తను సెక్స్ కోసం బ్లాక్ మెయిల్ చేసినా అలా చేసి తప్పించుకున్నా..

తను సెక్స్ కోసం బ్లాక్ మెయిల్ చేసినా అలా చేసి తప్పించుకున్నా..

ప్రేమ.. ఏ స్వార్థం లేనిది.. ఒకరి మనసులో ప్రేమ ఉంటే ఆ ప్రేమించే వారి ఆనందం కోసం ఏమైనా చేస్తారట. అంతేనా.. ఒకవేళ వారు తమని ప్రేమించట్లేదని తెలిసినా.. వారి శ్రేయస్సు కోరి జీవిస్తారే తప్ప వారిని ఇబ్బంది పెట్టడానికి ఏమాత్రం ప్రయత్నించనిది నిజమైన ప్రేమ. కానీ ఈరోజుల్లో ప్రేమ పేరుతో మోసాలు, ప్రేమించకపోతే దాడులు వంటివి సహజంగా మారిపోయాయి. కామాంధుల చేతుల్లో అమ్మాయిలు మోసపోతూ ఉంటారు. ఇలా మోసం చేసిన ఓ వ్యక్తికి బుద్ధి చెప్పింది ఓ అమ్మాయి. తన కథేంటో తెలుసుకుందాం.

నేను ఓ చిన్న పల్లెటూళ్లో పుట్టి పెరిగాను. మా ఊళ్లో మా నాన్న పెద్ద మనిషి. ఆయన గురించి అందరికీ తెలుసు. మా అన్నయ్యలకు కూడా మంచి పేరుంది. దీంతో అందరికీ నేను కూడా తెలుసు. నేను కూడా ఎప్పుడూ నాన్న చెప్పిన మాట దాటలేదు. చిన్నతనం నుంచీ అమ్మాయిల స్కూల్, కాలేజీలోనే చదువుకున్నాను. ఇంటర్ తర్వాత ఊరికి దూరంగా పట్టణానికి వెళ్లి చదువుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ కాలేజీ కో ఎడ్యుకేషన్ కాలేజీ.. అబ్బాయి లతో స్నేహం, మా ఊరు కాకపోవడంతో ఉండే స్వేచ్ఛ ఇవన్నీ నాకెంతో నచ్చాయి. అదో పెద్ద కలలా అనిపించేది. నేను చాలా సంప్రదాయబద్ధంగా పెరిగాను. ఊళ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ చుడీదార్లు మాత్రమే వేసుకునేదాన్ని. కాలేజీ కోసం సిటీకి వచ్చిన తర్వాత కూడా కుర్తీలు మాత్రమే వేసుకునేదాన్ని. నా స్నేహితులందరూ మోడ్రన్ దుస్తుల్లో వస్తుంటే నేను మాత్రం ఎప్పుడూ వాటిని ధరించే ధైర్యం చేయలేకపోయా. అప్పుడప్పుడూ మాత్రం ధైర్యం చేసి జీన్స్, టీషర్ట్ వేసుకోగలిగేదాన్ని. అంతకంటే ఎక్కువగా నా స్నేహితుల్లా ఫ్యాషన్ మాత్రం ఫాలో అవ్వలేకపోయేదాన్ని. అంతేకాదు.. అంతకుముందెప్పుడూ అబ్బాయిలతో కలిసి చదవకపోవడం వల్ల వారితో అంత ఫ్రీగా ఉండేదాన్ని కాదు. చాలా రిజర్వ్ డ్ గా ఉండేదాన్ని.

