

Instagram

ఈవ్లిన్ శర్మ జర్మనీకి చెందిన అమ్మాయి. ఆమె తల్లి జర్మన్ దేశస్థురాలు.. తండ్రి పంజాబీ. దీంతో జర్మన్ సిటిజన్ షిప్ ఉన్నా భారతీయ సినిమాల్లో కనిపించింది ఈవ్లిన్. అయితే వీటికంటే ముందు ఆమె హాలీవుడ్‌లో 'టర్న్ లెఫ్ట్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత హిందీలో 'ఫ్రం సిడ్నీ విత్ లవ్' అనే చిత్రంలో నటించింది. కానీ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం 'యారియా' అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్, శ్రద్ధా కపూర్‌లు జంటగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న 'సాహో' చిత్రంలో జెన్నిఫర్ అనే పాత్రను పోషించనుంది. ఈ సినిమా ద్వారా ఈవ్లిన్ టాలీవుడ్‌లో అడుగుపెట్టనుండడం విశేషం.

క్రిస్టీనా అఖీవా

Instagram

క్రిస్టీనా తల్లిదండ్రులిద్దరూ రష్యాకి చెందిన వారే. ఆమె పుట్టింది కూడా రష్యాలోనే. అయితే తనకు ఏడేళ్ల వయసులో ఆస్ట్రేలియా వెళ్లింది క్రిస్టీనా. ఆ తర్వాత 21 సంవత్సరాల వయసులో.. ఓ మోడలింగ్ కాంట్రాక్ట్‌లో భాగంగా సింగపూర్ వెళ్లిన ఆమె.. ఆ తర్వాత ఆరేళ్ల పాటు సింగపూర్, ఆస్ట్రేలియాలతో పాటు మరో నాలుగు దేశాల్లో మోడలింగ్ చేసింది. అందులో భారత్ కూడా ఒకటి. ఆమె మోడలింగ్ చేస్తున్నప్పుడు తనను చూసిన ఓ దర్శకుడు ఆమెకు హిందీలో సన్నీ డియోల్ హీరోగా నటించిన 'యమ్లా పగ్లా దీవానా' చిత్రంలో అవకాశం అందించాడు. ఆ తర్వాత ఆమె తెలుగులో ఆది సరసన గాలిపటం, కన్నడంలో ఉపేంద్ర సరసన ఉప్పి 2 సినిమాల్లో నటించింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.