కానీ నాలో తన వల్ల మార్పు వచ్చింది. తను మా క్లాస్ లోనే అందమైన, చక్కటి మాట తీరు కలిగిన అబ్బాయి. నేను అబ్బాయిలతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీలవుతున్నానని అర్థం చేసుకొని నేను ఆ వాతావరణంలో కలిసిపోయేందుకు ఎంతో ప్రయత్నం చేశాడు. అది నాకు నచ్చింది. అలా ఓరోజు తను నన్ను తనతో పాటు కలిసి కాఫీ తాగడానికి పిలిచాడు. నేను సరేనన్నా. అలా మా స్నేహం ప్రారంభమైంది. కాలేజీ మొదటి సంవత్సరం మొత్తం మేం ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. అలా మేం ఎప్పుడు స్నేహితుల నుంచి ప్రేమికులమయ్యామో మాకే తెలీదు. తను నా మొదటి బాయ్ ఫ్రెండ్ (boy friend). నేను మొదటి సారి ముట్టుకున్న, ముద్దు పెట్టుకున్న అబ్బాయి తనే. తను కాలేజీ దగ్గర రూమ్ లో ఉండేవాడు. కొన్నిసార్లు మేమిద్దరం అలా నడుచుకుంటూ వెళ్తూ మిగిలిన వారి నుంచి దూరంగా మాకంటూ కాస్త వ్యక్తిగత సమయాన్ని గడిపేవాళ్లం. కొన్నిసార్లు వాళ్లింట్లో కూడా కలిసేవాళ్లం. కానీ ఎప్పుడూ ముద్దుల కంటే ముందుకు పోలేదు. పెళ్లయ్యాకే సెక్స్ (sex) లో పాల్గొనాలని నేను భావించా. అందుకే ఎప్పుడూ ముద్దుల కంటే ముందుకు వెళ్లే దాన్ని కాదు. ఒక రోజు అలా వాళ్లింట్లో కలిసినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. నేను ఏదో ఒక కారణం చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశాను. నేను తనని ప్రేమించాను. కానీ సెక్స్ కోసం అప్పుడే సిద్ధంగా లేనని చెప్పేశాను. తను కూడా నన్ను అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత పరీక్షలు, వేసవి సెలవులు వచ్చేశాయి. సెలవుల్లో నేను మా ఇంటికి వెళ్లాను. అక్కడున్నా తనతో ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేసేదాన్ని. ఒక రోజు రాత్రి నా బాయ్ ఫ్రెండ్ నిన్ను మిస్సవుతున్నా.. ఓ సెల్ఫీ పంపు అన్నాడు . నేను పంపాను. ఇది కాదు కాస్త రొమాంటిక్ గా ఉన్నది పంపు అన్నాడు. నా బాయ్ ఫ్రెండ్ కదా అన్న ధైర్యంతో సెక్సీగా ఉన్న నా ఫొటోలను తనకు పంపాను. ఆ తర్వాత మేం మామూలుగానే మాట్లాడుకున్నాం.

రెండో సంవత్సరం కాలేజీ ప్రారంభం కాగానే నేను తనని చూసేందుకు చాలా ఉత్సాహంగా కాలేజీకి వెళ్లాను. తను కనిపించగానే నా ముఖంలో నవ్వు కనిపించింది. కానీ నా బాయ్ ఫ్రెండ్ మాత్రం నన్ను పక్కకి తీసుకెళ్లి నీతో అర్జంట్ గా మాట్లాడాలి అన్నాడు. అప్పటికి కాలేజీ ఉండడంతో ఆ సాయంత్రం తన రూమ్ లో కలుద్దాం అని నిర్ణయించుకొని క్లాసుకెళ్లాం. ఆ తర్వాత సాయంత్రం తన రూమ్ కి వెళ్లాను. తను చాలా మూడీగా ఉన్నట్లు కనిపించాడు. మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించాం. ఆ మధ్యలో తను తన ఫోన్ లో ఉన్న నా ఫొటోలు, మా ఇద్దరి రొమాంటిక్ ఛాట్స్ అన్నీ చూపించాడు. అవన్నీ చూపించి నేను తనతో సెక్స్ కోసం ఒప్పుకోవాలని లేదంటే ఈ మెసేజ్ లు, ఫొటోలు అందరికీ చూపిస్తానని.. ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. నాకు భయంతో ఏం చేయాలో అస్సలు తోచలేదు. అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయాను. ఆ రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఆ తర్వాత ఓ వారం, పది రోజుల పాటు తను నన్ను అలా బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యలో తను నాతో మామూలుగా మాట్లాడిందే లేదు. బెదిరించడానికి తప్ప ఫోన్ చేయలేదు. మెసేజ్ లైతే అసలే లేవు.

ఈ సమయంలో నేను డల్ గా ఉండడం మా టీచర్ గమనించారు. ఏం జరిగిందని ఆవిడ అడగ్గానే నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. తను ఇచ్చిన ధైర్యంతో మా అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను ముందు నన్ను తిట్టినా నా పరిస్థితి అర్థం చేసుకొని ధైర్యంగా ఉండేలా చేసింది. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి మా టీచర్ తనని ప్రిన్సిపల్ రూమ్ కి పిలిపించింది. అక్కడ ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చి నా ఫొటోలను డిలీట్ చేయించారు. మళ్లీ తన వల్ల నాకేమైనా ఇబ్బంది ఉందని కంప్లైంట్ వస్తే కాలేజీ నుంచి తొలగిస్తామని మరెక్కడా అడ్మిషన్ కూడా దొరక్కుండా చేసి తన జీవితం అక్కడితో ఆగిపోయేలా చేస్తామని చెప్పడంతో తను భయపడ్డాడు. అప్పటి నుంచి నేను ఎదురు పడ్డా తల వంచుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించాడు. నా జీవితంలో నా మొదటి ప్రేమ తనకు న్న సెక్స్ కోరిక వల్ల చెడు అనుభవంగా మిగిలిపోయింది. అయితే ఆ తర్వాత నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోనని.. ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పటికీ రానివ్వనని మా టీచర్ కి నేను కూడా మాటిచ్చాను. అప్పటి నుంచి నా జీవితం చదువు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా సాగుతోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.